సమీక్ష : చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి – అమ్మాయి, అబ్బాయిల రొటీన్ టార్చర్

సమీక్ష : చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి – అమ్మాయి, అబ్బాయిల రొటీన్ టార్చర్

Published on May 26, 2013 5:00 AM IST
chukkalanti-ammayi-chakkana విడుదల తేదీ : 25 మే 2013
123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5
దర్శకుడు : కన్మణి
నిర్మాత : రాజు హర్వాని, గోగినేని శ్రీనివాస రావు
సంగీతం : అనూప్ రూబెన్స్
నటీనటులుతరుణ్, విమలా రామన్..


లవర్ బాయ్ తరుణ్, విమలా రామన్ హీరో హీరోయిన్స్ గా నటించిన ‘చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి’ సినిమా ఎట్టకేలకు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 2010లో షూటింగ్ మొదలైన ఈ సినిమా 2011 మార్చిలో విడుదల కావాలి కానీ కొన్ని ఫైనాన్షియల్ ఇబ్బందుల వల్ల వాయిదా పడుతూ అదిగో రిలీజ్ చేస్తున్నాం ఇదిగో రిలీజ్ చేస్తున్నాం అని చెప్పుకుంటూ రెండు సంవత్సరాలు గడిపేసిన నిర్మాతలు చివరికి ఈ రోజు రిలీజ్ చేసేసారు. కన్మణి దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ ని రాజు హర్వాని – గోగినేని శ్రీనివాసరావు సంయుక్తంగా నిర్మించగా, అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు. హిట్ కోసం కొన్ని సంవత్సరాలుగా నిరీక్షిస్తున్న తరుణ్ కి ఈ సినిమా అన్నా హిట్ ఇచ్చిందో లేదో ఇప్పుడు చూద్దాం..

కథ :

సంజయ్(తరుణ్) – హైదరాబాద్లో తన తండ్రి చేస్తున్న బిజినెస్ ని చూసుకోమంటే నాకు ఫ్రీడం కావాలని బ్యాంకాక్ వెళ్లి అక్కడ థాయ్ టీవీ చానల్లో వారానికోసారి ‘లవ్ గురు’ అనే టీవీ ప్రోగ్రాం చేస్తూ మిగిలిన రోజుల్లో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతుంటాడు. సంజయ్ బ్యాంకాక్లో సమీర(విమలా రామన్) ని చూసి ప్రేమలో పడతాడు. కట్ చేస్తే విమలా రామన్ చాలా భాద్యత గల అమ్మాయి, అలాగే బాంకాక్లో మెడిసిన్ చేస్తూ ఉంటుంది. సంజయ్ ఎలాగోలా సమీరతో పరిచయం పెంచుకుంటాడు. అలా వారిద్దరి పరిచయం ప్రేమగా మారుతుంది వారిద్దరూ పెళ్ళి చేసుకుందాం అనే సమయంలో సమీరని చిన్ననాటి నుంచి పెంచిన ప్రగతి అతనికి భాద్యత అనేదే లేదని, అతను సరైన వాడు కాదని పెళ్లికి ఒప్పుకోదు.

దాంతో సంజయ్ సమీరతో ముందు నా గురించి నువ్వు, నీ గురించి నేను బాగా తెలుసుకోవాలి. అందుకే మనిద్దరం కలిసి కొన్ని రోజులు సహజీవనం సాగిద్దాం. ఆ తర్వాత నచ్చితే కలిసుందాం లేదంటే విడిపోదాం అని చెప్తాడు. దానికి ఒప్పుకున్న సమీర సంజయ్ తో కలిసి వేరే ఇంట్లో ఉంటుంది. అలా మొదలు పెట్టిన వారిద్దరి సహజీవనం సాఫీగా సాగి చివరికి ఇద్దరూ ఒకటయ్యారా? లేక విడిపోయారా? అనేదే మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాలో తరుణ్ లుక్ చాలా స్టైలిష్ గా ఉంది. తరుణ్ చేసిన పాత్రలో కొత్తదనం ఏమీ లేకపోయినా ఎంచుకున్న పాత్రకి న్యాయం చేసాడు. క్లైమాక్స్ సెంటిమెంట్ సీన్ బాగా చేసాడు. విమలా రామన్ నటన పరంగా ఓకే. పాటల్లో మాత్రం ఫుల్ గ్లామర్ తో ఆకట్టుకుంది. ముఖ్యంగా ‘కమ్మని ఒక కోరిక’ పాటలో మాత్రం బాగా అందాలు ఆరబోసింది. చిత్రం శీను, విజయ్ సాయిలు తమ పాత్ర పరిధిమేర నటించి అక్క్డడక్కడా కాస్త నవ్వించడానికి ప్రయత్నించారు. సినిమాలో కీలక పాత్ర పోషించిన ప్రగతి నటన బాగుంది.

మైనస్ పాయింట్స్ :

సినిమాకి పెద్ద మైనస్ కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం. నాకు తెలిసి ఈ సినిమా కథ చాలా పాతది. హిందీలో వచ్చిన ‘సలాం నమస్తే’ సినిమాని స్పూర్తిగా తీసుకొని మరికొన్ని తెలుగు హిట్ సినిమాలలోని కొన్ని పాయింట్స్ ని తీసుకొని ఈ సినిమా కథని రాసుకున్నారు. కథ రొటీన్ కావడం వల్ల స్క్రీన్ ప్లే అయినా కాస్త టఫ్ గా ఉండేలా రాసుకోవాల్సింది. కానీ దర్శకుడు రాసుకున్న స్క్రీన్ ప్లే ఆసక్తిని కలిగించకపోగా చిరాకు తెప్పిస్తుంది. చెప్పాలంటే ఈ సినిమా స్టొరీ లైన్ చెప్పి స్క్రీన్ ప్లే ఎలా ఉంటుందా అని లంగోటి వేసుకున్న ఏ పిల్లవాన్ని అడిగినా చెప్పేస్తాడు. దీన్నిబట్టి మీరే అర్థం చేసుకోవచ్చు ఈ సినిమా స్క్రీన్ ప్లే ఎలా ఉందో అని. కథ, స్క్రీన్ ప్లే లేనప్పుడు దర్శకుడు మాత్రం ఎం చేస్తాడు అందుకే ఆయన కూడా ఎక్కువ కష్టపడకుండా సింపుల్ గా సినిమాని లాగించేసాడు.

ఈ సినిమాలో జరుగుతున్న సీన్ తర్వాత ఏం సీన్ వస్తుంది, ఎలాంటి ట్విస్ట్ ఇస్తాడు అనేది ఇట్టే చెప్పేయొచ్చు. ఉదాహరణకి ఈ సినిమాలో హీరో హీరోయిన్ ని ఇంప్రెస్ చెయ్యడానికి వేరే వ్యక్తిగా ఫోన్ చేసి తన గురించి గొప్పగా చెప్పుకోవడం, అలాగే హీరోయిన్ డాక్టర్ కాబట్టి తన ఫ్రెండ్స్ కి ఏదో ఒక రోగం అంటగట్టి హాస్పిటల్ కి తీసుకెళ్లడం లాంటి సీన్స్ ని నాకు తెలిసి నేను లంగోటి వేసుకుంటున్నప్పటి నుండి చూస్తున్నాను, ఇలాంటి సేమ్ టు సేమ్ సీన్స్ ఇటీవలే వచ్చిన ‘సోలో’ సినిమాలో కూడా ఉన్నాయి.

సినిమాలో ఫస్ట్ హాఫ్ బోర్ అయితే సెకండాఫ్ టార్చర్. సెకండాఫ్ పూర్తయ్యే సరికి ఆడియన్స్ ఈ సినిమా చూడటం కన్నా బయట 44 డిగ్రీల ఎండలో ఉండడం బెటర్ అనుకుంటారు. సినిమా మొదటి నుంచి చివరి వరకూ మన తాతల కాలం నాటి రైలు బండి కన్నా నిధానంగా సాగుతుంది. సినిమాలో ఎంటర్టైనింగ్ లేకపోగా డైరెక్టర్ కి ఇష్టమొచ్చినప్పుడు పాటలు పెట్టి ప్రేక్షకులకి టార్చర్ పెట్టాడు. అసలు సినిమాలో బ్రహ్మానందంతో ఓ సీన్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం తో రెండు సీన్స్ పెట్టాడు. ఇవి సినిమాలో అవసరం లేదు. ఆ ఇద్దరి సీనియర్ కమెడియన్స్ ని సరిగా ఉపయోగించుకోకపోవడమే కాకుండా వారికి వేరెవరితోనో డబ్బింగ్ చెప్పించారు. అది చాలా ఘోరంగా ఉంది.

సాంకేతిక విభాగం :

సినిమాని 95% బ్యాంకాక్లోనే షూట్ చేయడం వల్ల సినిమాటోగ్రఫీ బాగుంది. కానీ ఈ సినిమాకి ఇద్దరు సినిమాటోగ్రాఫర్స్ పనిచేయడం వల్ల ఏది ఎవరు తీసారో చెప్పడం కష్టం. గౌతంరాజు గారి ఎడిటింగ్ అంత బాగోలేదు. ఆయన సినిమా స్పీడుని పెంచడానికి జాగ్రత్తలు తీసుకొని కొన్ని సీన్స్ ని కత్తిరించి పారేయాల్సింది. డైలాగ్స్ మరీ అంత చెత్తగా లేవు అలా అని సూపర్బ్ గానూ లేవు. అనూప్ రూబెన్స్ అందించిన పాటలు పెద్దగా ఆకట్టుకోలేదు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నా సీన్ కి అవసరం లేనంత లౌడ్ గా ఉండడంతో ప్రేక్షకులు కాస్త ఇబ్బంది ఫీలవుతారు.

సినిమా స్టొరీ చాలా పాతది. స్క్రీన్ ప్లే – చాలా వీక్, దర్శకత్వం అంతంత మాత్రంగా ఉంది. ఈ రెండు భాధ్యతలు ఎంచుకున్న డైరెక్టర్ కన్మణి ఏ ఒక్క విభాగాన్ని సరిగా డీల్ చెయ్యలేకపోయాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు :

‘చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి’ సినిమా పరమ బోరింగ్ విత్ టార్చర్ సినిమా అని చెప్పుకోవడానికి ఓ చక్కటి ఉదాహరణ. తరుణ్ స్టైలిష్ లుక్, అతని నటన, విమలా రామన్ గ్లామర్ తప్ప ఈ సినిమాలో చెప్పుకోదగిన ప్లస్ పాయింట్స్ ఏమీ లేవు. రొటీన్ స్టొరీ, వీక్ స్క్రీన్ ప్లే, మెప్పించలేకపోయిన డైరెక్షన్, ఎంటర్టైనింగ్ లేకపోవడం, పాత సినిమాల్లో చూసినట్టు అనిపించే సీన్స్ చెప్పదగిన మైనస్ పాయింట్స్. తరుణ్ స్టైలిష్ లుక్ చూడాలనుకున్న ఫ్యాన్స్ అతి కష్టం మీద ఈ సినిమా చూడొచ్చు, మిగతా వారు ఈ సినిమాని లైట్ తీసుకోవడం ఉత్తమమైన పని అని నా సలహా..

123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5

రాఘవ

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు