ఇంటర్వ్యూ : అడవి శేష్ – నా కెరీర్‌కి ల్యాండ్‌ మార్క్‌గా నిలిచే మూవీ ‘దొంగాట’.

ఇంటర్వ్యూ : అడవి శేష్ – నా కెరీర్‌కి ల్యాండ్‌ మార్క్‌గా నిలిచే మూవీ ‘దొంగాట’.

Published on Apr 14, 2015 5:17 PM IST

Adivi-Sesh
‘కర్మ’ సినిమా ద్వారా దర్శకుడిగా, నటుడిగా పరిచమై ఆ తర్వాత పూర్తి స్థాయి నటుడిగా మారిపోయారు అడవి శేష్. ‘పంజా’, ‘బలుపు’, ‘రన్‌ రాజా రన్’ లాంటి సినిమాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం మంచు లక్ష్మీ నిర్మిస్తున్న ‘దొంగాట’ సినిమాలో లీడ్ రోల్ చేశారు. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా అడవి శేష్‌తో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు..

ప్రశ్న) ‘దొంగాట’ సినిమా గురించి చెప్పండి ?

స) క్రైమ్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఓ సరికొత్త సినిమాయే దొంగాట. డబ్బు కోసం ఓ గ్యాంగ్ ప్రముఖ హీరోయిన్‌ను కిడ్నాప్ చేయడం, తర్వాత ఆ గ్యాంగ్‌కు ఎదురయ్యే సంఘటనలు, ఎదుర్కొనే సమస్యల చుట్టూ ఈ సినిమా నడుస్తుంది. తెలుగులో చాలా తక్కువగా ఇలాంటి జానర్ సినిమాలు వస్తుంటాయి. ఈ సినిమా ద్వారా వంశీ కృష్ణ అనే కొత్త దర్శకుడు వెండితెరకు పరిచయం కాబోతున్నారు.

ప్రశ్న) ఈ సినిమాలో మీ పాత్ర ఎలా ఉండబోతోంది?

స) దొంగాట సినిమాలో నాది లీడ్ రోల్. ఈ సినిమాలో వెంకట్ అనే పాత్రలో నటించా. డబ్బు కోసం ఎవరినైనా కిడ్నాప్ చేస్తే బాగుంటుందన్న ఆలోచనతో ఓ హీరోయిన్‌ను కిడ్నాప్ చేసే వ్యక్తిగా ఇందులో కనిపిస్తా. ఇప్పటివరకూ నేను చేయనటువంటి పాత్రగా దీన్ని చెప్పుకోవాలి. మొదటిసారి కామెడీ సన్నివేశాల్లో నటించేందుకు అవకాశం దక్కింది. దర్శకుడు వంశీ ఈ పాత్ర కోసం వేరే ఇతర నటులను పరిశీలించినా, చివరకు ఈ ఆఫర్ నన్ను వరించడం నా అదృష్టం. నా కెరీర్లో ఈ సినిమా లాండ్‌ మార్క్‌గా నిలిచిపోతుంది.

ప్రశ్న) ఈ పాత్ర కోసం ఏదైనా హోమ్‌వర్క్ చేశారా?

స) కామెడీ సన్నివేశాల్లో నటించడానికి కొంత వర్క్ చేశా. ఇక లుక్ విషయంలో దర్శకుడికి మంచి క్లారిటీ ఉంది. డ్రెస్సింగ్, హెయిర్ స్టైల్, నడిచే విధానం అన్నింట్లోనూ ఆయన ముందునుంచీ ఒక స్టైల్‌కి ఫిక్సయ్యారు. అది నేను ఫాలో అయిపోయాను.

ప్రశ్న) ట్రైలర్, ఆడియోకు ఎలాంటి స్పందన వస్తోంది?

స) చాలా మంచి స్పందన వస్తోందండీ. ట్రైలర్ కొత్తగా ఉందని అందరూ అంటున్నారు. ముఖ్యంగా కొత్తదనం కోరుకునే వారు ఈ సినిమా ట్రైలర్ చూశాక చాలా బాగా స్పందించారు. సినీ పరిశ్రమ నుంచి కూడా మంచి స్పందన వస్తోంది.

ప్రశ్న) మంచు లక్ష్మీతో కలిసి నటించడం ఎలా ఉండేది?

స) లక్ష్మీ నాకు చాలా మంచి ఫ్రెండ్. ఈ సినిమా ఎలాగైతే స్పీడ్ నెరేషన్‌లో సాగుతుందో షూటింగ్ కూడా అంతే స్పీడ్‌గా జరిగిపోయింది. చాలా ఎంజాయ్ చేస్తూ షూటింగ్ జరిపాం. తన కామెడీ టైమింగ్‌తో లక్ష్మీ ఎవ్వరినైనా కట్టిపడేస్తుంది. చాలా సన్నివేశాలలో అలవోకగా నటించేసింది.

ప్రశ్న) దర్శకుడి గురించి చెప్పండి?

స) వంశీకృష్ణకు ఇది మొదటి సినిమాయే అయినా, సినిమా పట్ల ఆయనకున్న అనుభవం మాక్కూడా లేదు. గతంలో శ్రీకర్ ప్రసాద్ దగ్గర ఎడిటింగ్ డిపార్ట్‌మెంట్‌లో, గౌతమ్ మీనన్ డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో, మోహన్ బాబు గారి ప్రొడక్షన్ హౌస్‌లో ప్రొడక్షన్ డిపార్ట్‌మెంట్లో పనిచేశారు. ఒక సరికొత్త కథ, జానర్‌లో ఈ సినిమా చేశారు. నేను అనుకున్నదానికంటే కూడా సినిమా బాగా తీశారు.

ప్రశ్న) ఈ సినిమాకు మేజర్ హైలైట్స్ ఏంటి?

స) కొత్త జానర్‌ సినిమా, సరికొత్త కథను మేజర్ హైలైట్స్‌గా చెప్పుకోవచ్చు. ఇంటర్వల్, క్లైమాక్స్ సన్నివేశాలు బాగా ఆకట్టుకుంటాయి. బ్రహ్మానందం గారి పార్ట్ సినిమాకు బాగా కలిసివచ్చే అంశం. మనం ఊహించిన దానికి పూర్తి భిన్నంగా సినిమా కథ నడుస్తుంది.

ప్రశ్న) కర్మ, కిస్ సినిమాల తర్వాత మళ్ళీ దర్శకత్వం చేయలేదెందుకని?

స) నేను పుట్టి పెరిగిందంతా అమెరికాలో కావడం వల్లనేమో నాకింకా తెలుగు సినిమా పూర్తిగా అర్థం కాలేదు. కేవలం క్రాఫ్ట్ మాత్రమే తెలిస్తే సినిమా తీయలేం కదా! ఇక్కడి ప్రేక్షకుల టేస్ట్, ఎమోషన్ అర్థం చేసుకున్నాక మళ్ళీ దర్శకత్వం గురించి ఆలోచిస్తా. ప్రస్తుతానికైతే పూర్తిగా నటన మీదే దృష్టి పెట్టా.

ప్రశ్న) ఎలాంటి పాత్రలను ఎంపిక చేసుకుంటారు?

స) లీడ్ రోల్ లాంటిదే చేయాలని ఏమీ లేదు. సినిమాకు పనికొస్తుందనుకునే పాత్ర వచ్చినపుడు సపోర్టింగ్ రోల్ అయినా, లీడ్ రోల్ అయినా నేను సిద్ధమే.

ప్రశ్న) బాహుబలి సినిమాలో మీ పాత్ర గురించి చెప్పండి?

స) బాహుబలి సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపిస్తాను. బాహుబలి మొదటి భాగంలో సుమారు ఓ ఇరవై నిమిషాల పాటు నా పాత్ర ఉంటుంది. ఇంతకు మించి ఆ సినిమా గురించి చెప్పలేను.

ప్రశ్న) తదుపరి సినిమాలేంటి?

స) పీవీపీ సంస్థ నిర్మిస్తోన్న క్షణం సినిమాలో లీడ్ రోల్ చేస్తున్నా. రేపే ఈ సినిమా షెడ్యూల్ అమెరికాలో మొదలుకానుంది. రవికాంత్ ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఆద శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాయే కాక మా అన్నయ్య సాయికిరణ్ అడవి దర్శకత్వంలో జూలైలో ఓ సినిమా మొదలు పెడుతున్నాను.

ఇక ఇక్కడితో అడవి శేష్‌ తో మా ఇంటర్వ్యూ ముగిసింది. త్వరలో విడుదలవుతున్న ఆయన సినిమా ‘దొంగాట’కు 123తెలుగు తరపున ఆల్ ది బెస్ట్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు