ముఖ్య అంశాలు
- పెయిడ్ ప్రీమియర్స్, తొలిరోజు వసూళ్లు కలుపుకుని ‘ధురంధర్ 2’ (Dhurandhar 2) ఇండియాలో ఏకంగా రూ.145.55 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టి సరికొత్త చరిత్ర సృష్టించింది.
- ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజే రూ.236 కోట్లకు పైగా గ్రాస్ సాధించి, జవాన్, యానిమల్, పఠాన్ సినిమాల ఓపెనింగ్ రికార్డులను బ్రేక్ చేసింది.
- తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజు కేవలం హిందీ వెర్షన్ మాత్రమే రిలీజైనా భారీ వసూళ్లు దక్కించుకుంది. రేపటి నుంచి తెలుగు డబ్బింగ్ వెర్షన్ థియేటర్లలో సందడి చేయనుంది.
రణ్వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన స్పై థ్రిల్లర్ ‘ధురంధర్ 2’ (Dhurandhar: The Revenge) బాక్సాఫీస్ దగ్గర సునామీ సృష్టిస్తోంది. గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, తొలి రోజే ఊహించని స్థాయిలో వసూళ్ల వర్షం కురిపించింది. బాలీవుడ్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ ఓపెనర్‌గా నిలిచి, షారుఖ్ ఖాన్ ‘జవాన్’, రణ్‌బీర్ కపూర్ ‘యానిమల్’ రికార్డులను పక్కకు నెట్టేసింది.
సినిమా రిలీజ్‌కు ముందు రోజు బుధవారం నిర్వహించిన పెయిడ్ ప్రీమియర్స్‌కు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. కేవలం ఈ ప్రీమియర్స్ ద్వారానే ఇండియాలో రూ.43 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టారు. ఇక ఫస్ట్ డే ఏకంగా రూ.102.55 కోట్లు నెట్ వసూలు చేసింది. దీంతో ఇండియాలో తొలి రోజు (ప్రీమియర్స్ కలుపుకుని) మొత్తంగా రూ.145.55 కోట్ల నెట్ రాబట్టింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజు కేవలం హిందీ వెర్షన్ మాత్రమే ప్రదర్శించారు. ఇక్కడ కూడా హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో రణ్వీర్ సింగ్ సత్తా చాటారు. రేపటి నుంచి ఈ సినిమా తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడా థియేటర్లలోకి రానుంది.
ప్రపంచవ్యాప్తంగా రికార్డుల మోత
ఓవర్సీస్లోనూ ‘ధురంధర్ 2’ (Dhurandhar 2) కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. నార్త్ అమెరికాలో కేవలం ప్రీమియర్స్ ద్వారానే 2 మిలియన్ డాలర్లకు పైగా (సుమారు రూ.16 కోట్లు) కలెక్ట్ చేసి సరికొత్త రికార్డ్ సెట్ చేసింది. ఓవరాల్‌గా ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు సుమారు రూ.236.63 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అల్లు అర్జున్ ‘పుష్ప 2’ తర్వాత ఇండియాలో సెకండ్ బిగ్గెస్ట్ ఓపెనర్‌గా ఈ సినిమా నిలిచింది. బాహుబలి 2, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 లాంటి పాన్ ఇండియా సినిమాల ఫస్ట్ డే రికార్డులను సైతం ఈ హిందీ సినిమా బ్రేక్ చేయడం ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది.
మరోవైపు, ఆదిత్య ధర్ టేకింగ్, రణ్వీర్ సింగ్ యాక్షన్ సీక్వెన్స్‌లపై ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. 2025లో వచ్చిన మొదటి పార్ట్ ‘ధురంధర్’ సూపర్ హిట్ అవ్వడంతో, ఈ సీక్వెల్‌పై ముందు నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించారు. రేపటి నుంచి తెలుగు వెర్షన్ కూడా అందుబాటులోకి రానుండటంతో పాటు, వీకెండ్ సెలవులు తోడవడంతో వసూళ్లు మరింత పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇదే జోరు కొనసాగితే అతి త్వరలోనే ఈ మూవీ రూ.500 కోట్ల క్లబ్లో చేరడం ఖాయం.
