సమీక్ష : జెంటిల్‌మ‌న్ – మెప్పించే జెంటిల్‌మ‌న్

సమీక్ష : జెంటిల్‌మ‌న్ – మెప్పించే జెంటిల్‌మ‌న్

Published on Jun 17, 2016 11:39 PM IST
Gentleman review

విడుదల తేదీ : 17 జూన్, 2016

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5

దర్శకత్వం : మోహన్ కృష్ణ ఇంద్రగంటి

నిర్మాత : శివలంక కృష్ణ ప్రసాద్

సంగీతం : మణిశర్మ

నటీనటులు : నాని, సురభి, నివేద థామస్

‘అష్టా చమ్మా’ వంటి హిట్ చిత్రం తరువాత నాని, మోహన్ కృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్లో రూపుదిద్దుకున్న మరో చిత్రం ‘ జెంటిల్‌మ‌న్’. తన సహజమైన నటనతో, కథా ఎంపికతో ఎప్పటికప్పుడు అభిమానులకు కొత్తదనం చూపించే నాని హీరోగా నటించడం, సినిమా విడుదలకు ముందు యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్లు, ట్రైలర్లు ఈ సినిమాపై అంచనాలను పెంచాయి. మరి ఇన్ని అంచనాల నడుమ ఈరోజే విడుదలైన ఈ చిత్రం ఆ అంచనాలను ఏమాత్రం అందుకుందో చూద్దాం…

కథ :

ఫారెన్ ట్రిప్ నుండి ఇండియాకు తిరిగి వస్తున్న ఇద్దరు అమ్మాయిలు ఐశ్వర్య (సురభి), క్యాథరిన్ (నివేద థామస్) లు ఫ్లైట్ లో పక్క పక్కనే కూర్చుని స్నేహితులుగా మారి టైమ్ పాస్ కోసం తమ తమ లవ్ స్టోరీలను ఒకరికొకరు చెప్పుకోవాలనుకోవడంతో సినిమా కథ మొదలవుతుంది. ఇలా ఇద్దరి లవ్ స్టోరీలు ఒకదాని తరువాత ఒకటి పూర్తవగానే ఫ్లైట్ దిగి హైదారాబాద్ కు వచ్చిన క్యాథరిన్ కు తన బాయ్ ఫ్రెండ్ గౌతమ్ (నాని) చనిపోయాడని తెలుస్తుంది. కానీ ఓ జర్నలిస్ట్ వచ్చి గౌతమ్ చనిపోలేదు చంపబడ్డాడు అని చెప్పడంతో అనుమానం వచ్చిన క్యాథరిన్ అచ్చు గౌతమ్ లానే ఉన్న ఐశ్వర్యకు కాబోయే భర్త జై (నాని) పై నిఘా పెట్టి నిజం తెలుసుకోవాలనుకుంటుంది.

జై కూడా క్యాథరిన్ కు దొరక్కుండా తప్పించుకోవాలని చూస్తుంటాడు. ఆ టైమ్ లోనే క్యాథరిన్ కు దొరకబోయే ఒక్కొక్క సాక్ష్యం మాయమవుతూ ఉంటుంది. దీంతో క్యాథరిన్ గౌతమ్ ను చంపింది జై అని నిర్ణయించుకుని అతని అసలు రూపాన్ని ఐశ్వర్యకు చూపాలనుకుంటుండగా ఒక నిజం బయటపడుతుంది. ఆ నిజం ఏమిటి ? మంచివాడిగా ఉన్న జై చెడ్డవాడిగా ఎందుకు కనిపిస్తాడు? అసలు గౌతమ్ మాయమవడానికి కారణం ఏమిటి? అనేదే ఈ సినిమా కథ.

ప్లస్ పాయింట్స్ :

ప్లస్ పాయింట్స్ విషయానికొస్తే ముందుగా చెప్పాల్సింది డేవిడ్ నాథన్ అందించిన కథ, దర్శకుడు కథను నడిపిన విధానం. ఒక సస్పెన్స్ థ్రిల్లర్ కు ఏయే అంశాలు కావాలో అన్నింటినీ దర్శకుడు తన కథనంలో పొందుపరిచి ఊహించని మలుపులతో మంచి కిక్కే ఇచ్చాడు. అలాగే సినిమాలోని నాని రెండు పాత్రలను ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ప్రేక్షకుడికి చూపడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. సినిమా మొదటి భాగంలో అప్పటి వరకూ ఉన్న నాని రెండు పాత్రల్లో ఒక పాత్రను చంపేయడంతో దర్శకుడు అసలు కథను మొదలుపెట్టిన విధానం బాగుంది.

అలాగే ఫస్ట్ హాఫ్ ముగిసే సమయంలో జై పాత్రలోని నెగెటివ్ షెడ్ ను రివీల్ చేస్తూ ఇచ్చిన ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే సెకండ్ హాఫ్ లో ఏం జరగబోతోందో అన్న ఆతురతను పెంచుతుంది. సాధారణంగా సస్పెన్స్ థ్రిల్లర్స్ అంటే చూసే ప్రేక్షకుడికి ఎక్కడో ఒక దగ్గర ఆ ట్విస్ట్ ఊహకు అందుతుంది. కానీ ఈ సినిమా విషయంలో దర్శకుడు ప్రేక్షకుడికి ఆ చాన్స్ ఇవ్వలేదు. పైగా సినిమా పూర్తయ్యే సమయానికి అసలు కథ ఏ సంఘటనతో మొదలైందో చెబుతూ దర్శకుడు ట్విస్ట్ ను రివీల్ చేసిన విధానం బాగుంది. సెకండ్ హాఫ్ మొదట్లో వచ్చే వెన్నెల కిషోర్ కామెడీ ఎపిసోడ్స్ నవ్వించాయి. నాని, నివేద థామస్ లు తమ సహజమైన నటనతో సినిమాకి అదనపు బలాన్ని చేకూర్చారు. అలాగే సురభి, అవసరాల శ్రీనివాస్ తమ పాత్రలకు న్యాయం చేశారు.

మైనస్ పాయింట్స్ :

సినిమాలోని మైనస్ పాయింట్స్ విషయానికొస్తే చెప్పుకోవలసింది 144 నిముషాల రన్ టైమ్. దర్శకుడు ఎంచుకున్న కథ బాగానే ఉన్నప్పటికీ ఆ కథను చెప్పడానికి మరీ అంత సమయం అవసరం లేదు. సినిమా నిడివి పెంచాలన్న ఉద్దేశ్యంతో దర్శకుడు మొదట్లో ప్రేమ జంటల మధ్య పెట్టిన అనవసరమైన కొన్ని సన్నివేశాలు బోర్ కొట్టినట్టు అనిపించాయి.

అలాగే సినిమా ముగింపులో అసలు నిజం ఎవరికి తెలియాలో వాళ్ళకి ఆ నిజం ఓ చిన్న సాదా సీదా సన్నివేశంతో తెలిసిపోవడం అప్పటి వరకూ సినిమాపై కలిగిన పాజిటివ్ ఇంప్రెషన్ ను తగ్గించింది. కథలో ఎక్కడికక్కడ సస్పెన్స్ క్రియేట్ చెయ్యడానికి దర్శకుడు కథ మధ్యలో బలవంతంగా ఇరికించిన కొన్ని సన్నివేశాలు అంతగా మెప్పించలేదు.

సాంకేతిక విభాగం :

ఓ సస్పెన్స్ థ్రిల్లర్ ను చెప్పడంలో దర్శకుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని జాగ్రత్తలూ తీసుకున్నాడు. కథనంలో ఎక్కడా ట్విస్ట్ ముందుగానే రివీల్ కాకుండా సరైన టైమింగ్ లో వాటిని రివీల్ చేసిన విధానం దర్శకుడికి మంచి మార్కులు పడేలా చేశాయి. కథనాన్ని రాసుకోవడంలో రచయితగా మోహన్ కృష్ణ ఇంద్రగంటి సక్సెస్ అయ్యారు.

అలాగే మణిశర్మ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాకు ఎంతలా ఉపయోగపడాలో అంతగా ఉపయోగపడింది. అలాగే లవ్ ట్రాక్ లో వచ్చే రెండు పాటలు మంచి ఫీల్ ను ఇస్తాయి. మార్తాండ్ కే వెంకటేష్ తన ఎడిటింగ్ నైపుణ్యంతో ప్రేక్షకుడికి సినిమాను అర్థమయ్యేలా తీర్చిదిద్దారు. పి. జి. వింద సినిమాటోగ్రఫీ బాగానే ఉంది. శివలంక కృష్ణ ప్రసాద్ నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు :

రొటీన్ కథలతో విసిగిన ప్రేక్షకులకు సస్పెన్స్ థ్రిల్లర్ రూపంలో ఓ మంచి చిత్రాన్ని అందించడానికి మోహన్ కృష్ణ ఇంద్రగంటి చేసిన ప్రయత్నమే ఈ ‘జెంటిల్‌మ‌న్’. ఒక మామూలు మనిషి ఏ సందర్బంలో జెంటిల్‌మ‌న్ గా మారతాడు అనే విషయాన్ని సినిమా ద్వారా చెప్పడం మంచి ప్రయత్నం. సినిమా ఇంటర్వెల్ వచ్చే సస్పెన్స్ , క్లైమాక్స్ లో రివీల్ అయిన ట్విస్ట్ సినిమాకే హైలెట్. కానీ అక్కడక్కడా కథనాన్ని సాగదీయడం, కొన్ని బలవంతపు సన్నివేశాలు కాస్త బోర్ కొట్టిస్తాయి. మొత్తంగా చెప్పాలంటే సస్పెన్స్, థ్రిల్లింగ్స్ ఇష్టపడే వాళ్ళు, నానీ నుండి వైవిధ్యభరితమైన సినిమాని కోరుకునే వాళ్ళు ఈ చిత్రాన్ని బాగా ఎంజాయ్ చేస్తారు.

123telugu.com Rating : 3.25/5
Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు