సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ‘కిల్లింగ్ వీరప్పన్’ పేరుతో ఓ సినిమా రూపొందిన విషయం తెలిసిందే. దక్షిణ భారతదేశంలోని రెండు రాష్ట్రాల పోలీసులను వణికించిన స్మగ్లర్ వీరప్పన్‌ను చంపిన పోలీసాఫీసర్ కథతో రూపొందిన సినిమా కావడంతో కిల్లింగ్ వీరప్పన్‌పై మొదట్నుంచే విపరీతమైన క్రేజ్ కనిపిస్తూ వచ్చింది. వీరప్పన్‌ను చంపిన పోలీసాఫీసర్‌గా కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ నటించడం కూడా ఈ సినిమాకు ఓ హైలైట్‌గా చెప్పుకోవచ్చు.
ఇక ట్రైలర్, పోస్టర్స్‌తో ఇప్పటికే ఆసక్తి రేకెత్తించిన ఈ సినిమా రిలీజ్ దాకా వచ్చి పలుసార్లు వాయిదా పడి అభిమానులను నిరాశపరిచింది. డిసెంబర్ 4 నుంచి మూడు సార్లు రిలీజ్ డేట్ మార్చుకున్న ఈ సినిమా ఎట్టకేలకు చివరకు ఓ రిలీజ్ డేట్‌కు ఫిక్స్ అయింది. కొత్త సంవత్సరం కానుకగా జనవరి 1న తెలుగు, కన్నడ భాషల్లో ఒకేసారి సినిమా విడుదల కానుందన్న విషయాన్ని రామ్ గోపాల్ వర్మ ప్రకటించారు. నిజ జీవిత కథలను తెరపై అద్భుతంగా పండిస్తారన్న పేరున్న వర్మ, ఈ సినిమాను కూడా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తన స్టైల్లో తీశారన్న ప్రచారం జరుగుతోంది. కన్నడలో ఈ సినిమా ఈ సీజన్‌లో వస్తోన్న క్రేజీ సినిమాగా చెప్పుకోవచ్చు.


