
తెలుగు హీరోల్లో ప్రస్తుతం నెంబర్ వన్ స్థానానికి అతి దగ్గరగా ఉన్నది సూపర్ స్టార్ మహేష్ బాబే అనడంలో ఎటువంటి సందేహం లేదు. తన ప్రతీ సినిమాలో యాక్టింగ్‌లో కొత్తదనాన్ని చూపిస్తూ ఎవరికి అందనంత ఎత్తుకు చేరుకున్నారు మహేష్. నటుడిగా మహేష్ నుంచి ఎంతో నేర్చుకోవచ్చనేది కొత్తగా సినీ పరిశ్రమకు రావాలనుకునే ప్రతీ ఒక్కరిమాట. కేవలం ఆయన సినిమాలు చూడడం ద్వారానే చాలా నేర్చుకోగలం అనుకునే నటులున్న సమయంలో మహేష్‌తో కలిసి నటిస్తే ఇంకెంత నేర్చుకోవచ్చు?
యువహీరో రాహుల్ రవీంద్రన్ ప్రస్తుతం ఆ అవకాశాన్ని అందుకున్నారు. మహేష్ హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న భారీ సినిమాలో నటించే అవకాశం యువహీరో రాహుల్‌ను వరించిన విషయం తెలిసిందే! ఈ సినిమాలో సినిమాను మలుపుతిప్పే ఓ కీలకపాత్రలో రాహుల్ నటిస్తున్నారు. మలేషియాలో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్‌లో రాహుల్ ఇప్పటికే జాయిన్ అయ్యారు. మహేష్‌తో కలిసి నటించడం పట్ల తన ఆనందాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు రాహుల్. అంత పెద్ద హీరో అయి ఉండి కూడా ప్రతీ షాట్ విషయంలోనూ మహేష్ అద్భుతమైన శ్రద్ధ కనబరుస్తారని, చిన్న షాట్‌లోనూ తన బెస్ట్ ఇవ్వాలనుకుంటారని రాహుల్ అన్నారు.
మహేష్-కొరటాల శివల సినిమా షూటింగ్ ప్రస్తుతం మలేషియాలో జరుగుతోంది. సినిమాకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరిస్తున్నారు. రాహుల్ రవీంద్రన్ పాత్ర సినిమాలో కీలకం కానుందని తెలుస్తోంది. ఈ సినిమాలో మహేష్ సరసన శృతిహాసన్ నటిస్తుండగా, దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.

