
సూపర్ స్టార్ రజినీకాంత్ మరియు బాలీవుడ్ సినిమా ‘మై హూ రజినీకాంత్’ నిర్మాతల మధ్య యుద్ధం ముగింపు దశకు చేరుకుంది. కాంట్రాక్ట్ కిల్లర్ కం సిబిఐ ఆఫీసర్ పాత్రలో తమిళ నటుడు ఆదిత్య ‘మై హో రజినీకాంత్’ సినిమాలో హీరోగా నటించారు. ఈ సినిమా టైటిల్, తన ఇమేజ్ డామేజ్ చేసే విధంగా ఉందని, అందువల్ల సినిమా విడుదలపై నిషేధం విధించాలని కోరుతూ గత ఏడాది సెప్టెంబర్ లో రజినీకాంత్ చెన్నై హైకోర్టును ఆశ్రయించారు. ఇరువురి వాదనలు విన్న కోర్టు ‘మై హూ రజినీకాంత్’ దర్శకనిర్మాతలను టైటిల్ మార్చమని ఆదేశించారు. దర్శకుడు ఫైసల్ సైఫ్ టైటిల్ మార్చడానికి సుముఖంగానే ఉన్నారు. నిర్మాతలు మాత్రం సుప్రీం కోర్టుకు వెళ్ళడానికి సిద్దమయ్యారు.
ఒక దర్శకుడిగా, రచయితగా రజినీకాంత్ గారిని భాధపెట్టే ఉద్దేశం నాకు లేదు. నా సినిమా అంతా రజినీకాంత్ రావు అనే పాత్ర చుట్టూ తిరుగుతుంది. అందుకే, ‘మై హూ రజినీకాంత్’ అనే టైటిల్ పెట్టాను. టైటిల్ మార్చడానికి నిర్మాతలు ఒప్పుకోవడం లేదు, వారు సుప్రీం కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది. వ్యక్తిగతంగా నాకు ఈ వివాదానికి ఇంతటితో ముగింపు పలకాలని భావిస్తున్నాను అని దర్శకుడు ఫైసల్ సైఫ్ వ్యాఖ్యానించారు. వివాదంతో పాటు సినిమాకు కావలిసినంత ఫ్రీ పబ్లిసిటీ కూడా లభించింది.