సమీక్ష : జనతా గ్యారెజ్ – ఎమోషనల్ యాక్షన్ డ్రామా!

సమీక్ష : జనతా గ్యారెజ్ – ఎమోషనల్ యాక్షన్ డ్రామా!

Published on Sep 3, 2016 5:10 PM IST
Janatha Garage review

విడుదల తేదీ : సెప్టెంబర్ 1, 2016

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5

దర్శకత్వం : కొరటాల శివ

నిర్మాత : నవీన్ ఎర్నేని, వై. రవి శంకర్, మోహన్

సంగీతం : దేవీ శ్రీ ప్రసాద్

నటీనటులు : ఎన్టీఆర్, మోహన్ లాల్, నిత్యా మీనన్, సమంత..

‘జనతా గ్యారెజ్’.. కొద్దినెలలుగా తెలుగు సినీ పరిశ్రమలో బాగా వార్తల్లో నిలుస్తూ వచ్చిన సినిమా. యంగ్ టైగర్ ఎన్టీఆర్ – దర్శకుడు కొరటాల శివల క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ సినిమాపై మొదట్నుంచీ అంచనాలన్నీ తారాస్థాయిలో ఉన్నాయి. ఇక ఆ అంచనాల నడుమే భారీ ఎత్తున నేడు ప్రేక్షకుల ముందుకొచ్చిన సినిమా, అంచనాలను అందుకునే స్థాయిలోనే ఉందా? చూద్దాం..

కథ :

సత్యం (మోహన్ లాల్) ఆటో మొబైల్ వర్క్స్‌ రిపేరింగ్‌లో ఎంతో అనుభవమున్న వ్యక్తి. జనతా గ్యారెజ్ పేరుతో తన కుటుంబం, మిత్రులతో కలిసి ఓ గ్యారెజ్ నెలకొల్పి ఆటో మొబైల్ రిపేర్స్‌తో పాటు, తమ వద్దకు సాయం కోరి వచ్చేవారికి అండగా నిలబడుతూంటాడు సత్యం. ఈ క్రమంలోనే సత్యంపై కక్ష కట్టిన ముఖేష్ (సచిన్ ఖేడ్కర్) చేతిలో సత్యం తమ్ముడు ప్రాణాలు కోల్పోతాడు. దీంతో సత్యం తమ్ముడి కుమారుడు ఆనంద్, జనతా గ్యారెజ్‌కు దూరంగా, తన మేనమామ ఇంట్లో పెరుగుతాడు. ఆనంద్ (ఎన్టీఆర్).. చిన్నప్పట్నుంచీ మొక్కలపై ప్రేమ పెంచుకుంటూ వాటినే తన ప్రపంచంగా మార్చేసుకొని బతుకుతూంటాడు. కొన్ని అనుకోని పరిస్థితుల్లో ఎక్కడో ముంబైలో పుట్టి పెరిగిన ఆనంద్, హైద్రాబాద్‌లో ఉండే జనతా గ్యారెజ్‌ను లీడ్ చేయాల్సి వస్తుంది. ఆనంద్‍ను జనతా గ్యారెజ్‌కు దగ్గర చేసిన అంశమేంటీ? సత్యం తన పెదనాన్నే అని ఆనంద్ తెలుసుకుంటాడా? జనతా గ్యారెజ్‌ను ఆనంద్ ఏ స్థాయికి తీసుకెళతాడు? అన్నది సినిమా.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అంటే కొరటాల శివ రాసుకున్న రెండు బలమైన పాత్రలు, వాటి చుట్టూ ఉన్న ఎమోషన్ అని చెప్పుకోవాలి. ముఖ్యంగా మనుషులు బాగుండాలని కోరుకునే సత్యం పాత్రలో బలమైన ఎమోషన్ ఉంది. జనతా గ్యారెజ్ అన్న ఒక పేరుని ఎంతో మందికి శక్తిగా మార్చి, సత్యం, ఓ ప్యారలల్ సొసైటీ నడపడం అన్నదానిలో అదిరిపోయే హీరోయిజం ఉంది. దీన్ని కొన్నిచోట్ల బాగానే వాడుకున్నారని చెప్పొచ్చు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన నటనా స్థాయిని ఈ సినిమాతో మరోసారి బయటపెట్టాడు. డైలాగ్ డెలివరీలో, యాక్టింగ్‍లో మంచి నటన కనబరుస్తూ ఎన్టీఆర్ సినిమాకు ఓ స్థాయి తీసుకొచ్చాడు. ఇక కంప్లీట్ యాక్టర్ మోహన్‍ లాల్‌ను తెలుగు తెరపై చూడడమన్నది ఓ అద్భుతమైన అనుభూతి. ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో మోహన్ లాల్ నటనకు ఎక్కడా వంక పెట్టలేం. చాలాచోట్ల సినిమాను ఆయన పాత్రే నిలబెట్టింది. సినిమా పరంగా చూసుకుంటే సెకండాఫ్‌లో మొదటి ఇరవై నిమిషాల సన్నివేశాలు మేజర్ హైలైట్‌గా చెప్పాలి. ‘జయహో జనతా..’ అంటూ ఈ సమయంలోనే వచ్చే మాంటేజ్ సాంగ్ చాలా బాగుంది. ఇక ‘పక్కాలోకల్’ అంటూ స్టార్ హీరోయిన్ కాజల్ చేసిన ఐటమ్ సాంగ్ మంచి రిలీఫ్!

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాకు ప్రధానమైన మైనస్ పాయింట్ అంటే ఒక బలమైన కథ, కథనాలు లేకపోవడమనే చెప్పాలి. అదిరిపోయే రెండు పాత్రలను పెట్టుకొని వాటి చుట్టూ అల్లిన కమర్షియల్ కథ చాలా పాతది, ఇప్పటికే బోర్ కొట్టినది కావడం అతిపెద్ద మైనస్. ఇక ఫస్టాఫ్‌లో అసలు కథ పరిచయం కాకపోవడం, సెకండాఫ్‌లో మొదటి ఇరవై నిమిషాల తర్వాత సినిమాలో కథే లేకపోవడం కూడా నిరాశపరిచింది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్‌కి వచ్చేసరికి సినిమా తేలిపోయింది.

ఇక కథా వేగం మొదట్నుంచీ నెమ్మదిగా సాగడం కూడా మైనస్ అనే చెప్పుకోవాలి. సమంత, నిత్యా మీనన్‌ లాంటి స్టార్ హీరోయిన్లు ఉన్నా, వాళ్ళు వేళ్ళపై లెక్కెబెట్టేన్ని సన్నివేశాల్లో కనిపించారు. రెండున్నర గంటలకు పైనే ఉన్న నిడివి కూడా ఓ మైనస్‌గానే చెప్పుకోవచ్చు. ఇక పక్కా కమర్షియల్ సినిమా అయిన ఇందులో కామెడీ లాంటిది ఎక్కడా లేకపోవడం కూడా నిరుత్సాహపరచే అంశమే.

సాంకేతిక విభాగం :

ముందుగా దర్శకుడు కొరటాల శివ గురించి చెప్పుకుంటే.. రెండు మంచి పాత్రలతో కథ చెప్పాలని ప్రయత్నించిన శివ, అసలు కథని మాత్రం పూర్తి స్థాయిలో మెప్పించేలా రాయలేకపోయారు. అయితే కమర్షియల్ సినిమా ఫార్మాట్‌లో దాన్ని మలుచుకొని ఒక ఎమోషనల్ యాక్షన్ డ్రామాను అందించడంలో ఫర్వాలేదనిపించాడు. జనతా గ్యారెజ్ నేపథ్యాన్ని, సెకండాఫ్‌లో మొదటి ఇరవై నిమిషలను చాలా బాగా డీల్ చేశాడు.

తిరు సినిమాటోగ్రఫీ టెక్నికల్‌గా ఈ సినిమాకు ఓ స్థాయి తీసుకొచ్చింది. లైటింగ్, ఫ్రేమింగ్, షాట్ మేకింగ్ అన్నీ పద్ధతిగా ఉండి సినిమాకు అందాన్ని తెచ్చిపెట్టాయి. దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలు బాగున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ విషయంలో దేవీ మరోసారి తన ప్రతిభ చూపాడు. ఎడిటింగ్ బాగుంది. విజువల్ ఎఫెక్ట్స్ సాదాసీదాగా ఉన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడక్షన్ వ్యాల్యూస్ చాలా బాగున్నాయి.

తీర్పు :

తన గత రెండు సినిమాల్లోనూ ఒక బలమైన అంశాన్ని, తెలుగు సినిమాకు అలవాటైన ఫార్మాట్‌లో చెప్పి సక్సెస్ కొట్టిన కొరటాల శివ, ఈసారి పూర్తిగా కమర్షియల్ పంథాని మాత్రమే నమ్ముకొని చేసిన సినిమా ‘జనతా గ్యారెజ్’. ఒక మంచి కమర్షియల్ సినిమాకు కావాల్సిన రెండు బలమైన పాత్రలను ఎంచుకున్న ఆయన, వాటిచుట్టూ పూర్తి స్థాయిలో కట్టిపడేసే కథ, కథనాలను రాసుకోవడంలో మాత్రం తడబడ్డాడు. అయితే ఎన్టీఆర్, మోహన్ లాల్‌ల అదిరిపోయే స్క్రీన్ ప్రెజెన్స్, యాక్టింగ్, సెకండాఫ్‌లో మొదటి ఇరవై నిమిషాల పాటు వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు లాంటివి ఈ సినిమాకు కమర్షియల్‌గా బాగా కలిసివచ్చే అంశాలుగా నిలిచాయి. ఒక్కమాటలో చెప్పాలంటే.. ‘జనతా గ్యారెజ్‌’లో అన్ని రిపేర్లూ చేస్తారు కానీ, ఆ రిపేర్ మరీ బాగుందనే స్థాయిలో ఉండదు.

123telugu.com Rating : 3.25/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు