సమీక్ష : భద్రమ్ – టెన్షన్ పెట్టే థ్రిల్లర్

సమీక్ష : భద్రమ్ – టెన్షన్ పెట్టే థ్రిల్లర్

Published on Mar 22, 2014 3:00 AM IST
Bhadram-telugu విడుదల తేది : 21 మార్చి 2014
123తెలుగు .కామ్ రేటింగ్ : 3.25/5
దర్శకత్వం :  పి. రమేష్
నిర్మాత : గుడ్ ఫ్రెండ్స్ & బి. రామ కృష్ణ రెడ్డి
సంగీతం : నివాస్.కె. ప్రసన్న
నటినటులు : అశోక్ సెల్వన్, జనని అయ్యర్…

గతంలో తమిళంలో విజయవంతమైన తమిళ సినిమాలను ‘పిజ్జా’, ‘విల్లా’గా తెలుగు వారికి అందించిన శ్రేయాస్ మీడియా వారు ఫిబ్రవరి చివర్లో తమిళంలో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ‘తెగిడి’ సినిమాని ‘భద్రమ్’ సినిమా పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఈ రోజు రిలీజ్ కానున్న ఈ సినిమాని మేము ప్రత్యేకంగా తిలకించాం. అశోక్ శెల్వన్, జనని అయ్యర్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీ ద్వారా పి. రమేష్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. తమిళ ప్రేక్షకులను మెప్పించిన తెగిడి అలియాస్ భద్రమ్ తెలుగు ప్రేక్షకులను ఎంత వరకూ మెప్పించిందో చూద్దాం..

కథ :

క్రిమినాలజీ పూర్తి చేసిన వేణు(అశోక్ సెల్వన్)కి రాడికల్ డిటెక్టివ్ సర్వీస్ లో డిటెక్టివ్ జాబు రావడంతో హైదరాబాద్ కి వచ్చి అమీర్ తో పాటు ఉంటాడు. వేణు కంపెనీ తనకు ఇచ్చిన ప్రతి కేసుని చాలా పర్ఫెక్ట్ గా ఇన్వెస్టిగేట్ చేసి ఫినిష్ చేస్తుంటాడు. అలా ఓ రోజు వేణు చేతికి మధు శ్రీ(జనని అయ్యర్) ఫెయిల్ వస్తుంది. వేణు తన గురించి తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా తనతో పరిచయం పెంచుకుంటాడు. వారిద్దరి పరిచయం కాస్తా ప్రేమగా మారుతుంది.

అప్పుడే వేణుకి ఒక షాకింగ్ న్యూస్ తెలుస్తుంది. తను ఇన్వెస్టిగేట్ చేసిన ప్రతి ఒక్కరు ఒక్కొక్కరుగా చనిపోతూ ఉంటారు. వారు చనిపోయేది యాదృచ్చికం కాకపోతే తదుపరి చనిపోయేది మధునే అని తెలియడంతో వేణు అసలు వారు ఎందుకు చనిపోతున్నారు? వారి చావులు వెనుక ఏమన్నా కారణం ఉందా? అసలు ఇదంతా ఎందుకు, ఎవరు చేస్తున్నారు? చివరికి మధుని కూడా చంపేసారా? లేక వేణు మధుని కాపాడగలిగాడా? అనేది మీరు వెండితెరపైనే చూడాలి.

ప్లస్ పాయింట్స్ :

యంగ్ డిటెక్టివ్ పాత్రకి అశోక్ సెల్వన్ చాలా పర్ఫెక్ట్ గా సరిపోయాడు. డైరెక్టర్ రాసుకున్న పాత్రకి పూర్తి న్యాయం చేసాడు. టెన్షన్, సస్పెన్స్ సన్నివేశాల్లో అతని నటన బాగుంది. పోలీస్ ఆఫీసర్ జయ ప్రకాష్, హీరో ఫ్రెండ్ గా చేసిన కాళి తమ పాత్రలకు న్యాయం చేసారు.

డైరెక్టర్ అది ఇది అని పక్కదార్లు పట్టకుండా మొదటి సీన్ తోనే కథలోకి వెళ్ళిపోయాడు. సినిమా స్టార్టింగ్ ఒకమాదిరిగా మొదలయ్యి, మధ్యలో వచ్చే లవ్ ట్రాక్ దగ్గర కాస్త స్లో అయ్యి ఆ తర్వాత ఇంటర్వెల్ ముందు 30 నిమిషాలు మాత్రం చాలా వేగంగా, చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అలాగే సెకండాఫ్ లో వచ్చే కొన్ని సస్పెన్స్ ఎలిమెంట్స్ ని కూడా ప్రేక్షకులలో ఉత్కంఠని పెంచేలా డైరెక్టర్ పి. రమేష్ బాగా డీల్ చేసాడు.

డబ్బింగ్ సినిమా అయినప్పటికీ సినిమాలోని పాటలు మరియు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. అలాగే సినిమా నిడివి కూడా 2 గంటలే కావడం ఈ సినిమాకి మరో పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పాలి.

మైనస్ పాయింట్స్ :

సినిమా సెకండాఫ్ మొత్తాన్ని కాస్త సస్పెన్స్ గా లాక్కొచ్చినప్పటికీ క్లైమాక్స్ లో ట్విస్ట్ రివీల్ చేసిన తర్వాత జస్టిఫికేషన్ సరిగా ఉండదు. దానివల్ల సినిమాకి ముగింపు కాస్త అర్ధవంతంగా అనిపిస్తుంది. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా కాబట్టి మనం కామెడీ ఆశించకూడదు. మనం ఆశించినట్టుగానే ఈ సినిమాలో కామెడీ అస్సలు లేదు. అందువల్ల ఈ సినిమా బి, సి సెంటర్స్ లో ఎక్కడం కాస్త కష్టతరం అని చెప్పాలి.

హాలీవుడ్ టీవీ సీరీస్ మరియు హిందీ సిఐడి సీరీస్ లు ఫాలో అయ్యేవారికి ఈ సినిమా పెద్దగా నచ్చకపోవచ్చు.

సాంకేతిక విభాగం :

ఈ సినిమాకి ప్రధాన హైలైట్స్ లో చెప్పుకోవాల్సింది నివాస్ కె ప్రసన్న మ్యూజిక్ మరియు దినేష్ కృష్ణన్ సినిమాటోగ్రఫీ. నివాస్ కె ప్రసన్న అందించిన పాటలు బాగున్నాయి, అలాగే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ విషయంలో సస్పెన్స్ సీన్ ని ఎలివేట్ చేసి ఆడియన్స్ లో టెన్సన్ క్రియేట్ చేయడంలో కూడా సక్సెస్ అయ్యాడు. దినేష్ కృష్ణన్ అందించిన సినిమాటోగ్రఫీ కూడా సినిమాకి చాలా హెల్ప్ అయ్యింది. ఎడిటింగ్ బాగుంది కానీ ఇంకాస్త బెటర్ గా ట్రై చేసి ఉంటే సినిమాకి ఇంకా హెల్ప్ అయ్యేది. డైలాగ్స్ మరియు తెలుగు వెర్షన్ డబ్బింగ్ కూడా సినిమాకి బాగా సరిపోయింది.

ఇక డైరెక్టర్ గా పి. రమేష్ కి ఇది మొదటి సినిమా, అది కూడా సస్పెన్స్ థ్రిల్లర్ అయినప్పటికీ మూవీని చాలా బాగా హాండిల్ చేసాడు. సెకండాఫ్ క్లైమాక్స్ విషయంలో ఇంకాస్త శ్రద్ధ తీసుకొని ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు :

‘తెగిడి’ అనే హిట్ తమిళ సినిమాకి డబ్బింగ్ వెర్షన్ గా వచ్చిన ‘భద్రమ్’ సినిమా తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటుంది. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలపై ఆసక్తి ఉన్న వారికి ఈ సినిమా నచ్చుతుంది. కమర్షియల్ ఎంటర్టైనర్స్ కోరుకునే వారికి ఈ సినిమాలో వారు కోరుకునే అంశాలు ఏమీలేకపోయినప్పటికీ మరీ నిరుత్సాహపడైతే మాత్రం బయటకి రారు. నటీనటుల పెర్ఫార్మన్స్, కొన్ని థ్రిల్లింగ్ మోమెంట్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ మొవిఎకి ప్రధాన హైలైట్స్ అయితే స్లో, ఒహ్హాజనితమ్గా మారిన సెకండాఫ్ ఈ సినిమాకి మైనస్ పాయింట్. మల్టీ ప్లెక్స్, ఎ సెంటర్ మరియు కాస్త కొత్తదనం కోరుకునే ప్రేక్షకులను ఆకట్టుకునే ఈ సినిమా బి, సి సెంటర్ ప్రేక్షకులను ఎంతవరకూ ఆకట్టుకుంటుందో చూడాలి.

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5

123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు