విడుదల తేదీ : అక్టోబర్ 12, 2018
123తెలుగు.కామ్ రేటింగ్ : 1.5/5
నటీనటులు : అర్జున్ యజిత్, భరత్ బండారు, సౌమ్య వేణుగోపాల్, పావని & తదితరులు
దర్శకత్వం : రామస్వామి
నిర్మాతలు : వబ్బిన వెంకట రావు
సంగీతం : కృష్ణ సాయి
సినిమాటోగ్రఫర్ : మోహన్ చంద్
స్క్రీన్ ప్లే : రామస్వామి
రామ స్వామి దర్శకత్వంలో అర్జున్ యజిత్, భరత్ బండారు, సౌమ్య వేణుగోపాల్, పావని కలిసి నటించిన చిత్రం “మూడు పువ్వులు ఆరు కాయలు”. కాగా ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ఈ చిత్రం, ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !
కథ :
అర్జున్ (అర్జున్ యాగిత్), భరత్ (నాగరాజు) మరియు రామస్వామి (కర్పూరం) వీరి ముగ్గురు మనస్తత్వాలు, జీవిత ఆశయాలు వేరైనా.. ముగ్గురూ రూమ్మేట్స్. అర్జున్ ‘యస్.ఐ’ అవ్వాలని ఆశయంతో సాగుతుండగా, కర్పూరం ఎలాగైనా ఒక మంచి అమ్మాయిని చూసి ప్రేమించి పెళ్లి చేసుకోవాలని ప్రయత్నిస్తుంటాడు. ఇక దిగువ మధ్యతరగతి యువకుడైన నాగరాజు హారిక (పావని) ప్రేమలో పడి.. తన జీవితంలో ముఖ్యమైనవి కోల్పోతాడు.
అయితే అర్జున్, కర్పూరం కూడా తమ జీవిత ఆశయాలను సాధించుకున్నే క్రమంలో వారికి ఎలాంటి కష్టాలు, అడ్డంకులు వచ్చాయి ? వాట్ని వాళ్ళు ఎలా ఎదురుకున్నారు ? ఆ ఎదురుకున్నే క్రమంలో వాళ్ళు ఎన్ని బాధలు పడ్డారు ? చివరకి వాళ్ళు అనుకున్నది సాధించారా ? లేదా ? లాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
ఈ సినిమాలో హీరోలుగా నటించిన అర్జున్, భరత్ ఎలాంటి తడబాటు, బెఱుకు లేకుండా చాలా చక్కగా కాన్ఫిడెంట్ గా నటించారు . హీరోయిన్లుగా సౌమ్య, పావనిలు కూడా తమ నటనతో ఆకట్టుకున్నే ప్రయత్నం చేశారు. పావని తన గ్లామర్ తో సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఒక ఎకరం భూమి ఉన్న రైతు పాత్రలో నటించిన తనికెళ్ళ భరణి తక్కువ సీన్స్ లోనే కనిపించనప్పటికీ.. చాలా ముఖ్యమైన పాత్రను పోషించారు. కొడుకు బాగు కోసం, ప్రాణం ఇచ్చే తండ్రిగా ఆయన నటన ఎమోషనల్ గా కనెక్ట్ చేస్తోంది. సినిమాకే హైలెట్ నిలుస్తోంది.
కమెడియన్లు కృష్ణ భగవాన్, పృథ్వి, జబర్దస్త్ రామ్ ప్రసాద్, రంగస్థలం మహేష్ వీళ్ళు కొద్ది సేపు కనిపించనా తన కామెడీ టైమింగ్ తో అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేశాడు. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే చేశారు. దర్శకుడు రామస్వామి ఎక్కువుగా వీలైనంత వరకు నవ్వించాడనికే ప్రయత్నం చేశారు.
మైనస్ పాయింట్స్ :
అసలు సినిమాలో చెప్పుకోవడానికి మెయిన్ పాయింట్ అంటూ ఏం ఉండదు. దర్శకుడు తనకు తోచినట్లు రాసుకుంటూ తీసుకుంటూ వెళ్ళిపోయాడు. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ లో చాలా భాగం సంబంధం లేని సీన్లతో అర్ధం లేని కామెడీతో టార్చర్ పెడితే, సెకెండ్ హాఫ్ సాగతీత సన్నివేశాలతో మూర్ఖపు హాస్యంతో విసుగు విరక్తి పుట్టిస్తోంది.
సినిమా మొదలైన పది నిముషాలకే ఈ సినిమా ఏ స్థాయి సినిమానే అర్థమయిపోతుంది. నెట్ లోని పాత కాలపు జోక్ లతో, కాలం చెల్లిన సీన్స్ తో నవ్వించడానికి శతవిధాలా ప్రయత్నం చేసినప్పటికీ.. ప్రేక్షకులు మాత్రం మనస్ఫూర్తిగా ఒక్క సారి కూడా నవ్వుకోరు.
దర్శకుడు అనవసరమైన సీన్స్ తో సినిమాని డైవర్ట్ చేశారు. అవసరానికి మించిన పండని హాస్య సన్నివేశాలు కూడా ఎక్కువైపోయాయి. దీనికి తోడు దర్శకుడు ఉన్న కంటెంట్ ను కూడా పూర్తిగా వాడుకోలేదు. ఆయన కథ కథనాన్ని ఆసక్తికరంగా మలచకపోగా.. ఉన్న ఎమోషనల్ కంటెంట్ ను కూడా బాగా ఎలివేట్ చేయలేకపోయారు.
సాంకేతిక విభాగం :
దర్శకుడు రామస్వామి పేపర్ మీద రాసిన స్క్రిప్ట్ ను స్క్రీన్ మీద ఎగ్జిక్యూట్ చేయలేకపోయారు. పైగా ఆయన రాసుకున్న కథకథనాల్లో సహజత్వంతో పాటు కనీస విషయం కూడా లేదు. మోహన్ చంద్ కెమెరా పనితనం కొన్ని సన్నివేశాలల్లో పర్వాలేదనిపిస్తుంది.
కృష్ణ సాయి అందించిన పాటల్లో ఒక పాట ఆకట్టుకుంటుంది. ఆయన అందించిన నేపధ్య సంగీతం సినిమాకి తగ్గట్లు సాగదు. ఎడిటర్ దర్శకుడు అభిరుచికి తగ్గట్లే ఎడిటింగ్ చేసుకుంటూ వెళ్లిపోయారు. కథకు తగ్గట్లుగానే ఈ చిత్ర నిర్మాత వబ్బిన వెంకట రావు నిర్మాణ విలువలు ఉన్నాయి.
తీర్పు :
రామ స్వామి దర్శకత్వంలో అర్జున్ యజిత్, భరత్ బండారు, సౌమ్య వేణుగోపాల్, పావని కలిసి నటించిన చిత్రం “మూడు పువ్వులు ఆరు కాయలు’ చిత్రం ఆకట్టుకోదు. కానీ తనికెళ్ళ భరణి సన్నివేశాలు సినిమాకే హైలెట్ గా నిలుస్తాయి. కొడుకు బాగు కోసం, ప్రాణం ఇచ్చే తండ్రిగా ఆయన నటన ఎమోషనల్ గా కనెక్ట్ అవుతుంది. కాకపొతే సినిమాల్ని రెగ్యూలర్ గా చూసే ప్రేక్షకులకి ఈ చిత్రం అస్సలు రుచించకపోగా.. విపరీతమైన చికాకుకు గురిచేస్తోంది. ఓవరాల్ గా సినిమాలోని చాలా సన్నివేశాలు మరీ నాటకీయంగా గందరగోళంగా ఉండటంతో సినిమా సగటు ప్రేక్షకుడ్ని కూడా ఆకట్టుకోదు.
123telugu.com Rating : 1.5/5
Reviewed by 123telugu Team