సమీక్ష : ఓకే ఓకే – నాట్ ఓకే

సమీక్ష : ఓకే ఓకే – నాట్ ఓకే

Published on Aug 31, 2012 8:30 PM IST
విడుదల తేదీ: 31 ఆగష్టు 2012
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5
దర్శకుడు : ఎం. రాజేష్
నిర్మాత : బెల్లంకొండ సురేష్
సంగీతం: హరీష్ జైరాజ్
నటీనటులు : ఉదయనిధి స్టాలిన్, హన్సిక

నిర్మాతగా రెడ్ జైంట్ మూవీస్ బ్యానర్ స్థాపించి ఘటికుడు, సెవెంత్ సెన్స్ వంటి సినిమాలు తీసిన ఉదయనిధి స్టాలిన్ ‘ఓకే ఓకే’ సినిమాతో హీరోగా మారిపోయారు. తమిళ్లో 6 నెలల క్రితం విడుదలై హిట్ అయిన రొమాంటిక్ లవ్ కామెడీ ఎంటర్టైనర్ ‘ఓకే ఓకే’ (ఒరు కల్ ఒరు కన్నాడి) సినిమాని తెలుగులో అదే పేరుతో విడుదల చేసారు. రాజేష్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాలో స్టాలిన్ సరసన బొద్దుగుమ్మ హన్సిక హీరొయిన్ కాగా హారిస్ జైరాజ్ మ్యూజిక్ ఇచ్చాడు.

కథ :

శరణ్య, పెరుమాళ్ ఏకైక ముద్దుల కొడుకు శ్రీనివాస్ (ఉధయనిది స్టాలిన్). శ్రీనివాస్ మరియు అతని ఫ్రెండ్ బంగార్రాజు (సంతానం) ఇద్దరూ ఐనాక్స్ థియేటర్లో పని చేస్తూ సిగ్నల్ దగ్గర ఆగిన అమ్మాయిల్ని కామెంట్ చేస్తుంటారు. అలా ఒకరోజు సిగ్నల్ దగ్గర ఆగినపుడు మీరా (హన్సిక) ని చూసిన శ్రీనివాస్ ఆమె వెంటపడి ప్రేమించమంటాడు. అందరు అమ్మాయిల్లాగా ప్రేమిస్తున్నా అనగానే కంప్లైంట్ ఇవ్వకుండా శ్రీనివాస్ ని తీసుకెళ్ళి డిప్యూటీ కమీషనర్ అయిన తన తండ్రికి పరిచయం చేస్తుంది. మీ కూతుర్ని ప్రేమిస్తున్నా అనగానే అందరి తండ్రుల్లాగే డిప్యూటీ కమీషనర్ కూడా బెదిరించి పంపిస్తాడు. అయిన భయపడని శ్రీనివాస్, మీరా వెంట పడుతాడు. శ్రీనివాస్ ప్రేమని నమ్మిన మీరా అతన్ని ప్రేమించి పెళ్ళికి సిద్దమవుతుంది. ఇక్కడే కథ ఒక అనుకోని మలుపు తిరుగుతుంది. మీరా, శ్రీనివాస్ ని కాదని వేరే అబ్బాయితో పెళ్ళికి సిద్ధపడుతుంది. శ్రీనివాస్ ని ప్రేమించిన మీరా ఒక్కసారిగా అతని ప్రేమని ఎందుకు కాదంది? చివరికి ఏమైంది అనేది క్లైమాక్స్.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమా హీరో స్టాలిన్ అనుకుంటున్నారు కానీ అసలైన హీరో ఎవరయ్యా అంటే సంతానం సంతానం సంతానం. అదేంటి మూడు సార్లు చెప్పారు అంటారా! అవును డైరెక్టర్ హీరోని నమ్ముకుంటే వర్క్అవుట్ కాదు అనుకున్నాడో ఏమో సంతానంని బాగా నమ్ముకున్నాడు. సినిమాలో హీరోకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో సంతానంకి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇచ్చారు. తెలుగులో అతను చేసిన గత సినిమాలకి అలీ డబ్బింగ్ చెప్పేవాడు. ఈ సారి సునీల్ తో డబ్బింగ్ చెప్పించారు. సునీల్ డబ్బింగ్ సంతానంకి బాగానే కుదిరింది. సంతానం కామెడీ ఫస్టాఫ్ వరకు బాగానే నవ్వించింది. హన్సిక బొద్దుగా హీరోని బాగా డామినేట్ చేసింది. కొన్ని చిన్న పాత్రలకు రఘుబాబు, ధర్మవరపు సుబ్రహ్మణ్యంతో చెప్పించడంతో ఆ కామెడీ సీన్స్ కూడా బాగానే పండాయి. హీరో తల్లిగా చేసిన శరణ్య బాగా నటించింది.

మైనస్ పాయింట్స్ :

డైరెక్టర్ రాజేష్ చాలా చిన్న స్టొరీ లైన్ ని తీసుకుని ఆసక్తికరమైన కథనంతో నడిపించాలని ప్రయత్నించాడు. ఫస్టాఫ్ వరకు సంతానం కామెడీతో ఇంటర్వెల్ వరకు బాగానే లాగినా, సెకండాఫ్ నుండి బోర్ కొట్టడం స్టార్ అయింది. సంతానం కామెడీ కూడా బోర్ కొట్టింది. స్టాలిన్ లో హీరో మెటీరియల్ అస్సలు లేకపోయినా కామెడీతో మేనేజ్ చేద్దామని ట్రై చేసాడు కానీ తేలిపోయాడు. శ్రీనివాస్, మీరా మధ్య లవ్ ట్రాక్ ఏ మాత్రం ఆసక్తికరంగా లేకపోగా ఆ లవ్ ఎపిసోడ్స్ కి సరైన జస్టిఫికేషన్ లేదు. చివర్లో శ్రీనివాస్ ని కాదని వేరే అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడిన మీరాకి శ్రీనివాస్ మీద మళ్లీ ప్రేమ పుట్టించే సన్నివేశాలు తేలిపోయాయి. క్లైమాక్స్ లో ఆర్య, ఆండ్రియా సడన్ ఎంట్రీ ఇచ్చారు కానీ అప్పటి వరకు అంతగా లేకపోవడంతో ఆ ఎపిసోడ్ కూడా పరమ రోతగా సాగింది.

సాంకేతిక విభాగం :

సినిమాకి మరో ప్లస్ హారిస్ జైరాజ్ మ్యూజిక్. అఖిలా అఖిలా, జస్ట్ లైక్, అరెరే అరెరే పాటలు బావున్నాయి. నేపధ్య సంగీతం పర్వాలేదు. బాలసుబ్రమణ్యం సినిమాటోగ్రఫీ చాలా బావుంది. ప్రొడక్షన్ వాల్యూస్ విషయంలో అనవసరమైన హంగు ఆర్భాటాలు లేకుండా సినిమాకి తగ్గట్లుగా ఉంది. జస్ట్ లైక్ పాటలో కోరియోగ్రఫీ చాలా బావుంది.

తీర్పు :

తమిళ్లో ఈ సినిమా హిట్ అవడానికి సంతానం, హన్సిక, హారిస్ జైరాజ్ మ్యూజిక్. సంతానం కామెడీ తమిళ్ ప్రేక్షకులకి ఒక రేంజ్ లో నచ్చింది. సంతానం కామెడీ ఫస్ట్ హాఫ్ లో బాగానే ఉన్నా సెకండ్ హాఫ్ లో ‘పండగ పూట కూడా పాత మొగుడేనా’ అన్న సామెతలా తయారయ్యింది. హీరోలో మేటర్ లేదు, హన్సిక పర్వాలేదు. ఓవరాల్ గా ఓకే ఓకే సినిమా ఎలా ఉంది అంటే చీకేసిన తాటి పండులా ఉంది.

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

అశోక్ రెడ్డి. ఎమ్

Click Here For ‘Ok OK’ English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు