సమీక్ష : నాకైతే నచ్చింది – అయ్య బాబోయ్.. నాకైతే నచ్చలేదు.

సమీక్ష : నాకైతే నచ్చింది – అయ్య బాబోయ్.. నాకైతే నచ్చలేదు.

Published on Mar 6, 2015 9:10 PM IST
Nakaithe Nachindi Review

విడుదల తేదీ : 06 మార్చి 2015
123తెలుగు.కామ్ రేటింగ్ : 1/5
దర్శకత్వం : త్రినాథ్ కోసూరు
నిర్మాత : ఎపి రాధాకృష్ణ
సంగీతం : మణిశర్మ
నటీనటులు : శ్రీ బాలాజీ, సోనీ చరిష్టా, కృష్ణ, రిషిక..


ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ సంగీతం అందించిన సినిమా ‘నాకైతే నచ్చింది’. త్రినాథ్ కోసూరు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీ బాలాజీ, సోనీ చరిస్తా, కృష్ణ, రిషిక ప్రధాన పాత్రలు పోషించారు. రాధాకృష్ణ ఫిల్మ్ సర్క్యూట్ పతాకంపై ఏపి రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మించారు. నేడు విడుదలయిన ఈ సినిమా ఎలా ఉందో ఈ సమీక్ష చదివి తెలుసుకోండి.

కథ :

హెయిర్ ఆయిల్ అడ్వర్టైజ్మెంట్లో తన ఫోటోలను చూసి శ్వేత (సోనీ చరిస్తా) షాక్ అవుతుంది. అసహ్యంగా ఉన్న ఆ ఫోటోలను చూపిస్తూ.. అందరు హేళన చేస్తుంటే తన అనుమతి లేకుండా ఈ పని చేసిన కార్తీక్ (శ్రీ బాలాజీ)కి తగిన శాస్తి చేయాలనుకుంటుంది. ఒక ప్రమాదం నుండి తనను కాపాడడంతో కార్తీక్ పై ఉన్న కోపం కాస్తా ప్రేమగా మారుతుంది. శ్వేత ఇంట్లో వీరి పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ లభిస్తుంది. ఆ సమయంలో ఫ్యామిలీ ఫ్రెండ్, ఎప్పటి నుండో శ్వేతను ప్రేమిస్తున్న రాహుల్ (కృష్ణ) ద్వారా పక్కా ప్లాన్ ప్రకారమే కార్తీక్ శ్వేతను ప్రేమిస్తున్నాడనే నిజం తెలుస్తుంది.

నిజంగానే శ్వేత అంటే కార్తీక్ కు ప్రేమ లేదా..? కార్తీక్ తో చనువుగా తిరుగుతున్న మనీషా (రిషిక) ఎవరు..? అసలు కార్తీక్ ప్లాన్ ఏంటి..? అనే ప్రశ్నలకు సమాధానం సినిమా చూసి తెలుసుకోవాలి.

ప్లస్ పాయింట్స్ :

సినిమాలో హీరోయిన్లు రిషిక, సోనీ చరిస్తాల గ్లామర్ బి, సి సెంటర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా పాటల్లో వీరిద్దరూ అందాలు ఆరబోశారు. సన్నివేశాల్లో కూడా ఎంతో కొంత అందాలను చూపించే ప్రయత్నం చేశారు. పాటలు మణిశర్మ స్థాయిలో లేకపోయినా రెండు పాటలు బాగున్నాయి.

మైనస్ పాయింట్స్ :

కథలో కాస్తయినా కొత్తదనం లేదు. హీరోయిన్ ని కావాలని ట్రాప్ చేయడం, సదుద్దేశ్యంతోనే హీరో ఇదంతా చేయడం.. చివరకు హీరోయిన్ ను ప్రేమించడం అనే కాన్సెప్ట్ తో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. పోనీ, అదే కథను అటు ఇటు తిప్పి ఆసక్తికరంగా చెప్పాడా అంటే అది లేదు. ఇక ఫ్లాష్ బ్యాక్ అయితే అబబ్బో.. వర్ణించడం కష్టం.

హీరో శ్రీ బాలాజీతో పాటు ఇతర ప్రధాన పాత్రలు పోషించిన ప్రతి ఒక్కరు పర్వాలేదు అనే స్థాయిలో కూడా నటించలేదు. గౌతం రాజు, చిత్రం శీను వంటి సీనియర్ ఆర్టిస్టుల పాత్రలు తేలిపోయాయి. వారి నటన సైతం అంతత మాత్రమే. లోపం దర్శకుడిలో ఉందా..? అనే అనుమానం థియేటర్లలో ప్రేక్షకులకు కలగక మానదు.

సినిమా ప్రారంభం నుండి ప్రేక్షకుడిని విసిగిస్తుంది. ఆర్టిస్టుల పేలవమైన నటనకు తోడు ఎటువంటి ఫీలింగ్ కలిగించని సన్నివేశాలు తలనొప్పి తెప్పించాయి. ఫక్తు కమర్షియల్ తరహాలో ఐటెం సాంగు, కథలో ఇరికించిన కామెడీ ట్రాక్ ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టాయి. ఒకానొక సమయంలో థియేటర్ నుండి వెళ్లిపోతే మనం సేఫ్ అనే ఆలోచన బలంగా వస్తుంది.

సాంకేతిక విభాగం :

దర్శకుడు త్రినాథ్ కోసూరు కథలో మిల్లీమీటర్ కొత్తదనం లేదు. ఆ కథను చెప్పిన విధానం అంత కన్నా ఘోరం. ప్రతి సన్నివేశంలో అతని వైఫల్యం కనిపిస్తుంది. కామెడీ, సెంటిమెంట్, యాక్షన్ .. నవరసాల్లో ఒక్క ఎమోషన్ కూడా సరిగా పండలేదు. డైలాగ్స్ గురించి మాట్లాడుకాకపోవడం చాలా మంచిది. కామెడీ సన్నివేశాన్ని.. ప్రేక్షకులకు ట్రాజెడీ సన్నివేశంగా మార్చారు. ఎడిటర్, సినిమాటోగ్రాఫర్, ప్రొడక్షన్ వాల్యూస్.. ఇలా టెక్నికల్ విభాగంలో చెప్పుకునేంత పనితీరును ఎవరును కనబరచలేదు. దర్శకుడు ఫెయిల్ అయినప్పుడు మిగతావి కూడా నచ్చడం కష్టమే.

తీర్పు :

‘నాకైతే నచ్చింది’ సినిమాలో సినీ ప్రేక్షకులకు నచ్చే అంశం ఒక్కటి కూడా లేదు. రిషిక, సోనీ చరిస్తాల అందాల ప్రదర్శన కేవలం బి, సి సెంటర్ ప్రేక్షకులను మాత్రమే ఆకట్టుకునే అవకాశం ఉంది. పాత కథ, విసిగించే కథనం, ఆకట్టుకోని దర్శకత్వం.. వీటికి హీరో, ఇతర ప్రధాన ఆర్టిస్టుల పేలవమైన నటన తోడవడంతో థియేటర్లో ప్రేక్షకులకు తలబొప్పి కడుతుంది. సినిమా పూర్తయిన తర్వాత గట్టిగా బాబోయ్ నాకైతే సినిమా నచ్చలేదు. అని చెప్పాలనిపిస్తుంది. ఈ సినిమా చూడాలనుకుంటే మీ ఇష్టం.

123తెలుగు.కామ్ రేటింగ్ : 1/5
123తెలుగు టీం

సంబంధిత సమాచారం

తాజా వార్తలు