రవితేజ గారి కాంప్లిమెంట్ ధైర్యానిచ్చింది : రాజ్ తరుణ్
Published on Aug 20, 2015 5:51 pm IST

raj-tarun
‘ఉయ్యాల జంపాల’ సినిమాతో వెండితెరకు పరిచయమైన యువహీరో రాజ్ తరుణ్. తన మొదటి సినిమాతోనే ఇండస్ట్రీ మొత్తాన్నీ ఆకర్షించిన ఈ హీరో రెండో సినిమా కోసం ఎన్నో కథలు విని చివరకు ‘సినిమా చూపిస్త మావ’ అంటూ ఇప్పటికి రెండో సినిమాను సిద్ధం చేశారు. ఆగష్టు 14న విడుదలైన ఈ సినిమా అన్నిచోట్లా మంచి టాక్ సంపాదించి హిట్ దిశగా దూసుకెళుతోంది. ‘ఉయ్యాల జంపాల’తో హిట్ కొట్టిన రాజ్ తరుణ్-అవికా గోర్ ఈ సినిమా ద్వారా మరోసారి మెప్పించారు. నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో రావు రమేష్ క్యారెక్టర్ హైలైట్‌గా నిలిచింది.

ఇక తాము ఎంతో కష్టపడి చేసిన ఈ సినిమా, ప్రేక్షకుల దగ్గర్నుంచి మంచి రెస్పాన్స్ రాబట్టుకోవడం పట్ల హీరో రాజ్ తరుణ్ ఆనందం వ్యక్తం చేశారు. తాను హీరోగా చేసిన ఈ రెండో ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఎలా తీసుకుంటారో అన్న భయం ఉండేదని, సినిమా హిట్ కొట్టడంతో కొత్త ఎనర్జీ వచ్చిందని రాజ్ తెలిపారు. ఇక ముఖ్యంగా మాస్ మహారాజ్ రవితేజ అందించిన కాంప్లిమెంట్ మర్చిపోలేనని, సొంత కష్టాన్ని నమ్ముకొని వచ్చిన రవితేజ అంటే ఎప్పట్నుంచో మంచి గౌరవం ఉండేదని, అలాంటి వ్యక్తి నుంచి కాంప్లిమెంట్ రావడమంటే అది అదృష్టమని తెలిపారు. ప్రస్తుతం మూడు సినిమాలతో బిజీగా ఉన్నానని, అందులో ఒకటి సుకుమార్ నిర్మాతగా రూపొందుతోన్న ‘కుమారి 21F’ అని రాజ్ తరుణ్ ఈ సందర్భంగా తెలిపారు.

 

Like us on Facebook