‘రామాయణం’లో రావణుడి పాత్రపై యష్ వ్యాఖ్యలు.. అంచనాలే అదనపు ఒత్తిడి తెచ్చాయన్న ‘రాకింగ్ స్టార్’

Ramayana

బాలీవుడ్ దర్శకుడు నితేష్ తివారీ తెరకెక్కిస్తున్న పౌరాణిక చిత్రం ‘రామాయణం’. ఈ భారీ చిత్రంలో రావణాసురుడి పాత్రలో కన్నడ నటుడు యష్ నటిస్తున్నారు. తాజాగా శాన్ డియాగో కామిక్-కాన్ ఈవెంట్‌లో పాల్గొన్న ఆయన, ఐజీఎన్ (IGN) ఇంటర్వ్యూలో ఈ పాత్ర పోషించడం వెనుక ఉన్న సవాళ్లను పంచుకున్నారు.

అంచనాలే అదనపు ఒత్తిడి..

సరికొత్త కథతో సినిమా తీస్తే అందులో నటుడు ఏం చేసినా అది ఆ పాత్రగా మారిపోతుందని, కానీ ప్రసిద్ధ కథల్లో నటించేటప్పుడు పరిస్థితి భిన్నంగా ఉంటుందని యష్ అభిప్రాయపడ్డారు. “రావణాసురుడి పాత్ర గురించి ఇప్పటికే ప్రతి ఒక్కరికీ స్పష్టమైన అవగాహన ఉంది. గతంలో చాలా మంది నటులు ఈ పాత్రను రకరకాలుగా పోషించారు. అందుకే ప్రేక్షకుల మనస్సుల్లో ఉండే అంచనాలు నటుడిపై ఒత్తిడిని పెంచుతాయి” అని ఆయన వెల్లడించారు.

కొత్త కోణంలో రావణుడి పాత్ర..

గతంలో వచ్చిన వెర్షన్లను అనుకరించడం కంటే, రావణాసురుడు అలా ప్రవర్తించడానికి గల కారణాలు, ఆయన ఆలోచనా విధానాన్ని అర్థం చేసుకోవడంపైనే తాను దృష్టి సారించానని యష్ తెలిపారు. చిన్నతనం నుంచి తాతయ్య చెప్పిన కథల ద్వారా రామాయణం తన జీవితంలో భాగంగా ఉందని గుర్తుచేసుకున్న ఆయన, దర్శకుడు నితేష్ తివారీ పూర్తి స్వేచ్ఛ ఇవ్వడంతో రావణుడి పాత్రను కొత్త కోణంలో చూపించే ప్రయత్నం చేశానని స్పష్టం చేశారు.

నమిత్ మల్హోత్రా నిర్మాణంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్నారు. సన్నీ డియోల్, రవి దూబే, రకుల్ ప్రీత్ సింగ్, లారా దత్తా కీలక పాత్రల్లో కనిపిస్తున్న ఈ సినిమా మొదటి భాగం దీపావళికి థియేటర్లలోకి రానుంది.

Exit mobile version