సమీక్ష : ధర్మయోగి – ఆకట్టుకునే పొలిటికల్ థ్రిల్లర్..!

Kaashmora review

విడుదల తేదీ : అక్టోబర్ 29, 2016

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

దర్శకత్వం : ఆర్‌.ఎస్‌.దురై సెంథిల్‌కుమార్‌

నిర్మాత : సి.హెచ్‌.సతీష్‌కుమార్‌

సంగీతం : సంతోష్ నారాయణన్

నటీనటులు : ధనుష్, త్రిష, అనుపమ పరమేశ్వరన్

తమిళ, తెలుగు సినీ పరిశ్రమల్లో హీరో ధనుష్‌కు ఉన్న ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. తమిళంలో స్టార్ హీరోల్లో ఒకరుగా కొనసాగుతూ వస్తోన్న ధనుష్, తెలుగులోనూ డబ్బింగ్ సినిమాలతో మంచి ఫాలోయింగ్ సంపాదించారు. ఇక తాజాగా ఆయన హీరోగా నటించిన ‘కోడి’ అనే తమిళ సినిమాను తెలుగులో ‘ధర్మ యోగి’ అన్న పేరుతో డబ్ చేశారు. తమిళనాట నిన్ననే విడుదలైన ఈ సినిమా తెలుగులో ఒకరోజు ఆలస్యంగా నేడు విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

కథ :

ధర్మ (ధనుష్), యోగి (ధనుష్) కవలపిల్లలు. చిన్నప్పట్నుంచే తండ్రితో కలిసి రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండే యోగి, పెద్దయ్యాక అదే రాజకీయాల్లో తనదైన గుర్తింపు తెచ్చుకుంటాడు. ఇక ధర్మ బాగా చదువుకొని కాలేజీ ప్రొఫెసర్ అవుతాడు. బాపట్ల నియోజకవర్గంతో పాటు గుంటూరు జిల్లా మొత్తానికీ యోగీ పార్టీ యూత్ లీడర్‌గా కొనసాగుతూంటాడు. అతడి ప్రేయసి రుద్ర (త్రిష) మాత్రం వేరొక పార్టీలో యోగి స్థాయి పదవిలోనే కొనసాగుతూంటూంది. ఒక మధ్యంతర ఎన్నికల్లో యోగి, రుద్రలకు పోటీ జరుగుతుంది. ఆ ఎన్నికల సమయంలోనే యోగి హత్య కాబడతాడు. యోగిని ఎవరు హత్య చేశారు? యోగి చనిపోవడంతో అదే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎంపికైన ధర్మ, ఆ హత్య కేసును ఎలా చేధిస్తాడు? ఈ కథలో మాలతి (అనుపమ పరమేశ్వరన్) ఎవరూ? లాంటి ప్రశ్నలకు సమాధానమే సినిమా.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అంటే కథే అని చెప్పాలి. ఆ కథలోని బలమైన పాయింట్‍ను ఆసక్తికరమైన సన్నివేశాలు, ట్విస్ట్‌లు, స్క్రీన్‌ప్లేతో నడపడం మరింత బాగా ఆకట్టుకునే అంశం. త్రిష రోల్‌లోని ట్విస్ట్ అదిరిపోయేలా ఉంది. ఎవ్వరూ ఊహించని విధంగా డిజైన్ చేసిన పాత్రలో త్రిష నటన కూడా కట్టిపడేసేలా ఉంది. ధనుష్ ఎప్పట్లాగే తన ఎనర్జీతో అలవోకగా నటించేశాడు. రెండు పాత్రల్లో అతడు చూపిన వైవిధ్యం కూడా బాగా ఆకట్టుకుంది. యోగి రోల్‌లో అతడి గెటప్, స్టైల్ చాలా బాగున్నాయి.

ధనుష్, త్రిషల మధ్యన రొమాంటిక్ ట్రాక్ చాలా కొత్తగా ఉంది. రాజకీయాల్లో ప్రత్యర్థులుగా తలపడుతూనే, ఒకరినొకరు ఇష్టంగా కూడా ప్రేమించుకుంటూ ఉండే వీరిద్దరి మధ్యన వచ్చే చాలా సన్నివేశాలు కట్టిపడేసేలా ఉన్నాయి. అనుపమ పరమేశ్వరన్ తన పరిధిమేర బాగా నటించింది. అనవసరమైన ఆర్భాటాలకు పోకుండా అసలు కథ చుట్టూనే సినిమాను నడిపించడం ఆకట్టుకునే అంశం. ఇంటర్వెల్, సెకండాఫ్‌లో వచ్చే మూడు, నాలుగు ట్విస్ట్‌లు బాగా ఆకట్టుకున్నాయి.

మైనస్ పాయింట్స్ :

కొన్నిచోట్ల కథ నెమ్మదిగా నడవడమే మైనస్‌గా చెప్పుకోవాలి. అనవసరమైన డీటైలింగ్‌ ఇచ్చి కొన్నిచోట్ల సినిమాను సాగదీసినట్లు కూడా అనిపించింది. పూర్తిగా సీరియస్ పంథాలోనే సాగే ఈ సినిమాలో మాస్ ఎలిమెంట్స్ బాగానే ఉన్నా, పక్కా తెలుగు సినిమా కమర్షియల్ ఎలిమెంట్స్ పెద్దగా లేవు. ఇవే అంశాలను కోరుకొని వచ్చేవారికి ఇది నిరాశపరచే అంశమే. తెలుగు డబ్బింగ్ సాదాసీదాగా ఉంది.

సాంకేతిక విభాగం :

సాంకేతిక అంశాల పరంగా చూస్తే, దర్శకుడు దురై సెంథిల్ కుమార్ ఎంచుకున్న కథ, దానికి రాసుకున్న స్క్రీన్‌ప్లే చాలా బాగున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాకు బలమైనదే స్క్రీన్‌ప్లే. చిన్న ట్విస్ట్‌లన్నింటినీ ఒక్కొక్కటిగా కథలో రివీల్ చేస్తూ, ఊహించని పాత్రలను డిజైన్ చేసి రైటింగ్ పరంగా దురై మంచి ప్రతిభ చూపాడు. నటీనటులందరి దగ్గర్నుంచీ అద్భుతమైన నటనను రాబట్టడం, సస్పెన్స్ ఎలిమెంట్‌ను చివరివరకూ నటిపించడం లాంటి అంశాల్లో దర్శకుడిగా దురై విజయం సాధించాడనే చెప్పాలి.

సంగీత దర్శకుడు సంతోష్ నారాయణ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగుంది. రెండు పాటలు వినడానికి కూడా బాగున్నాయి. వెంకటేష్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. పూర్తిగా సెమీ అర్బన్ నేపథ్యంలో నడిచే సినిమా మూడ్‌ను, కథ అవసరానికి తగ్గ లైటింగ్‍ను చాలా బాగా వాడుకున్నారు. ప్రకాష్ మబ్బు ఎడిటింగ్ బాగుంది. ప్రొడక్షన్ వ్యాల్యూస్‌కు వంకపెట్టడానికి లేదు. తెలుగు డబ్బింగ్ పనులు మాత్రం ఆ స్థాయిలో లేవు.

తీర్పు :

పొలిటికల్ థ్రిల్లర్స్‌లో కథ, కథనాలు బలంగా ఉండడం ఎంత అవసరమో, అందుకు ఏమాత్రం తగ్గకుండా ఆ స్థాయి పాత్రలు ఉండడం కూడా అంతే అవసరం. ధర్మ యోగి, ఇటు బలమైన కథ, కథనాలతో పాటు, బలమైన పాత్రలతో అలా ఆకట్టుకునే ఓ సినిమా. ధనుష్, త్రిషల అద్భుతమైన నటన, ఆసక్తికరమైన స్క్రీన్‌ప్లేతో వచ్చిన ఈ సినిమాలో అక్కడక్కడా కాస్త రిపీటెడ్ సన్నివేశాలు రావడమే మైనస్‌గా చెప్పాలి. ఒక్కమాటలో చెప్పాలంటే.. అంచనాలు పెట్టుకొనే వెళ్ళినా కూడా, ఈ ‘ధర్మ యోగి’ మెప్పించడంలో ఎక్కడా తగ్గడు.

123telugu.com Rating : 3/5

Reviewed by 123telugu Team

Click here for English Review

Exit mobile version