సమీక్ష : బస్తీ – అదే పాత రొటీన్ ప్రేమకథ!

సమీక్ష : బస్తీ – అదే పాత రొటీన్ ప్రేమకథ!

Published on Jul 4, 2015 3:00 PM IST
The Bells

విడుదల తేదీ : 03 జూలై 2015

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

దర్శకత్వం : వాసు మంతెన

నిర్మాత : వాసు మంతెన

సంగీతం : ప్రవీణ్ ఇమ్మడి

నటీనటులు : శ్రేయాన్, ప్రగతి చౌరస్య

సహజ నటి జయసుధ తనయుడు శ్రేయాన్‌ ను హీరోగా పరిచయం చేస్తూ వజ్మన్ ప్రొడక్షన్స్ పతాకంపై, స్వీయ దర్శకత్వంలో వాసు మంతెన నిర్మించిన సినిమా ‘బస్తీ’. ప్రగతి హీరోయిన్ గా పరిచయం అయ్యింది. వాస్తవిక ప్రేమకు అద్దంపట్టే సినిమా అన్న ప్రచారంతో ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ ప్రేమకథ ఏ మేరకు ఆకట్టుకుందీ? చూద్దాం..

కథ :

భిక్షపతి (కోట శ్రీనివాసరావు) వర్గం, అమ్మిరాజు (ముఖేష్ రుషి) వర్గం రెండు వైరి వర్గాలు. కొన్నేళ్ళ పాటుగా ఆ రెండు వర్గాల మధ్య వైరం ఉండగా, ఇరు వర్గాల పెద్దలూ ఈ గొడవలన్నింటికీ స్వస్తి పలికి ఎవరికి వారుగా గొడవల్లేకుండా జీవిస్తుంటారు. ఇదే సమయంలో భిక్షపతి కొడుకు భవాని (అభిమన్యు సింగ్) మాత్రం రెండు వర్గాల మధ్యన గొడవలను మళ్ళీ రెచ్చగొట్టే పనులు చేస్తూనే ఉంటాడు. భవానీకి బుద్ధి చెప్పాలనే ఆలోచనలో అమ్మిరాజు, భవానీ చెల్లెలు స్రవంతి (ప్రగతి చౌరస్య)ను కిడ్నాప్ చేస్తాడు.

స్రవంతి కిడ్నాపైన సమయంలోనే అమెరికా నుండి విజయ్ (శ్రేయాన్) తన ఇంటికి వస్తాడు. విజయ్ తండ్రి వెంకటపతి నాయుడు చనిపోయిన తర్వాత వెంకటిపతి నాయుడు సామ్రాజ్యాన్ని, విజయ్ బాధ్యతలనూ అమ్మిరాజు చూసుకుంటుంటాడు. అమ్మిరాజును అన్నయ్య అంటూ పిలిచే విజయ్, తమ ఇంట్లో కిడ్నాప్‌కు గురైన స్రవంతిని అనుకోకుండా చూస్తాడు. స్రవంతి ఆ ఇంట్లో ఉండే కొద్ది రోజులకే ఆమెతో పరిచయం కలగడం, ఆ పరిచయం ప్రేమగా మారడం జరిగిపోతాయి.

వెంకటిపతి నాయుడు తనకు తండ్రిలాంటి వారని, ఆయన కొడుకు విజయ్ సంతోషమే తనకు ముఖ్యమని చెప్పే అమ్మిరాజు, విజయ్-స్రవంతిల ప్రేమ కోసం భిక్షపతిని కలుస్తాడు. అయితే విజయ్-స్రవంతిల పెళ్ళి ప్రపోజల్ ఏ మాత్రం ఇష్టం లేని భవాని.. అమ్మిరాజు, భిక్షపతిలను చంపేస్తాడు. భవానీ నుంచి తప్పించుకున్న విజయ్-స్రవంతి ప్రేమజంట తమను తాము ఎలా కాపాడుకుందీ? అన్నది మిగతా కథ.

ప్లస్‍పాయింట్స్ :

ఈ సినిమాకు మేజర్ ప్లస్‌పాయింట్ అంటే రెండు వైరి వర్గాల మధ్యన గొడవలు, కక్ష సాధింపు చుట్టూ కాకుండా కేవలం ప్రేమకథ చుట్టూనే సినిమాను చెప్పే ప్రయత్నం చేయడం గురించి చెప్పుకోవచ్చు. సినిమాలో ఈ రెండు వర్గాల ఆలోచనా విధానాన్ని చెప్పడమే తప్ప ఎక్కడా అనవసరమైన యాక్షన్ అంశాలను జోడించకపోవడం ఒక రకంగా ప్లస్‌పాయింటే. రన్‌టైమ్ కూడా చాలా తక్కువ ఉండడం ఈ సినిమాకు మరో ప్లస్‌పాయింట్. చెప్పే పాయింట్ చాలా చిన్నదైనా దాన్ని అంతే చిన్నగా చెప్పేసి మరీ బోర్ కొట్టించే సన్నివేశాలను పెట్టకపోవడం ఫర్వాలేదనిపిస్తుంది.

హీరో శ్రేయాన్‌కిది మొదటి సినిమా అయినా ఫర్వాలేదనిపించేలా నటించాడు. లుక్స్ పరంగా బాగున్నాడు. క్లైమాక్స్‌ పార్ట్‌లో యాక్టింగ్ పరంగా బాగానే ఆకట్టుకుంటాడు. అయితే ఒక పూర్తి స్థాయి నటుడు అనిపించుకోవాలంటే ఇంకా చాలా శ్రమించాలి. హీరోయిన్ ప్రగతి తన క్యూట్ లుక్స్ తోనే కాకుండా నటనతో కూడా ఆకట్టుకుంది. ఇక హీరో ఫ్రెండ్‌గా నటించిన ‘అలా మొదలైంది’ ఫేం స్నిగ్ధ తన స్టైల్ యాక్టింగ్‌తో నవ్వించే ప్రయత్నం చేసింది.

సినిమా పరంగా చూసుకుంటే.. ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అంటే ఫస్టాఫ్ గురించి చెప్పుకోవాలి. పాత్రల పరిచయం, ఒక్కో పాత్ర ఆలోచనా విధానాన్ని ఒక్కో రకమైన సన్నివేశంతో చెప్పడం ఇలా ఫస్టాఫ్ అంతా అసలైన కథను చెప్తూ బాగానే ఉందనిపిస్తుంది.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాకు మేజర్ మైనస్ పాయింట్ అంటే కథ, కథనాల గురించే చెప్పుకోవాలి. తెలుగు సినిమాల్లో ఇప్పటివరకూ ఎన్నోసార్లు మనం చూసి ఉన్న రొటీన్ ప్రేమకథను అంతే రొటీన్ స్క్రీన్‌ప్లేతో నడిపించడంతో ఈ సినిమా అలా అలా సాగిపోతుందే తప్పా ఎక్కడా ఎగ్జైట్ చెయ్యదు. ప్రేమకథలోని ఇన్నోసెన్స్, రొమాన్స్ ఈ సినిమాలో దాదాపుగా లేదు. దీంతో ఇటు యాక్షన్ సినిమాలా కాక, అటు ప్రేమకథలా కాక మధ్యలో ఆగిపోతుందీ సినిమా!

ఫస్టాఫ్ కొంతమేర బాగుందనిపించినా, సెకండాఫ్ మొదలైన కొద్ది సేపటికే సినిమా దాదాపుగా దారి తప్పిపోయింది. తమకు ఎదురైన కొన్ని అడ్డంకులను దాటుకొని ఓ ప్రేమజంట ప్రయాణం ఎటు సాగిందనేది సెకండాఫ్ ప్రధాన అంశం. అసలైన విషయాన్ని పక్కనపెట్టి సెకండాఫ్‌లో ఏమేం చేయాలో అర్థం కాక.. ఆలీ, సప్తగిరి ట్రాకులను పెట్టారు. అవి సినిమాతో సంబంధం లేనివే కాక బోరీంగ్‌గానూ ఉన్నాయి. ముఖ్యంగా ఆలీ ట్రాక్ ఎందుకు పెట్టారో అర్థం కాదు. పాటలు వినడానికి బాగున్నా సినిమాలో అసందర్భంగా వచ్చి వృథాగా మిగిలిపోయాయ్!

ఇక హీరోయిన్ అందం, అభినయం పరంగా ఫర్వాలేదనిపించేలా ఉన్నా, ఈ సినిమాకు ఆమె అస్సలు నప్పలేదు. శ్రేయాన్-ప్రగతిల జంట చూడడానికి బాలేదు. ఇక ఇక్కడ ఒక విషయం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సినిమా అనే బలమైన మాధ్యమం ద్వారా మందు కొట్టి కారు నడపడం, లంచం ఇచ్చి తమ పని చేసుకోవడం లాంటివి చూపడం ఏమాత్రం సమంజసంగా లేకపోవడమే కాక తప్పుడు సంకేతాలను ఇచ్చినట్టవుతుంది.

సాంకేతిక విభాగం :

ముందుగా రచయిత, దర్శకుడు అయిన వాసు మంతెన గురించి చెప్పుకుంటే.. కొత్తదనమే లేని ఓ కథను, అందరికీ తెలిసిన ఫార్మాట్‌లోనే సాదాసీదాగా చెప్పే ప్రయత్నం చేయడం వల్ల రచయితగా వాసు చేసిందేమీ లేదనే చెప్పాలి. దర్శకుడిగా మాత్రం ఫస్టాఫ్‌లో కొన్ని చోట్ల అతడి ప్రతిభను చూడొచ్చు. బలమైన కథను, ఇంటరెస్టింగ్ స్క్రీన్‌ప్లే ద్వారా చెప్పే ప్రయత్నం లాంటిదేదైనా చేస్తే అతడి ప్రతిభ మరింత బయటకు వచ్చేది.

ఇక ఈ సినిమాలో అందరికంటే ఎక్కువ మార్కులు కొట్టేసేది సినిమాటోగ్రాఫర్ గుణ శేఖరే అని చెప్పాలి. ముఖ్యంగా రాత్రి పూట వచ్చే సన్నివేశాల్లో తన పనితనాన్ని చూపించాడు. ప్రేమకథ, రౌడీయిజం ఇలా రెండు భిన్న నేపథ్యాల మధ్యన నడిచే కథ మూడ్‌ను సినిమాటోగ్రాఫర్ బాగానే పట్టుకున్నారు. సంగీత దర్శకుడు ప్రవీణ్ అందించిన పాటలు బాగానే ఉన్నాయి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మరీ రొటీన్‌గా ఉంది. ఎడిటింగ్ గురించి చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదు. కొన్ని సన్నివేశాలకు కత్తెర వేసి ఉంటే బాగుండేది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి.

తీర్పు :

ప్రేమకథల్లోని భావోద్వేగాలను సరిగ్గా పట్టుకునే కథలకు ఎప్పుడూ మంచి ఆదరణే ఉంటుంది. ఈ అంశాన్ని పట్టుకొనే రకరకాల నేపథ్యాల నుంచి, రకరకాల ప్రేమకథలతో సినిమాలు పుట్టుకొస్తూనే ఉంటాయ్! తాజాగా ఆ జాబితాలోకి వచ్చి చేరిన సినిమా ‘బస్తీ’. రెండు వైరి వర్గాల్లోని వయసుకొచ్చిన పిల్లలు ప్రేమలో పడడం, ఆ ప్రేమకు పెద్దల దగ్గర్నుంచి ఇబ్బందులెదురవడమనే సాదాసీదా కథతో వచ్చిన ‘బస్తీ’ సినిమాలో ఫస్టాఫ్, కొన్ని నవ్వించే సన్నివేశాలు అనుకూలించే అంశాలు. ఇక ఇప్పటివరకూ ఎన్నోసార్లు చూసి ఉన్న కథనే మళ్ళీ అంతే పాత ఫార్మాట్‌లో చెప్పడం, బలమైన సన్నివేశాలు పెద్దగా లేకపోవడం లాంటివి ప్రతికూలించే అంశాలు. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఆదరణకు నోచుకోవాలంటే కేవలం ప్రేమకథైతే సరిపోదన్న సత్యం తెలిసిన సినిమాలు ఆ కోణంలోనూ ఆలోచింది కొత్తదనాన్ని ఆపాదించుకొని ఆకట్టుకుంటాయి. అలాంటి కొత్తదనమేమీ లేని సాదాసీదా ప్రేమకథే.. ‘బస్తీ’.

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5
123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు