
సహజమైన నటనతో, మంచి టైమింగ్ ఉన్న డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులను కట్టిపడేసిన యువహీరో.. నాని. ‘ఎవడే సుబ్రమణ్యం’ సినిమాతో ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న మంచి కమర్షియల్ విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఆ ఉత్సాహంతో నాని వరుస సినిమాలతో బిజీ అయిపోయాడు. ఇప్పటికే దర్శకుడు మారుతితో ‘భలే భలే మగాడివోయ్’ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసిన నాని, తాజాగా 14రీల్స్ సంస్థ నిర్మిస్తున్న సినిమా షూటింగ్‌కు షిఫ్ట్ అయిపోయిన విషయం తెలిసిందే!
‘అందాల రాక్షసి’ సినిమాతో ఓ అందమైన ప్రేమకథను అందించిన హను రాఘవపూడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం అనంతపూర్‌లోని ఉరవకొండ పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. జూలై 6న మొదలైన ఈ షెడ్యూల్ నిర్విరామంగా కొనసాగుతోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో నాని అనంతపూర్ బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా కనిపించనున్నాడని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు ‘జై బాలయ్య’ అనే ఆసక్తికర టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ విషయమై చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటనేదీ ఇంకా వెలువడలేదు. విశాల్ చంద్రశేఖర్ ఈ సినిమాకు సంగీతం సమకూరుస్తున్నారు.