టాలీవుడ్ లో తన ఎంట్రీతోనే అందరి దృష్టి ఆకర్షించింది యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే.. కానీ ప్రస్తుతం కమర్షియల్ సక్సెస్ కోసం గట్టిగా పోరాడుతుంది. మాస్ మహారాజా రవితేజ సరసన ‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీకి ఆరంభంలోనే బాక్సాఫీస్ దగ్గర గట్టి షాక్ తగిలింది. ఆ తర్వాత స్టార్ హీరోలైన విజయ్ దేవరకొండతో ‘కింగ్డమ్’, దుల్కర్ సల్మాన్‌తో ‘కాంత’, రామ్ పోతినేని ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ లాంటి భారీ ప్రాజెక్టుల్లో నటించినా అదృష్టం కలిసిరాలేదు. వరుసగా నాలుగు ఫ్లాపులు పలకరించడంతో ఇప్పుడు ఆమె ఆశలన్నీ అక్కినేని అఖిల్ తో చేస్తున్న తాజా చిత్రం ‘లెనిన్’ పైనే నిలిచాయి.
విజయాలు రాకపోయినా.. తనదైన పర్ఫార్మెన్స్, గ్లామరస్ లుక్స్, అద్భుతమైన డ్యాన్స్ స్కిల్స్‌తో భాగ్యశ్రీ ఇప్పటికే మాస్ ఆడియన్స్‌లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. స్క్రీన్ ప్రెజెన్స్ పరంగా కూడా ఈ బ్యూటీకి ఆడియన్స్ నుంచి మంచి మార్కులే పడ్డాయి. కానీ ఇప్పుడు తన కెరీర్‌కు కావాల్సిందల్లా ఒక్క సాలిడ్ హిట్ మాత్రమే. ‘లెనిన్’తో గనక ఆ కమర్షియల్ బ్లాక్‌బస్టర్ ఆమె ఖాతాలో పడితే.. టాలీవుడ్‌లో ఈ భామ తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడం ఖాయమని ట్రేడ్ వర్గాలు సైతం విశ్లేషిస్తున్నాయి.
‘వినరో భాగ్యము విష్ణు కథ’ ఫేమ్ మురళీ కిషోర్ అబ్బూరు ఈ రూరల్ మాస్ యాక్షన్ డ్రామాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో అఖిల్ సరసన పల్లెటూరి వాతావరణంలో భాగ్యశ్రీ పాత్రకు సైతం కథలో మంచి ప్రాధాన్యత ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాల్లో వీరిద్దరి కెమిస్ట్రీ చాలా నేచురల్‌గా వర్కౌట్ అయ్యింది. తన కెరీర్‌కు ఈ ప్రాజెక్టు అత్యంత కీలకం కావడంతో, ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భాగ్యశ్రీ తన బెస్ట్ ఇస్తున్నట్లు ఇండస్ట్రీ టాక్.
తనపై ఉన్న మాస్ క్రేజ్‌ను ఈ సినిమా సక్సెస్‌గా మారుస్తుందా లేదా అన్నది ఇప్పుడు టాలీవుడ్‌లో ఆసక్తికరంగా మారింది. ఇక అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. జూన్ 26న ‘లెనిన్’ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.
