సమీక్ష : మాస్ – సహనానికి పరీక్ష..!

సమీక్ష : మాస్ – సహనానికి పరీక్ష..!

Published on Apr 29, 2016 10:38 PM IST
Mass review

విడుదల తేదీ : ఏప్రిల్ 29, 2016

123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5

దర్శకత్వం : బాలాజీ మోహన్

నిర్మాత : వాసిరెడ్డి పద్మాకరరావు

సంగీతం : అనిరుధ్

నటీనటులు : ధనుష్, కాజల్ అగర్వాల్, రోబో శంకర్…


ధనుష్, కాజల్ అగర్వాల్ జంటగా ’లవ్ ఫెయిల్యూర్’ ఫేం దర్శకుడు బాలాజీ మోహన్ దర్శకత్వంలో 2015లో వచ్చిన తమిళ చిత్రం ‘మారి’. ఇప్పుడు ఆ చిత్రాన్ని ’మాస్’ పేరుతో తెలుగులో ఈ రోజు విడుదల చేశారు. మరి ఈ ‘మాస్’ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

కథ:

మారి(ధనుష్) ఓ లోకల్ రౌడీ. చిన్న చిన్న దందాలు చేస్తూ తన ఇద్దరు అనుచరులతో కలిసి బ్రతికేస్తూ ఉంటాడు. రౌడీ అయినా కానీ పావురాలను పెంచుకుంటూ ఉండే మారి, ప్రతి సంవత్సరం జరిగే పావురాల పోటీల్లో పాల్గొని గెలుస్తూ ఉంటాడు. వేలు అన్న అనే ఓ పెద్ద రౌడీ అండదండలు ఉండడం వల్ల మారికి అందరూ భయపడుతూ ఉంటారు. కాగా మారిని ఆ ఏరియా ఎస్.ఐ అర్జున్ (విజయ్ ఏసుదాస్) ఎలాగైనా ఓ కేసులో పట్టుకుని జైలులో పెట్టాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే కొన్ని అనుకోని పరిస్థితుల్లో మారి జైలుకి వెళ్లవలిసి వస్తుంది. ఆ తరవాత ఏం జరిగింది? శ్రీదేవి (కాజల్)తో మారి ప్రేమకథ ఏమైందీ? అనేది మిగతా కథ.

ప్లస్ పాయింట్స్:

ఈ సినిమాకు ప్రధాన ప్లస్ పాయింట్ అంటే ధనుష అనే చెప్పుకోవాలి. ధనుష్ క్యారెక్టరైజేషన్ బాగుంది. ఇక తన నటనతో ధనుష్ సినిమాను నిలబెట్టడానికి అన్ని విధాలుగా ప్రయత్నం చేశాడు. ఓ చిన్న రౌడీగా, ఓ పెద్ద రౌడీకి అనుచరుడిగా బాగా నటించాడు. కాజల్ అగర్వాల్ చాలా అందంగా ఉంది. చిత్ర మొదటి భాగంలో అమాయకమైన యువతిగా చక్కటి నటన ప్రదర్శించింది. ఇన్సపెక్టర్ అర్జున్ గా విజయ్ ఏసుదాస్ బాగా నటించాడు. మొదట్లో సిన్సియర్ పోలీస్ అఫీసర్ గా, ఆ తరువాత మోసగాడిగా బాగా నటించాడు.

మైనస్ పాయింట్స్:

తెలుగు ప్రేక్షకులకు ఏ మాత్రం రుచించని కథను దర్శకుడు బాలాజీ మోహన్ ఎంచుకున్నాడు. పరమ రొటీన్ కథకు, ఏ మాత్రం కొత్తదనం లేని కథనాన్ని ఎంచుకుని ప్రేక్షకులను విసిగించాడు. చిత్ర మొదటి భాగంలో ఎంటర్టైన్మెంట్ కొంత వరకు ఉన్నప్పటికీ రెండవ భాగంలో ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షించే స్థాయిలో కథనం ఉంటుంది. కాజల్ అగర్వాల్ చాలా అందంగా ఉండటం తప్పించి ఆమెకి ఈ చిత్రంలో నటించడానికి ఆస్కారం లేకపోవడం విచారకరం. హీరో హీరోయిన్ల మధ్య వచ్చే రొమాంటిక్ ట్రాక్ ఏమాత్రం ఆకట్టుకోదు.

కొద్దిసేపు పావురాల కథ, కొద్ది సేపు ఎర్రచందనం కథ ఇలా ఉపకథలు ఎక్కువ కావడంతో అసలు కథ కొంత, అనవసరమైనది ఎంతో అన్న చందంగా కథనం సాగుతుంది. దీని వల్ల ప్రేక్షకుడిని ఏ సన్నివేశం ఎందుకు వస్తుందో తెలియని గందరగోళంలో పడేస్తుంది. పావురాలతో పందెం కొత్తగా ఉన్నా దాని నేపథ్యం ఏంటో చెప్పలేదు. సినిమా నిడివి కూడా ఒక మైనస్ పాయింట్ కింద చెప్పవచ్చు. రణగొన ధ్వనులు, రొడ్డ కొట్టుడు సంగీతం ఈ సినిమా స్థాయిని మరింత తగ్గిస్తాయి. అనవసరమైన స్లో మోషన్ షాట్స్ విసిగిస్తాయి.

సాంకేతిక విభాగం:

ఈ సినిమాలో సాంకేతికపరంగా ఆకట్టుకునే అంశం – సినిమాటోగ్రఫీ. ఓం ప్రకాష్ సమకూర్చిన సినిమాటోగ్రఫీ మూడ్ తగ్గట్లు ఉంది. ఎడిటింగ్ బాగా లేదు. నిర్మాణాత్మక విలువలు బాగానే ఉన్నాయి. దర్శకుడిగా బాలాజీ మోహన్ గురించి చెప్పాలంటే… రెండు సన్నివేశాలు మాత్రం బాగా తీసాడు. అందులో ఒకటి మారి శ్రీదేవికి ప్రపోజ్ చేసేది కాగా, రెండు పావురాలు తిరిగి వచ్చేది మరొకటి. ఈ రెండింటిని కొత్తగా, కాస్త ఎమోషనల్ గా తీయడం వల్ల ఆకట్టుకుంటాయి. నటీనటుల నుంచి మంచి నటన రాబట్టుకున్నాడు. అంతకు మించి దర్శకుడి గురించి చెప్పడానికి ఏమీ లేదు.

తీర్పు:

ధనుష్ సినిమాకు తెలుగులోనూ అంతో ఇంతో క్రేజ్ ఉంది. ఆ క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకొనే ఆయన తమిళంలో చేసిన సినిమాలను ఇక్కడ అడపదడపా ప్రేక్షకుల ముందుకు తెస్తుంటారు. అలా వచ్చిన సినిమాల్లో ఒకటే ‘మాస్’. ఒక బలమైన కథంటూ లేకఫోవడం, కథనం కూడా విసుగు తెప్పించేలా ఉండడం, ఏం చెప్తున్నారో కూడా తెలియనంత అయోమయంతో నిండిన సన్నివేశాలు.. అన్నీ కలుపుకొని ఈ సినిమాను ఓ సాధారణ సినిమాగానూ మిగిల్చలేకపోయాయి. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఎప్పుడో తమిళంలో విషయమన్నదే లేకుండా విడుదలైన ఈ సినిమా ఇప్పుడిక్కడ విడుదలై చేసేదీ, చేయగలిగిందీ ఏమీ లేదు, విసుగు పుట్టించడం తప్ప!

123telugu.com Rating : 2/5
Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు