వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘యాత్ర’ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో.. కలెక్షన్లు భారీగా వస్తున్నాయి. ఈ సినిమా తీసిన టీం కి ఇటీవలే వైఎస్ జగన్ ట్విట్టర్ ద్వారా కృతజ్ఞతలు తెలిపిన విషయం తెలిసిందే. కాగా తాజాగా వైఎస్ విజయమ్మ కూడా ఈ చిత్రాన్ని చూసి యాత్ర చిత్రబృందాన్ని మెచ్చుకుంది.
ఈ సినిమాను వైఎస్ విజయమ్మ ప్రసాద్ ల్యాబ్ లో ప్రత్యేకంగా తిలకించారు. అనంతరం మీడియాతో విజయమ్మ మాట్లాడుతూ.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్రను యాత్ర రూపంలో తెరకెక్కించిన తీరు అద్భుతంగా ఉందన్నారు. ఈ సినిమాను ఇంత చక్కగా తెరకెక్కించిన మహి వి రాఘవ్ కు, అలాగే ఈ చిత్ర నిర్మాతలకు నా కృతజ్ఞతలు అని ఆమె తెలిపారు.
రాజశేఖర్ రెడ్డి వ్యక్తిత్వాన్ని, ఆశయాలను, రాజకీయ జీవితాన్ని మరోసారి ప్రజలకు కళ్ళకు కట్టినట్టుగా చూపించారని ఆమె చెప్పుకొచ్చారు. వైఎస్సార్ ని ప్రజలందరూ ఆరాదించారని, ఇప్పుడు వారి పిల్లలను కూడా ప్రజలు ఆదరిస్తున్నందుకు ఆమె ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పారు.
