సమీక్ష : మెట్రో – రియలిస్టిక్ గా అనిపించే క్రైమ్ థ్రిల్లర్

సమీక్ష : మెట్రో – రియలిస్టిక్ గా అనిపించే క్రైమ్ థ్రిల్లర్

Published on Mar 18, 2017 1:15 AM IST
Metro movie review

విడుదల తేదీ : మార్చి 17, 2017

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

దర్శకత్వం : ఆనంద కృష్ణన్

నిర్మాతలు :ర‌జ‌ని రామ్

సంగీతం : జాన్

నటీనటులు : శిరీష్, బాబీ సింహ, మాయ

ఈ ఆదివారం విడుదలైన చిన్న చిత్రాల్లో చైన్ స్నాచింగ్స్ అనే ఒక క్రైమ్ ను ఆధారంగా చేసుకుని రూపొందినబడిన ‘మెట్రో’ చిత్రం అందరి దృష్టినీ కాస్త ఎక్కువగా ఆకర్షిస్తోంది. మరి ఈ చిత్రం ఎంతమేరకు ప్రేక్షకులని మెప్పించగలదో ఒకసారి చూద్దాం..

కథ :

ఈ సినిమా కథ చైన్ స్నాచింగ్ లకు పాల్పడే ఒక గ్యాంగ్ ను ఆధారంగా చేసుకుని రూపొందించబడింది. ఆ భయంకరమైన గ్యాంగ్ లో ఒక మంచివాడైన ఇంజినీరింగ్ కుర్రాడు ఎలా చేరతాడు, ఆ తర్వాత అతని కుటుంబం యొక్క పరిస్థితి ఎలా మారింది, ఆ మాఫియాలో అతను ఎలా ఇరుక్కుపోతాడు అనే కథనాన్ని ఆసక్తికరమైన మలుపులతో తెరపై సినిమాగా ఆవిష్కరించారు.

ప్లస్ పాయింట్స్ :

చైన్ స్నాచింగ్ నైపథ్యంలో తయారుచేసిన కథే ఈ సినిమాకు ప్రధాన బలం. ఈ క్రైమ్ కథ నైపథ్యంలో ఒక కుటుంబపరమైన డ్రామాను నడపడం చాలా బాగుంది. ఒకవైపు క్రైమ్ స్టోరీ నడుస్తూనే మరోవైపు ఫ్యామిలీ డ్రామా పర్ఫెక్ట్ గా రన్ అవడం ఇంప్రెస్ చేసింది.

చైన్ స్నాచింగులు ఎలా జరుగుతాయో చాలా రియలిస్టిక్ గా చూపారు. దొంగలు ఆడవాళ్లను ఎలా టార్గెట్ చేస్తారు, బంగారాన్ని ఎలా దొంగిలిస్తారు, అలా దొంగిలించిన బంగారాన్ని ఏం చేస్తారు అనే అంశాలను చాలా బలమైన సన్నివేశాల రూపంలో చూపెట్టారు.

ఇక నటుడు బాబీ సింహ తన నెగెటివ్ రోల్ లో బాగా నటించాడు. అతని వలన సినిమాకి సీరియస్ నెస్ వచ్చింది. అలాగే సపోర్టింగ్ రోల్స్ చేసిన నటులు కూడా బాగా చేశారు. వారి పాత్రలు చాలా వాస్తవికంగా ఉండి సినిమాకు రియలిస్టిక్ లుక్ తీసుకొచ్చాయి. అలాంటి పాత్రలు ఎంచుకున్నందుకు దర్శకుడికే క్రెడిట్ ఇవ్వాలి. అలాగే ముఖ్యమైన సినిమా క్లైమాక్స్ ను కూడా చాలా కన్విన్సింగా చెప్పాడు దర్శకుడు.

మైనస్ పాయింట్స్ :

దర్శకుడు సినిమాలో కాస్త కథాపరమైన స్వేచ్ఛను ఎక్కువగా వాడుకోవడం జరిగింది. చైన్ స్నాచింగులు చేసే మాఫియా నైపథ్యాన్ని చాలా ఫ్రీగా చూపించాడు. అలాగే పోలీసులు, న్యాయ వ్యవస్థ ఈ స్నాచింగ్ దొంగల పట్ల అవలంబిస్తున్న వైఖరిని పూర్తిగా నెగ్లెట్ చేశాడు. సెకండాఫ్లో కూడా స్నాచింగ్స్ కు సంబందించిన సన్నివేశాలను మోతాదుకు మించి కాస్త ఓవర్ గా ఎలివేట్ చేయడం జరిగింది.

హీరో కొన్ని తీవ్రమైన నేరాలకు పాల్పడినా వాటికి దూరంగా ఉన్నట్టు చూపడం ఓవర్ గా అనిపించింది. సినిమా క్రైమ్ థ్రిల్లర్ అవడం మూలాన ఎంటర్టైన్మెంట్ కు స్కోప్ లేకుండా పోయింది. అలాగే తెలిసిన నటీనటులు లేకపోవడం కూడా సినిమాకు కొంత నష్టం కలిగించే విషయమే.

సాంకేతిక విభాగం :

సినిమాలో ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. సిటీలోని కొన్ని ఏరియాలను అద్భుతమైన కెమెరా వర్క్ తో చూపించారు. జాన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకు బాగా హెల్ప్ అయింది. నందు, ధన్ రాజ్ లు పాత్రలకు చెప్పిన తెలుగు డబ్బింగ్ కూడా బాగా కుదిరింది.

నటీనటుల నుండి మంచి నటన రాబట్టి కథను మంచి స్క్రీన్ ప్లే తో ఇంప్రెసివ్ గా చెప్పడంలో దర్శకుడు ఆనంద కృష్ణన్ సక్సెస్ అయ్యాడు. అలాగే కొన్ని క్రైమ్ సన్నివేశాల్ని కాస్త అతిగా చూపినప్పటికీ సినిమాను నడిపిన విధానంతో దాన్ని కవర్ చేశాడు.

తీర్పు :
మంచి కథా నైపథ్యం ఉన్న ఈ సినిమాను దర్శకుడు ఆనంద్ కృష్ణన్ తెరపై బాగా ఆవిష్కరించాడు. ఈ సినిమాలోని కొన్ని రియలిస్టిక్ సన్నివేశాలు మంచి థ్రిల్ ఇస్తాయి. క్రైమ్ థ్రిల్లర్స్ ను ఇష్టపడుతూ ఎంటర్టైన్మెంట్ లేకపోయినా పెద్దగా పట్టించుకోని ప్రేక్షకులకు ఈ చిత్రం ఈ వీకెండ్లో మంచి చాయిస్ గా నిలుస్తుంది.

123telugu.com Rating : 3/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు