సమీక్ష : మహానటి – సావిత్రిగారికి ఘనమైన నివాళి

సమీక్ష : మహానటి – సావిత్రిగారికి ఘనమైన నివాళి

Published on May 10, 2018 3:15 PM IST
Mahanati movie review

విడుదల తేదీ : మే 9, 2018

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.5/5

నటీనటులు : కీర్తి సురేష్, దుల్కర్ సల్మాన్

దర్శకత్వం : నాగ్ అశ్విన్

నిర్మాతలు : ప్రియాంక దత్, స్వప్న దత్

సంగీతం : మిక్కీ జె మేయర్

సినిమాటోగ్రఫర్ : డాని

ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వరరావు

స్క్రీన్ ప్లే : నాగ్ అశ్విన్

తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిత్రం ‘మహానటి’. మహానటి సావిత్రిగారి జీవితం ఆధారంగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ చిత్రం ఈరోజే విడుదలైంది. మరి ఈ సినిమా సావిత్రిగారి జీవితాన్ని తెరపై ఎలా ఆవిష్కరించిందో ఇప్పుడు చూద్దాం..

కథ:

పల్లెటూరి నుండి మద్రాస్ చేరుకొని సామాన్యురాలిగా సినిమా రంగంలోకి అడుగుపెట్టిన నిస్సంకర సావిత్రి (కీర్తి సురేష్) తన అభినయంతో మహానటిగా, మంచి మనసుతో సావిత్రమ్మగా ప్రజల గుండెల్లో ఎలా నిలిచిపోయారు, తన సహా నటుడు జెమినీ గణేశన్ (దుల్కర్ సల్మాన్) తో ఎలా ప్రేమలో పడ్డారు, అతనితో ఆమె ప్రేమ, వైవాహికి జీవితం ఎలా సాగింది, నమ్మిన వాళ్ళే మోసం చేస్తే మనసు చెదిరి మద్యానికి బానిసై జీవిత చరమాంకంలో ఆమె ఎలాంటి క్షోభను, కష్టాల్ని అనుభవించారు, చివరికి ఈ లోకం నుండి ఎలా నిష్క్రమించారు అనేదే ఈ సినిమా.

ప్లస్ పాయింట్స్ :

ఈ చిత్రంలో బలాలు చాలానే ఉన్నాయి. వాటిలో ముందుగా చెప్పుకోవలసింది దర్శకుడు నాగ్ అశ్విన్ గురించి. ఒక మహా వ్యక్తి జీవితాన్ని సినిమాగా ఎలా తీయాలి, ఎలా తీస్తే అది గొప్ప చిత్రంగా నిలుస్తుంది అనే విషయాల్ని పూసగుచ్చినట్టు ఈ సినిమాతో చూపించాడు నాగ్ అశ్విన్. ఈ సినిమాలో సావిత్రిగారి జీవితం గురించి అయన చూపించిన ప్రతి అంశం నిజమే. చిత్రాన్ని మధురవాణి (సమంత) అనే ఒక జర్నలిస్ట్ పరిశోధనలోంచి మొదలుపెట్టిన దర్శకుడు మెల్లగా ప్రేక్షకుల్ని సావిత్రిగారి జీవితంలోకి తీసుకెళ్లిపోతాడు. సినిమా చూస్తున్నంతసేపు సావిత్రిగారిని దగ్గర్నుండి గమనించినట్టే ఉంటుంది.

అలాగే సావిత్రిగారి సినిమా, వ్యక్తిగతమైన జీవితాల్ని సమాంతరంగా నడుపుతూ ఒక జీవితం ఇంకో జీవితంపై ఎలాంటి ప్రభావం చూపింది, జెమినీ గణేశన్ తో ఆమె ప్రేమ ఎలా ఉండేది, మనసారా ప్రేమించిన జెమినీ గణేశన్ మధ్యలో సావిత్రిని ఎలా నిర్లక్ష్యం చేశాడు, నా అనుకున్న వాళ్లంతా ఆమెను ఎలా మోసం చేశారు, ఆ క్షోభను మర్చిపోవడానికి ఆమె మద్యానికి ఎంతలా బానిసయ్యారు వంటి విషయాల్ని ఎంతో భావోద్వేగపూరితంగా వివరించారాయన. అలాగే ఆమె నటిగా ఎదగడంలో కెవి.రెడ్డి, కెవి.చౌదరి, ఎల్వి. ప్రసాద్, చక్రపాణి లాంటి ప్రముఖుల పాత్ర ఎటువంటిదో కూడ సవివరంగా చూపారు.

ఇక సినిమాలో మరొక అద్భుతం కీర్తి సురేష్ నటన. ఆమెను చూస్తున్నంతసేపు సావిత్రిగారే తెరమీద నటిస్తున్నారా అన్నంత గొప్పగా నటించారామె. వేషధారణ, అభినయం, బాడీ లాంగ్వేజ్ వంటి ప్రతి అంశంలోనూ సావిత్రిగారిని అనుకరిస్తూ కెరీర్లోనే బెస్ట్ పెర్ఫార్మెన్స్ చూపించారు. ముఖ్యంగా ద్వితీయార్థంలో మద్యానికి బానిసైన సావిత్రిపై నడిచే ఎమోషనల్ సన్నివేశాల్లో ఆమె నటన మనసును హత్తుకుంది.

సావిత్రిగారి బాల్యం, ఆమె సినిమాల్లోకి రావడం వంటి అంశాలతో ఫస్టాఫ్ గడిచిపోగా ద్వితీయార్థం మాత్రం సావిత్రిగారి జీవితంలోని ఒడిదుకులతో ఆసక్తికరంగా నడుస్తూ ఆద్యంతం ఆకట్టుకుంది. దుల్కర్ సల్మాన్ కూడ జెమినీ గణేశన్ పాత్రలో చాలా సహజంగా నటించి మెప్పించగా జర్నలిస్ట్ పాత్రలో సమంత పెర్ఫార్మెన్స్ ఇంప్రెస్ చేసింది.

మైనస్ పాయింట్స్ :

సినిమా మొదటి అర్థ భాగం రన్ టైమ్ కొంచెం ఎక్కువ కావడంతో సినిమా కొంత నెమ్మదిగా సాగిన ఫీలింగ్ కలుగుతుంది. అంతేగాక సావిత్రిగారి కథను వివరించిన జర్నలిస్ట్ మధురవాణి ట్రాక్ ను కథనంలో ఎక్కువగా ఇన్వాల్వ్ చేయడంతో ప్రధాన కథ యొక్క ఫ్లోకు కొంత ఆటంకం కలిగింది.

సావిత్రిగారి నటనా జీవితం ఎంత గొప్పగా ఉండేది, ఇతర నటీ నటులతో ఆమె సాన్నిహిత్యం ఎలాంటిది వంటి అంశాలని ఇంకాస్త వివరంగా చూపి ఉండాల్సింది. సావిత్రిగారి కథ తెలిసిన వాళ్లకి ఈ చిత్రం బాగా కనెక్టవుతుంది కానీ తెలియనివారికి చిత్రం ఒక మామూలు సినిమాలాగానే అనిపిస్తుంది.

సాంకేతిక విభాగం :

దర్శకుడు నాగ్ అశ్విన్ పకడ్బంధీగా పరిశోధన నిర్వహించి సావిత్రిగారి జీవితాన్ని సేకరించి అందులో నుండి సినిమాకు కావాల్సినంత మేరకు విషయాన్ని తీసుకుని, ప్రధాన పాత్రల్లో సరైన నటీనటుల్ని ఎంపిక చేసుకుని ఆయన చేసిన ప్రయత్నం చాలా వరకు సఫలమై మంచి సినిమా తయారైంది. ముఖ్యంగా సావిత్రిగారి పతనాన్ని చూపిన విధానం, ఆమె మద్యానికి ఎంతలా బానిసయ్యారు, ప్రేమించిన జెమినీ గణేశన్ మోసానికి ఎంతలా కుంగిపోయారు అనే అంశాలని సన్నివేశాల రూపంలో అయన చూపిన తీరు మనసుల్ని హత్తుకున్నాయి.

మిక్కీ జె మేయర్ సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకున్నాయి. కెమరామెన్ డాని 80 ల కాలంలో నడిచే కథను ఫిలింలోను, జర్నలిస్ట్ మధురవాణి కోణంలో నడిచే సావిత్రి కథను డిజిటల్ కెమెరా ద్వారా చూపించి సాంకేతికంగా సినిమాను ఉన్నత స్థాయిలో నిలబెట్టారు. ఇక ప్రోడక్షన్ డిజైన్ చాలా బాగుంది. అప్పటి సినిమా సెట్టింగులను పోలిన సెట్స్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. కోటగిరి వెంకటేశ్వరరావుగారి ఎడిటింగ్ సినిమాకు బాగా ఉపయోగపడింది. నిర్మాతలు ప్రియాంక దత్, స్వప్న దత్ లు ఒక సినిమాకు నిర్మాతల సహకారం ఎలా ఉండాలో చెప్పడానికి ఉదాహరణగా నిలిచారు.

తీర్పు :

‘మహానటి’ చిత్రం సావిత్రిగారి జీవితాన్ని ఎంతో భావోద్వేగపూరితంగా వెండితెర మీద ఆవిష్కరించింది. నాగ్ అశ్విన్ పరిశోధన చేసి సిద్ధం చేసుకున్న కథ, సినిమాలోని కీలకమైన సన్నివేశాలు, ఎమోషనల్ డ్రామా సావిత్రిగారి సినీ, వ్యక్తిగత జీవితం ఎలాంటిది, జెమినీ గణేశన్ తో ఆమె ప్రేమ, వైవాహిక బంధాలు ఎలా నడిచాయి, మహానటిగా ఆమె వైభవం ఎంతటిది, సహాయం చేయడంలో ఆమె తత్త్వం ఎంత గొప్పది, చివరికి నమ్మినవాళ్ళే మోసం చేసేసరికి ఆమె ఎలా పతనమయ్యారు వంటి ముఖ్యమైన విషయాల్ని కళ్ళకు కట్టాయి. అలాగే సావిత్రిగారి పాత్రలో కొన్ని సంవత్సరాల పాటు గుర్తుండిపోయేలా నటించిన కీర్తి సురేష్ తన నటన అబ్బురపరచగా కొంత నెమ్మదించిన కథనం, డ్రామా కొద్దిగా ఇబ్బంది అనిపించాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ చిత్రం సావిత్రిగారికి ఘనమైన నివాళి లాంటిదని చెప్పొచ్చు.

123telugu.com Rating : 3.5/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు