
లవర్ బాయ్‌గా, యాక్షన్ హీరోగా తానేంటో నిరూపించుకున్న నాగ చైతన్య.. తాజాగా కాన్ మ్యాన్‌గానూ ఆకట్టుకున్నాడు. ‘దోచేయ్’ సినిమాలో మోసం, దొంగతనాలు చేసే వ్యక్తిగా కనిపించి నాగ చైతన్య అందరినీ అలరించాడు. ‘స్వామిరారా’ సినిమాతో తెలుగులో క్రైమ్ కామెడీ సినిమాలకు కొత్త దారిని చూపిన దర్శకుడు సుధీర్ వర్మ నాగ చైతన్యతో తెరకెక్కించిన సినిమాయే ‘దోచేయ్’. ఏప్రిల్ 24న విడుదలైన ఈ సినిమా ‘స్వామిరారా’ లైన్లో ఓ మంచి ప్రయత్నంగా గుర్తింపు తెచ్చుకుంది.
‘దోచేయ్’ సినిమా తర్వాత నాగ చైతన్య కొత్త సినిమా ఏదీ ఓకే చేయలేదు. అయితే ‘కార్తికేయ’ లాంటి హిట్ ఇచ్చిన దర్శకుడు చందూ మొండేటితో మాత్రం ఓ సినిమా విషయమై చర్చలు జరుపుతూ వస్తున్నాడు. తాజాగా ఈ సినిమాను దర్శకుడు చందూ కన్‌ఫర్మ్ చేసేశాడు. ఈ సినిమా జూలై నెల నుండి సెట్స్‌పైకి వెళ్ళనుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.