సమీక్ష : బ్రూస్ లీ – దసరా ట్రీట్ ఫర్ మెగా ఫ్యాన్స్

సమీక్ష : బ్రూస్ లీ – దసరా ట్రీట్ ఫర్ మెగా ఫ్యాన్స్

Published on Oct 18, 2015 2:50 PM IST
bruce-lee-review

విడుదల తేదీ : 16 అక్టోబర్ 2015

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5

దర్శకత్వం : శ్రీను వైట్ల

నిర్మాత : డివివి దానయ్య

సంగీతం : ఎస్ఎస్ తమన్

నటీనటులు : రామ్ చరణ్, రకుల్ ప్రీత్ సింగ్, కృతి ఖర్భంద, నదియా..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వచ్చిన ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘బ్రూస్ లీ’. ఈ సినిమాకి ఉన్న మరో ప్రత్యేకత.. దాదాపు 6 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి మరో సారి అతిధి పాత్రలో సిల్వర్ స్క్రీన్ పై కనిపించనున్నాడు. కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్స్ స్పెషలిస్ట్ అయిన శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా కనిపించనుంది. డివివి దానయ్య నిర్మించిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘మగధీర’ తర్వాత చిరంజీవి – రామ్ చరణ్ లు మరోసారి కలిసి తెరపై కనిపించిన ఈ సినిమా ఆ రేంజ్ లో ఉందా లేదా అనేది ఇప్పుడు చూద్దాం..

కథ :

బ్రూస్ లీ – ఈ పేరుని తన రోల్ మోడల్ గా భావిస్తూ బ్రూస్ లీ లానే చిన్నప్పటి నుంచీ ఫైట్లు, ఫీట్లు చేస్తూ పెరుగుతాడు మన హీరో కార్తీక్(రామ్ చరణ్) అలియాస్ బ్రూస్ లీ. కార్తీక్ ప్రప్రంచం అంతా తన కుటుంబమైన అమ్మ (పవిత్ర లోకేష్), నాన్న రామచంద్ర రావు(రావు రమేష్), అక్క (కృతి కర్భంద). జీవనాధారం కోసం సినిమాలలో స్టంట్ మాస్టర్ గా, సినీ హీరోలకి డూప్ గా పనిచేసే కార్తీక్ తన ఫ్యామిలీ జోలికి ఎవడన్నా వస్తే వాడి బెండు తీస్తాడు. అలాంటి మన కార్తీక్ ని ఓ రోజు పోలీస్ డ్రెస్ లో చూసిన వీడియో గేమ్ డెవలపర్ రియా(రకుల్ ప్రీత్ సింగ్) అతని మాయలో పడిపోతుంది. ఎందుకంటే తనకి పోలీస్ అంటే పిచ్చి, ఎప్పటికన్నా పోలీస్ నే పెళ్లి చేసుకోవాలి అని కలలు కనే అమ్మాయి. దాంతో అతన్ని ఓ సూపర్ హీరో గా పెట్టి ఓ గేమ్ డెవలప్ చేస్తూ ఉంటుంది. పోలీస్ పిచ్చిలో తను చేసే కొన్ని పనుల వల్ల సమస్యల్లో పడుతుంది. తనని కాపాడడం కోసం బ్రూస్ లీ దీపక్ రాజ్(అరుణ్ విజయ్) మనుషులను పలు సార్లు కొడతాడు. దాంతో బ్రూస్ లీకి తెలియకుండానే దీపక్ రాజ్ తో వైరం పెరుగుతూ ఉంటుంది.

ఇది ఒకవైపున జరుగుతూ ఉంటే.. రామచంద్ర రావు పనిచేసే వసుంధర లాబ్స్ కంపెనీ అధినేతలైన జయరాజ్(సంపత్ రాజ్)-వసుంధర(నదియా)లు కృతిని తన ఇంటి కోడలుగా చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. అదే తరుణంలో బ్రూస్ లీ లైఫ్ లోకి దీపక్ రాజ్ రూపంలో కొన్ని సమస్యలు వస్తాయి. అలాగే అప్పటి వరకూ మంచి అనే ముసుగులో ఉన్న జయరాజ్ గురించి కూడా కొన్ని జీర్ణించుకోలేని నిజాలు బయటకి తెలుస్తాయి. వీటి వల్ల తన ఫ్యామిలీ ఇబ్బందుల్లో పడుతుంది అని తెలుసుకున్న బ్రూస్ లీ ఏం చేసాడు.? ఎలా తన ఫ్యామిలీని కాపాడుకున్నాడు.? అసలు దీపక్ రాజ్ ఎవరు.? అతను ఎలాంటి సమస్యలు క్రియేట్ చేసాడు.? అసలు జయరాజ్ అసలు కథ ఏంటి.? చివరికి మెగాస్టార్ చిరంజీవి బ్రూస్ లీ కి ఎలా సాయం చేసాడు.? అన్నది మీరు వెండితెరపై చూసి తెలుసుకోవాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

బ్రూస్ లీ అనే సినిమా కోసం ఎవరు ఎంత కష్టపడినా ఫస్ట్ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అనగానే చెప్పేది మాత్రం మెగాస్టార్ చిరంజీవినే అనడంలో ఎలాంటి అనుమానం లేదు. మెగాస్టార్ చిరంజీవి చేసింది అతిధి పాత్రే అయినా దాదాపు 8 ఏళ్ళ తర్వాత సిల్వర్ స్క్రీన్ పై కనిపించాడు కావున మొదట ఆయనతో మొదలు పెడతా.. చిరు తన యంగ్ ఏజ్ లో కనిపించిన రఫ్ అండ్ టఫ్ మాస్ లుక్ లో కనిపించి అందరినీ థ్రిల్ చేసాడు. ఆయన స్క్రీన్ ప్రెజన్స్, పెర్ఫార్మన్స్, స్టంట్స్, డైలాగ్స్ థియేటర్స్ లో ఉన్న ఆడియన్స్ కి ఒక్కసారిగా గ్యాంగ్ లీడర్, ఖైదీ, కొదమ సింహం రోజులను గుర్తు చేస్తాయి. ఆయన కనిపించిన చివరి 5 నిమిషాలు ఒక్కసారిగా ఆడియన్స్ ని పీక్స్ కి తీసుకెళ్ళి, ఆ ఫీల్ తోనే బయటకి వచ్చేలా చేస్తుంది. ఆయన చెప్పిన ఓ డైలాగ్ మీకోసం ‘జస్ట్ టైం గ్యాప్ అంతే, టైమింగ్ లో మాత్రం గ్యాప్ ఉండదు’.

ఇక ఆయన తర్వాత సినిమాకి మేజర్ ప్లస్ అనే విషయానికి వస్తే.. సినిమా ప్రారంభం చాలా స్పీడ్ గా దూసుకుపోతుంది. పాత్రలను పరిచయం చేసే తీరు, ఇంట్రడక్షన్ ఫైట్, ఇంట్రడక్షన్ సాంగ్, ఫ్యామిలీ టచ్, లవ్ ట్రాక్ ఇలా అన్నీ కలిసి మొదటి 30 నిమిషాలు ఆడియన్స్ ని బాగా ఎంటర్టైన్ చేస్తాయి. ఆ తర్వాత ఓ ట్విస్ట్ తో వచ్చే ఇంటర్వల్ బ్లాక్ ఎపిసోడ్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది. ఇక ప్రీ క్లైమాక్స్ లో వచ్చే చేజ్ అండ్ బోట్ ఫైట్ సీక్వెన్స్ అందరినీ ఆకట్టుకుంటాయి.

ఇక నటీనటుల విషయానికి వస్తే.. రామ్ చరణ్ చాలా రోజుల తర్వాత మళ్ళీ టాప్ టు బాటమ్ తన లుక్ ని మార్చుకొని చేసిన ఈ సినిమాలో చాలా స్టైలిష్ గా కనిపించాడు. శ్రీను వైట్ల క్రియేట్ చేసిన కార్తీక్ పాత్రలో ఓ కొత్త రామ్ చరణ్ ని చూస్తాం. ఈ సినిమాలో రామ్ చరణ్ మానరిజమ్స్, స్టైల్, టోటల్ డిఫరెంట్ గా అనిపించే యాక్షన్ సీక్వెన్స్ లు ఆడియన్స్ ని కట్టి పడేస్తాయి. ఇదంతా ఒక ఎత్తైతే ఇందులో చరణ్ అక్కడక్కడా చేసిన కామెడీ యాంగిల్ ఆకట్టుకుంటుంది. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కెరీర్లోనే బెస్ట్ స్క్రీన్ ప్రెజన్స్ బ్రూస్ లీ లోనే అని చెప్పాలి. ఇప్పటి వరకూ కనిపించిన దానికంటే చాలా క్యూట్ గా, చాలా అందంగా, మోస్ట్ గ్లామరస్ గా కనిపిస్తుంది. సింప్లీ యూత్ అయితే వావ్ వాట్ ఏ బ్యూటీ అంటూ తన మాయలో పడిపోతారు. రామ్ చరణ్ – రకుల్ ప్రీత్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అదిరింది. చరణ్ సిస్టర్ పాత్రలో కృతి కర్బంధ బబ్లీ బబ్లీగా కనిపించి మంచి పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకుంది. విలన్ గా పరిచయం అయిన అరుణ్ విజయ్ బాగానే చేసాడు. నదియా మరోసారి రిచ్ బిజినెస్ ఉమెన్ గా మెప్పించింది. రావు రమేష్, పవిత్రా లోకేష్, సంపత్ రాజ్ లు మంచి నటనని కనబరిచారు. డైరెక్టర్ గా జయప్రకాశ్ రెడ్డి, హీరోగా బ్రహ్మాజీ, పోసాని కృష్ణ మురళి కాసేపు నవ్వించారు. చరణ్ – రావు రమేష్ ల మధ్య మొదట్లో వచ్చే సెటైరికల్ సీన్స్ బాగా నవ్విస్తే, చరణ్ – కృతి కర్భంద – రావు రమేష్ – పవిత్ర లోకేష్ ల మధ్య వచ్చే ఒకటి రెండు ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి.

మైనస్ పాయింట్స్ :

బ్రూస్ లీ సినిమా మైనస్ పాయింట్స్ లో సినిమాకి బాగా నష్టం కలిగించిన పాయింట్స్ గురించి ముందుగా చెబుతా.. ఈ సినిమా కోసం డిజైన్ చేసుకున్న పాత్రలు కొత్తవైనా సినిమా మూల కథ మాత్రం చాలా చాలా పాతది. అలాగే ఆ మూల కథని స్టార్ రైటర్స్ అయిన కోన వెంకట్ అండ్ గోపి మోహన్ లు కలిసి డెవలప్ చేసిన పూర్తి కథ కూడా చాలా ఓల్డ్ ఫార్మాట్ లో ఉంది. కావున ఓవరాల్ గా ఆడియన్స్ కి శ్రీను వైట్ల కొత్త కథ చెప్పాడు అనే ఫీలింగ్ అయితే ఉండదు. కథ పరంగా కొత్తదనం లేదు ఓకే, కానీ కథనంలో అన్నా సూపర్బ్ ట్విస్ట్స్ రాసుకోవాల్సింది. కానీ ఆ రేంజ్ లో రాసుకోలేదు. ఫస్ట్ హాఫ్ పరంగా బాగానే డీల్ చేసుకుంటూ వచ్చి ఉన్న ఒక ట్విస్ట్ ని ఇంటర్వల్ లోనే చెప్పేయడం వల్ల సెకండాఫ్ లో చెప్పడానికి ఏమీ లేకపోయింది. దాంతో సెకండాఫ్ మొత్తాన్ని కామెడీ పెట్టి ఏదో మేనేజ్ చేద్దాం అనుకున్నారు, కానీ అది పూర్తిగా ఫెయిల్ అయ్యింది. ఒక్క క్లైమాక్స్ తప్ప మిగతా సెకండాఫ్ మొత్తం బాగా బోరింగ్ గా అనిపిస్తుంది.

వీటితో పాటు సెకండాఫ్ లో వచ్చే కామెడీ పెద్దగా వర్కౌట్ కాకపోవడం మరో బిగ్గెస్ట్ మైనస్ పాయింట్. మెయిన్ గా శ్రీను వైట్ల సినిమా అంటే కామెడీని ఎక్కువగా ఆశిస్తారు, కానీ ఈ సినిమాలో కామెడీ అనేది చాలా తక్కువ ఉంది. అలాగే శ్రీను వైట్ల అంటే బ్రహ్మానందంతో బాగా నవ్విస్తాడు, కానీ ఇందులో బ్రహ్మానందం కామెడీ అస్సలు వర్కౌట్ అవ్వలేదు. అలాగే చాలా సిల్లీగా కూడా అనిపిస్తుంది. ఫస్ట్ హఫ్ లో కూడా కొన్ని బోరింగ్ మోమెంట్స్ ఉన్నాయి. సెకండాఫ్ లో హీరోయిన్ పాటల కోసం తప్ప ఇంకెక్కడా పెద్దగా కనిపించదు. అలాగే బాలీవుడ్ నుంచి తీసుకొచ్చిన టిసిక చోప్రా చేత చేయించిన పాత్ర చాలా సిల్లీగా అనిపిస్తుంది. ఇలాంటి పాత్రకి ఆమెను ఎందుకు పట్టుకొచ్చారా అనే ఫీలింగ్ ని కూడా కనపడుతుంది. వీటన్నిటికీ మించి హీరో స్ట్రాంగ్ అంటే విలన్ అంతకన్నా స్ట్రాంగ్ గా ఉండాలి అప్పుడే సినిమాలో మజా వస్తుంది. కానీ అరుణ్ విజయ్ పాత్రని అంత బాగా డిజైన్ చెయ్యలేదు. రెండే రెండు సీన్స్ లో హీరోకి ఎదురుపడి ఒకసారి దెబ్బలు తిని కోమాలోకి, ఇంకోసారి చచ్చిపోతాడు. దీనివల్ల విలనిజం ఎలివేట్ కాలేదు. విలనిజం ఓ రేంజ్ లో లేదు అంటే హీరోయిజం కూడా అంతంత మాత్రంగానే ఎలివేట్ అయ్యింది. 155 నిమిషాల రన్ టైంలో కనీసం ఒక 15 నిమిషాలు తగ్గించినా సినిమాకి చాలా హెల్ప్ అవుతుంది. అలాగే సినిమా ప్రమోషన్స్ లో చెప్పుకుంటూ వచ్చిన సిస్టర్ సెంటిమెంట్ కూడా పెద్దగా లేకపోవడం మరో మైనస్.

సాంకేతిక విభాగం :

సాంకేతిక నిపుణుల్లో ప్రతి ఒక్కరి చేత అద్భుతః అని అనిపించుకునే టెక్నీషియన్ సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంస. ఇంత లిమిటెడ్ టైంలో తను ఇచ్చిన అవుట్ పుట్ సింప్లీ సూపర్బ్. నటీనటులని సరికొత్తగా చూపించాడు. అలాగే ప్రతి షాట్, ప్రతి సీన్ చూడటాని ఓ కలర్ఫుల్ పెయింటింగ్ లా ఉంటుంది. విజువల్స్ పరంగా బ్రూస్ లీ మోస్ట్ కలర్ఫుల్ ఐ ఫీస్ట్ అని చెప్పవచ్చు. అలాంటి విజువల్స్ కి తన మ్యూజిక్ తో ఒక భావాన్ని క్రియేట్ చేసిన క్రెడిట్ మాత్రం మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కే చెందుతుంది. తమన్ అందించిన పాటలు పెద్ద హిట్, విజువల్స్ పరంగా ఇంకా పెద్ద హిట్. ఇక నేపధ్య సంగీతం పరంగా కూడా ప్రతి సీన్ కి న్యాయం చేసాడు. మెయిన్ గా చిరు ఎపిసోడ్ కి కంపోజ్ చేసిన బిట్ సాంగ్ అండ్ మ్యూజిక్ బాగుంది. ఎడిటర్ ఎం.అర్ వర్మ 80% సక్సెస్ అయ్యాడు. చాలా చోట్ల అతను చేసిన షార్ప్ ఎడిటింగ్ అదిరింది. మెయిన్ గా చిరు ఎపిసోడ్ ని చాలా బాగా చేసాడు. కానీ అక్కడక్కడా సాగదీసారు అందుకే ఆ 20% నెగటివ్ లోకి వెళ్ళింది. నారాయణరెడ్డి ఆర్ట్ చాలా బాగుంది. అనల్ అరసు, రామ్ లక్ష్మణ్, విజయ్, వెంకట్ మాస్టర్స్ కంపోజ్ చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ మాస్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటాయి. కోన వెంకట్ రాసిన కొన్ని డైలాగ్స్ బాగానే పేలాయి.

ఇక సినిమాకి కీలకం అయిన కథ, కథనం, దర్శకత్వం అనే విభాగాల విషయానికి వస్తే.. శ్రీను వైట్ల బ్రూస్ లీ కోసం అనుకున్న సెంటిమెంట్ స్టొరీ లైన్ కొత్తదేమీ కాదు, కానీ ఆ కథకి పాత్రలని కొత్తగా రాసుకోవడంలో కొంతమేర సక్సెస్ అయ్యాడు. ఓల్డ్ స్టొరీ లైన్ ని కోన వెంకట్ – గోపి మోహన్ లు అంతే ఓల్డ్ గా పూర్తి కథని సిద్దం చేసారు. అలాగే పూర్తి కథగా రాసుకునేటప్పుడు కామెడీ పెట్టాలనే ఉద్దేశంతో కథని కొన్ని చోట్ల బోర్ కొట్టించాడు. ఇక శ్రీను వైట్ల రాసిన కథనం ఫస్ట్ హాఫ్ అయ్యేటప్పటికి బాగుంది అనే ఫీలింగ్ వస్తుంది, కానీ ఈ ఫీలింగ్ ని సెకండాఫ్ మొదలైన కొద్దిసేపటికే పోగొట్టేసి పూర్తి ఊహాజనితంగా మార్చేసారు. దాంతో సెకండాఫ్ పరంగా కథనం ఆడియన్స్ లో ఆసక్తిని రేకెత్తించలేకపోయింది. ఇక దర్శకుడిగా శ్రీను వైట్ల మాత్రం సక్సెస్ అయ్యాడు. సినిమా అన్నాక కొన్ని కొన్ని మైనస్ లు ఉంటాయి, ఆ మైనస్ ని కవర్ చేసే కొన్ని అంశాలు సినిమాలో వర్కౌట్ అవ్వడం వలన మెగా ఫాన్స్ సినిమాకి కనెక్ట్ అవుతారు. కాబట్టి డైరెక్టర్ గా సక్సెస్ అయ్యాడు. ఇక ల్లాస్ట్ బట్ నాట్ లీస్ట్.. నిర్మాత డివివి దానయ్య సినిమా కోసం పెట్టిన ప్రతి రూపాయి మనకు తెరపైన కలర్ఫుల్ గా కనిపిస్తూ మనకు నేత్రానందాన్ని కలిగిస్తుంది.

తీర్పు :

మెగాస్టార్ చిరంజీవి మళ్ళీ తెరపై కనిపించనున్నాడు, రామ్ చరణ్ హీరోగా నటించిన మరో యాక్షన్ ఎంటర్టైనర్ అని బోలెడన్ని ఆశలతో వచ్చిన మెగా అభిమానులను ఈ దసరా సీజన్ లో పక్కాగా ఎంటర్టైన్ చేసే సినిమానే ‘బ్రూస్ లీ’. దాదాపు ఏడాది నుంచి రామ్ చరణ్ సినిమా కోసం ఎదురు చూస్తున్న మెగా అభిమానుల దాహం తీర్చే సినిమా బ్రూస్ లీ. శ్రీను వైట్ల నుంచి ఆశించిన రొటీన్ కథ, కథనాలే అయినా అభిమానులను, మాస్ ఆడియన్స్ ని మెప్పించే అంశాలు కూడా ఇందులో ఉండడం సినిమాకి బాగా హెల్ప్ అయ్యాయి. సినిమా వేగంగా మొదలవ్వడం, రామ్ చరణ్ న్యూ క్యారెక్టరైజేషణ్, రకుల్ ప్రీత్ సింగ్ అందాల విందు, ఇంటర్వల్ బ్లాక్, చిరు గెస్ట్ రోల్ సినిమాకి హైలైట్స్ గా నిలిస్తే, రోటీన్ కథ, కథనం, బోరింగ్ సెకండాఫ్, ఎంటర్టైన్మెంట్ పెద్దగా లేకపోవడం సినిమాకి బిగ్గెస్ట్ మైనస్ పాయింట్స్. ఓవరాల్ గా బ్రూస్ లీ అనే సినిమా చూసిన ప్రేక్షకుడి నుంచి హిట్ సినిమా అనే టాక్ ని తెచ్చుకుంటుంది, కానీ మెగాస్టార్ ఇందులో ఉండడం మరియు దసరా అనే పండుగ సీజన్ ఈ హిట్ టాక్ తోడవడం వలన కలెక్షన్స్ మాత్రం బ్లాక్ బస్టర్ సినిమా రేంజ్ లో వస్తాయి.

123తెలుగు.కామ్ రేటింగ్ :3.25/5
123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు