యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ నటించి, నిర్మించిన సినిమా ‘ఉత్తమ విలన్’. ఎప్పట్నుంచో వివాదాలను ఎదుర్కొంటూ వస్తోన్న ఈ సినిమా చివరకు అన్ని అడ్డంకులను దాటి నిన్న (మే 1న) విడుదలకు సిద్ధమైంది. అయితే చివరి నిమిషంలో తలెత్తిన కొన్ని ఆర్ధిక ఇబ్బందుల వల్ల ఈ సినిమా నిన్న విడుదలకు నోచుకోలేదు. ఉదయం 6 గంటల నుంచే సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూసిన అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. నిన్న ఉదయం నుంచి రాత్రి వరకూ కూడా విడుదల విషయమై సరైన స్పష్టత లేకపోవడంతో అభిమానులు గందరగోళానికి గురయ్యారు.
ఇదిలా ఉంటే ఈరోజు కూడా ఉదయం షోలు క్యాన్సల్ కావడం మరింత ఆందోళనకు గురిచేసే అంశం. తమిళనాడు, ఏపీ, తెలంగాణలతో పాటు కర్ణాటకలో ఈ సినిమా కోసం ఎందరో ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో కమల్ అభిమానులు ఏకంగా ఆందోళనలకు సైతం దిగారు. తాజా సమాచారం మేరకు నిర్మాతలకు, ఫైనాన్షియర్లకు మధ్య చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈ సాయంత్రం కల్లా సినిమా షోస్ పడతాయని సినీ వర్గాలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. రమేష్ అరవింద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో హీరోయిన్లుగా ఆండ్రియా, పూజా కుమార్లు నటించారు.
