సమీక్ష : ‘ది ఇండియన్ స్టోరీ’ – కథాంశం బాగున్నా కథ కథనాలు ఆకట్టుకోవు !

The Indian Story Movie Review in Telugu

విడుదల తేదీ : మే 03, 2024

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

నటీనటులు: రాజ్ భీమ్ రెడ్డి, జరా ఖాన్, చమ్మక్ చంద్ర, ముక్తార్ ఖాన్, రామరాజు, సమీర్, సి.వి.ఎల్ నరసింహారావు , అనంత్ తదితరులు.

దర్శకుడు: ఆర్ రాజశేఖర్ రెడ్డి

నిర్మాత: రాజ్ భీమ్ రెడ్డి

సంగీత దర్శకుడు: సందీప్ కనుగుల

సినిమాటోగ్రఫీ: నిమ్మల జైపాల్ రెడ్డి

సంబంధిత లింక్స్: ట్రైలర్

దర్శకుడు ఆర్. రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో రాజ్ భీమ్ రెడ్డి హీరోగా, జరా ఖాన్ హీరో హీరోయిన్ గా వచ్చిన సినిమా ‘ది ఇండియన్ స్టోరీ’. ఈ సినిమాని రాజ్ భీమ్ రెడ్డి నిర్మించారు. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

కథ :

రాష్ట్రంలో హిందూ – ముస్లిం ల మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి. హిందూ వర్గానికి శ్రీరామ్ (రామరాజు), ముస్లిం వర్గానికి కబీర్ ఖాన్ (ముక్తార్ ఖాన్) నాయకత్వం వహిస్తుంటారు. ఒకరిపై మరొకరు ప్రతీకార దాడులు చేసుకుంటూ మత విద్వేషాలతో రగిలిపోతుంటారు. ఈ నేపథ్యంలో వైజాగ్ నుంచి రెహమాన్ (రాజ్ భీమ్ రెడ్డి) బంగారు బిస్కెట్లు అమ్మడానికి హైదరాబాద్ వస్తాడు. ఫేకు (చమ్మక్ చంద్ర) రెహమాన్ కి సాయం చేస్తుంటాడు. ఈ క్రమంలో జరిగిన నాటకీయ పరిణామాల మధ్య కబీర్ ఖాన్ (ముక్తార్ ఖాన్) టీమ్ లోకి రెహమాన్ ఎలా వెళ్ళాడు ?, అసలు రెహమాన్ ఎవరు ?, అతని అసలు పేరు ఏమిటి ?, అతనికి శ్రీరామ్ వర్గానికి మధ్య సంబంధం ఏమిటి ?, ఈ మధ్యలో కబీర్ ఖాన్ మనిషి అయిన డాక్టర్ ఆయేషా (జరా ఖాన్)తో రెహమాన్ ప్రేమ ఎలా సాగింది ?, చివరికి ఈ కథ ఎలా ముగిసింది ? అనేది మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్ :

మతాలు వేరైనా మనుషులంతా ఒక్కటే అనే కాన్సెప్ట్‌ తో, సమాజంలో మత సామరస్యం ఉండాలనే మెసేజ్ తో వచ్చిన ఈ సినిమాలో మెయిన్ థీమ్, కొన్ని ఎమోషనల్ సీన్స్ మరియు సినిమాలో చెప్పిన సందేశం ఆకట్టుకున్నాయి. దర్శకుడు ఆర్ రాజశేఖర్ రెడ్డి కొన్ని సన్నివేశాలను బాగా తెరకెక్కించాడు. మతం పేరుతో జరిగే రాజకీయ క్రీడను, మత విద్వేషాల రగడను ఆర్ రాజశేఖర్ రెడ్డి బాగా ఎస్టాబ్లిష్ చేశాడు.

అలాగే, కథలో అంతర్లీనంగా ఇచ్చిన మెసేజ్ కూడా చాలా బాగుంది. మతాల పై అవగాహన కల్పించే క్రమంలో వచ్చే సన్నివేశాలు కూడా బాగున్నాయి. అలాగే, మత నాయకుల ట్రాక్ అండ్ ఫ్లాష్ బ్యాక్ సీక్వెన్స్ బాగుంది. ఇక హీరో పాత్రలో రాజ్ భీమ్ రెడ్డి బాగానే నటించాడు. మత నాయకులుగా ముక్తార్ ఖాన్, రామరాజు చాలా బాగా నటించారు. అలాగే సమీర్, సి.వి.ఎల్ నరసింహారావు , అనంత్ మరియు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

మైనస్ పాయింట్స్ :

సినిమాలో మొదటి నుంచి ప్లే స్లోగానే సాగుతోంది. కథా నేపథ్యం, పాత్రల చిత్రీకరణ బాగున్నా.. కొందరి నటీనటుల పనితీరు ఆకట్టుకోదు. హీరోయిన్ గా జరా ఖాన్ తేలిపోయింది. ఆమె నటన కూడా బాగాలేదు. చమ్మక్ చంద్ర కామెడీ కూడా ఏ మాత్రం వర్కౌట్ కాలేదు. దీనికితోడు అతని ఓవర్ యాక్టింగ్ కూడా విసిగించింది. సెకండ్ హాఫ్ లో రాజ్ భీమ్ రెడ్డి లుక్ కూడా బాగాలేదు.

దర్శకుడు ఆర్ రాజశేఖర్ రెడ్డి పాత్రల మధ్య ఎమోషన్స్ ను బాగా ఎస్టాబ్లిష్ చేసినా… కొన్ని చోట్ల మెలోడ్రామాలా అనిపిస్తోంది. ఫస్ట్ హాఫ్ కామెడీ కోసం పెట్టిన అనవసరమైన డిస్కషన్ అండ్ సీన్స్ కూడా బోరింగ్ గానే సాగాయి. సినిమాలో సెకండాఫ్ కూడా స్లోగా సాగింది. ప్రధానంగా కొన్ని సన్నివేశాల్లో గ్రిప్పింగ్ నరేషన్ మిస్ అయింది. నేపథ్యం కొత్తగా తీసుకున్నా… కొన్ని సన్నివేశాలు రొటీన్ గానే సాగాయి.

ఇక మ్యూజిక్ సినిమా స్థాయికి తగ్గట్లు లేదు. ఇలాంటి సహజమైన నేపథ్యంలో కావాల్సినన్నీ ఎమోషన్స్ ఉన్నా.. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా పూర్తిస్థాయిలో ఆకట్టుకోదు.

సాంకేతిక విభాగం :

ఆర్ రాజశేఖర్ రెడ్డి దర్శకుడిగా ఈ సినిమాకు న్యాయం చేశారు. ఐతే, స్క్రిప్ట్ పై ఇంకొంచెం శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది. సంగీత దర్శకుడు సందీప్ కనుగుల అందించిన సంగీతం కొన్ని సన్నివేశాల్లో తేలిపోయింది. సినిమాటోగ్రఫీ సినిమాకి ప్లస్ అయింది. సన్నివేశాలన్నీ చాలా సహజంగా సినిమా మూడ్ కి అనుగుణంగా నడుస్తాయి. నిర్మాత రాజ్ భీమ్ రెడ్డి ప్రొడక్షన్ డిజైన్ కూడా ఆకట్టుకుంది.

తీర్పు :

మత విద్వేషాల నేపథ్యంలో ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ ‘ది ఇండియన్ స్టోరీ’లో మెయిన్ థీమ్, ఎమోషన్స్ మరియు మెసేజ్ ఆకట్టుకున్నాయి. అయితే, స్క్రీన్ ప్లేలో స్లో నేరేషన్, కొందరి నటీనటుల పనితీరు ఆకట్టుకోకపోవడం, స్క్రిప్ట్ లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ లేకపోవడం వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. ఓవరాల్ గా మతపరమైన దాడుల బ్యాక్ డ్రాప్ లో డిఫరెంట్ ఎమోషనల్ డ్రామాలు ఇష్టపడేవారికి ఈ సినిమాలో కొన్ని అంశాలు నచ్చుతాయి.

123telugu.com Rating: 2.25/5

Reviewed by 123telugu Team

Exit mobile version