సమీక్ష : కిరాక్ పార్టీ – యువతను ఆకట్టుకుంటుంది

సమీక్ష : కిరాక్ పార్టీ – యువతను ఆకట్టుకుంటుంది

Published on Mar 16, 2018 2:50 PM IST
Kirrak Party movie review

విడుదల తేదీ : మార్చి 16, 2018

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

నటీనటులు : నిఖిల్, సిమ్రన్ పరీన్జ, సంయుక్త హెగ్డే

దర్శకత్వం : శరన్ కొప్పిశెట్టి

నిర్మాత : సుంకర రామబ్రహ్మం

సంగీతం : అంజనీష్ లోకనాథ్

సినిమాటోగ్రఫర్ : అద్వైత గురుమూర్తి

ఎడిటర్ : ఎం.ఆర్.వర్మ

స్క్రీన్ ప్లే : సుధీర్ వర్మ

యంగ్ హీరో నిఖిల్ నటించిన తాజా చిత్రం ‘కిరాక్ పార్టీ’. కన్నడ సూపర్ హిట్ సినిమా ‘కిరిక్ పార్టీ’కి రీమేక్ గా రూపొందిన ఈ చిత్రం ఈరోజే తెలుగులో విడుదలైంది. నూతన దర్శకుడు శరన్ కొప్పిశెట్టి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం…

కథ :

స్నేహితులతో కలిసి సరదాగా జీవితాన్ని ఎంజాయ్ చేసే ఇంజనీరింగ్ విద్యార్థి కృష్ణ (నిఖిల్) మొదటి సంవత్సరంలోనే నాల్గవ సంవత్సరం చదువుతున్న మీర(సిమ్రన్ పరీన్జ)ను ప్రేమిస్తాడు. ఆమె కూడా అతన్ని పేమిస్తుంది. కానీ అంతలోనే ఆమె అతనికి దూరమవుతుంది.

దాంతో ఎప్పుడూ సరదాగా ఉండే కృష్ణ కఠినంగా మారిపోతాడు. ఎలక్షన్స్ అంటూ ఎప్పుడూ గొడవల్లోనే ఉంటుంటాడు. అలాంటి అతన్ని సత్య (సంయుక్త హెగ్డే) అనే జూనియర్ ప్రేమిస్తుంది. కానీ కృష్ణ మాత్రం మీర జ్ఞాపకాల్లోనే ఉండిపోతాడు. అలాంటి అతన్ని సత్య ఎలా మార్చింది, అసలు మీర కృష్ణకు ఎలా దూరమైంది, ఆ భాదతో కృష్ణ ఎలా తయారయ్యాడు అనేదే సినిమా కథ.

ప్లస్ పాయింట్స్ :

హీరో నిఖిల్ కృష్ణ పాత్రలో బాగానే నటించాడు. మొదటి సంవత్సరం చదివే కుర్రాడిగా సరదగా, ఎనర్జిటిక్ గా కనిపిస్తూనే కాలేజ్ సీనియర్ గా రఫ్ అండ్ టఫ్ లుక్లో కూడ మెప్పించాడు. సినిమా ఫస్టాఫ్ ఎక్కువ భాగం స్నేహితుల మధ్య, కాలేజీలో జరిగే సరదాగా సన్నివేశాలతో, చిన్నపాటి లవ్ ట్రాక్ తో నడుస్తూ ఇంప్రెస్ చేసింది. సంగీత దర్శకుడు అంజనీష్ లోకనాథ్ అందించిన పాటల సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ రెండూ ఇంప్రెస్ చేశాయి.

స్నేహితుల మధ్యన నడిచే పాట, హీరో హీరోయిన్ల నడుమ సాగే రొమాంటిక్ సాంగ్ ఆకట్టుకున్నాయి. హీరో స్నేహితుల పాత్రలో నటించిన యువకులు కూడ ఎక్కడా లిమిట్స్ దాటకుండా సెటిల్డ్ గా పెర్ఫార్మ్స్ చేసి సినిమాకు రియలిస్టిక్ లుక్ వచ్చేలా దోహదపడ్డారు. ప్రీ ఇంటర్వెల్, ఇంటర్వెల్ సన్నివేశాలు ఎమోషనల్ గా ఉండి ఆకట్టుకున్నాయి.

సుధీర్ వర్మ రాసిన ఫస్టాఫ్ స్కీన్ ప్లే బాగుంది. ద్వితీయార్థంలో వచ్చే కొన్ని ఫన్నీ సీన్స్, హీరో ఆకట్టుకోగా సినిమా యొక్క కాలేజ్ నైపథ్యం యువతకు తమ కాలేజీ రోజుల్ని తప్పక గుర్తు చేస్తుంది.

మైనస్ పాయింట్స్ :

సినిమాకు ప్రధాన మైనస్ చెప్పుకోడానికి బాగేనా ఉండే స్టోరీ లైన్ ను ఒక సినిమాకు కావాల్సిన పూర్తిస్థాయి మెటీరియల్ అందించే విధంగా తయారుచేయలేకపోవడమే. ఇంటర్వెల్ సమయానికి బలంగా బయటపడే కథను దర్శకుడు శరన్ కొప్పిశెట్టి సెకండాఫ్ మొత్తం అంతే బలంగా నడపడంలో పెద్దగా సక్సెస్ కాలేదు. ప్రథమార్ధానికి మంచి స్క్రీన్ ప్లే అందించిన సుధీర్ వర్మ ద్వితీయార్థానికి ఆ స్థాయి కథనాన్ని ఇవ్వలేదు.

సెకండాఫ్లోని కీలకమైన సన్నివేశాలు చాలా వరకు రొటీన్ గానే అనిపిస్తాయి. కొన్నైతే చాలా బలహీనంగా కూడ ఉంటాయి. దీంతో చూసే ప్రేక్షకుల్లో కొంత నిరుత్సాహం ఆవరిస్తుంది. విరామ సమయానికి అసలు కథ ఓపెన్ అయినా ద్వితీయార్థంలో అదెక్కడా పెద్దగా కనిపించదు. కాలేజ్ ఎలక్షన్స్, గొడవలు అంటూ సినిమా సైడ్ ట్రాక్లోకి వెళ్ళిపోతుంది. పోనీ ఆ అంశాలనైనా ఎఫెక్టివ్ గా చూపించారా అంటే పేలవమైన సన్నివేశాలతో అరకొరగా చూపించి వదిలేశారు.

దాంతో కథానాయకుడి పాత్ర యొక్క గమ్యం, వ్యక్తిత్వం ఏమిటనేది క్లారిటీగా తెరపై కనబడదు. ఇక ఇంటర్వెల్ ఉన్నంత బలంగా ముగింపు ఉండదు. చిన్న ఎమోషన్, ఒక ఫన్నీ సీన్ తో నార్మల్ గానే ముగిసిపోతుంది.

సాంకేతిక విభాగం :
కథనాన్ని అందించిన సుధీర్ వర్మ మొదటి అర్ధభాగాన్ని బాగానే రాసినా ద్వితీయార్థాన్ని మాత్రం పేలవంగా రాయడంతో దర్శకుడు శరన్ కొప్పిశెట్టి పూర్తి స్థాయిలో ఇంప్రెస్ చేయలేకపోయారు. దీంతో సినిమా రెండవ సగం ఫన్, ఎమోషన్ ఏదీ పూర్తిస్థాయిలో పండలేదు. చందూ మొండేటి రాసిన డైలాగ్స్ బాగానే పర్వాలేదనిపించాయి.

నిర్మాణ సంస్థ ఏకే ఎంటెర్టైమెంట్స్ ఎప్పటిలాగే మంచి నిర్మాణ విలువల్ని పాటించి తమ స్థాయిని చాటుకుంది. ఎం.ఆర్.వర్మ ఎడిటింగ్ ద్వారా సెకండాఫ్లోని కొన్ని అనవసరమైన సన్నివేశాలని తొలగించాల్సింది. అద్వైత గురుమూర్తి సినిమాటోగ్రఫీ ఫ్రెష్ ఫీల్ ను అందించగా అంజనీష్ లోకనాథ్ సంగీతం మెప్పించింది.

తీర్పు :

నిఖిల్ చేసిన ఈ ‘కిరాక్ పార్టీ’ కొంత ఫన్ తో, ఇంకొంత కామెడీతో నడిచిందని చెప్పొచ్చు. నవ్వించే ఫస్టాఫ్ ఫన్, ఎమోషనల్ గా అనిపించే ఇంటర్వెల్ భాగం, ఇంప్రెస్ చేసిన నిఖిల్ పెర్ఫార్మెన్స్, యువతకు కాలేజీ రోజుల్ని గుర్తుకు తెచ్చే సినిమా నైపథ్యం ఈ చిత్రంలో ఆకట్టుకునే అంశాలు కాగా పూర్తిగా పక్కదారి పట్టిన ద్వితీయార్థం, ఇంప్రెస్ చేయలేకపోయిన కీలక సన్నివేశాలు నిరుత్సాహపరుస్తాయి. మొత్తం మీద యూత్ ఫుల్ కంటెంట్ ను కలిగి ఉన్న ఈ చిత్రం యువతను ఆకట్టుకుంటుంది.

123telugu.com Rating : 3/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు