సమీక్ష : రోమియో – పూరి రాసిన బోరింగ్ ప్రేమకథ.!

సమీక్ష : రోమియో – పూరి రాసిన బోరింగ్ ప్రేమకథ.!

Published on Oct 10, 2014 3:16 PM IST
romeo విడుదల తేదీ : 10 అక్టోబర్ 2014
123తెలుగు. కామ్ రేటింగ్ : 2.25/5
దర్శకత్వం గోపి గణేష్  
నిర్మాత : దొరై స్వామి
సంగీతం : సునీల్ కశ్యప్
నటీనటులు : సాయిరాం శంకర్, అడోనిక…


డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తమ్ముడుగా ఇండస్ట్రీకి పరిచయమైన సాయిరాం శంకర్ సరైన బ్రేక్ కోసం ఇప్పటికీ ప్రయత్నిస్తూనే ఉన్నాడు. తనకు బ్రేక్ ఇవ్వడం కోసం పూరి జగన్నాధ్ కథ – డైలాగ్స్ అందించిన సినిమా ‘రోమియో’. సాయిరాం శంకర్ – అడోనిక జంటగా నటించిన ఈ సినిమా ద్వారా పూరి అసిస్టెంట్ గోపి గణేష్ డైరెక్టర్ గా పరిచయం అవుతున్నాడు. రెండు సంవత్సరాల క్రితమే షూటింగ్ పూర్తైన ఈ మూవీ ఫైనాన్సియల్ ఇబ్బందుల వల్ల వాయిదా పడింది. ఎట్టకేలకు మధుర శ్రీధర్ ఎంటర్ అయ్యి, ఈ సినిమాని రిలీజ్ చెయ్యడానికి ముందుకు వచ్చాడు. అలా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ‘రోమియో’ సినిమా ప్రేక్షకులని ఆకట్టుకొని సాయిరాం శంకర్ కోరుకుంటున్న బ్రేక్ ని ఇచ్చిందో లేదో ఇప్పుడు చూద్దాం…

కథ :

ఈ సినిమా కథ న్యూ యార్క్ ఎయిర్ పోర్ట్ లో మొదలై రోమ్, వెరోనాల చుట్టూ తిరిగి అక్కడి నుంచి వైజాగ్ కి వెళ్ళే దారిలో మూవీ ముగుస్తుంది. ఇక అసలు కథలోకి వస్తే ట్రావెలింగ్ అంటే ఇష్టమైన సమంత(అడోనిక) న్యూ యార్క్ నుంచి సైట్ విజిటింగ్ కోసం రోమ్ కి వస్తుంది. అక్కడ సమంతని చూసిన కిట్టు(సాయిరాం శంకర్) షాక్ అవుతాడు. ఆ తర్వాత కిట్టు సమంత పాస్ పోర్ట్ కొట్టేసి తనని పెళ్లి చేసుకోమని బ్లాక్ మెయిల్ చేస్తుంటాడు.. అసలు కిట్టు ఎందుకు సమంతని చూసి షాక్ అయ్యాడు.? ఎందుకు పెళ్లి చేసుకోమని బ్లాక్ మెయిల్ చేస్తాడు.? అసలు కిట్టు అలా చేయడానికి గల కారణం ఏమిటి.? వైజాగ్ కి చెందిన కిట్టుకి – న్యూ యార్క్ కి చెందిన సమంతకి ఉన్న సంబంధం ఏమిటనేది మీరు వెండితెరపైనే చూడాలి..

ఈ సినిమా కథ న్యూ యార్క్ ఎయిర్ పోర్ట్ లో మొదలై రోమ్, వెరోనాల చుట్టూ తిరిగి అక్కడి నుంచి వైజాగ్ కి వెళ్ళే దారిలో కథ ముగుస్తుంది. ఇక అసలు కథలోకి వస్తే ట్రావెలింగ్ అంటే ఇష్టమైన సమంత(అడోనిక) తన ఫ్యామిలీని ఒప్పించి న్యూ యార్క్ నుంచి సైట్ విజిటింగ్ కోసం ఇటలీ లోని రోమ్ కి వస్తుంది. అక్కడ సమంతని చూసిన కిట్టు(సాయిరాం శంకర్) షాక్ అవుతాడు. కిట్టు సమంతని ఫాలో చేసి తన పాస్ పోర్ట్ కొట్టేసి ఏడిపిస్తూ ఉంటాడు. ఒకరోజు నిజం తెలుసుకున్న సమంత కిట్టుని నిలదీయగా కిట్టు తన గతాన్ని చెబుతాడు. గతంలో తను పద్దు అనే అమ్మాయిని ప్రేమించానని, కానీ ఆ అమ్మాయి చనిపోయిందని చెబుతాడు. కానీ అక్కడే ఓ ట్విస్ట్.. ఆ ట్విస్ట్ ఏంటి.? అసలు కిట్టు – పద్దు ప్రేమకి, సమంతకి ఉన్న సంబంధం ఏమిటి.? కిట్టు తన గతం చెప్పిన తర్వాత కథ ఎలాంటి మలుపు తిరిగింది.? అనే అంశాలను మీరు వెండితెరపైనే చూడాలి..

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ లో ముందుగా చెప్పుకోవాల్సింది.. ఈ సినిమాలో అతిధి పాత్రలు పోషించిన రవితేజ, అలీ మరియు జయసుధ గురించి… రవితేజ మూడు సీన్స్ లో కనిపించి తన మేనరిజంతో నవ్విస్తాడు. ‘బుజ్జిగాడు’ సినిమాలో ప్రభాస్ స్టైల్ డైలాగ్స్ మరియు మేనరిజంతో అలీ చేసిన కామెడీ బాగా నవ్విస్తుంది. జయసుధ చేసిన సింగల్ సెంటిమెంట్ సీన్ కూడా బాగుంది.

సాయిరాం శంకర్ తన గత సినిమాల కంటే ఈ సినిమాలో డిఫరెంట్ లుక్ అండ్ గెటప్ లో కనిపిస్తాడు. పూరి రాసుకున్న పాత్రకి సాయిరాం శంకర్ బాగా సరిపోయాడు. ఎనర్జిటిక్ గా ఉండే కొన్ని సీన్స్ చాలా బాగా చేసాడు. ఇక అడోనికకి ఈ సినిమాలో చాలా మంచి రోల్ చేసింది. రెండు డిఫరెంట్ గెటప్స్ లో, సినిమా మొత్తం ట్రావెల్ అయ్యే పాత్రలో తను బాగా చేసింది. అలాగే మోడ్రన్ లుక్ లో గ్లామరస్ గా కనిపించి ఆకట్టుకుంది. వీటితో పాటు కొన్ని చోట్ల చిన్మయి చేత చెప్పించిన డబ్బింగ్ చాలా బాగా సెట్ అయ్యింది. చిన్న పాత్ర చేసిన సుబ్బరాజు కూడా బాగా చేసాడు. సినిమాలో వచ్చే అన్ని పాటలు బాగున్నాయి. అలాగే సినిమా కోసం ఎంచుకున్న లోకేషన్స్ చాలా బాగున్నాయి.

మైనస్ పాయింట్స్ :

ఏ సినిమాకైనా కథే హీరో.. కథ బాగోలేకపోతే ఏది బాగున్నా ఆడియన్స్ ని మెప్పించడం కష్టం. దీని ప్రకారం కథే ఈ సినిమాకి బిగ్గెస్ట్ మైనస్. చాలా రెగ్యులర్ లవ్ స్టొరీ. దాన్ని స్క్రీన్ ప్లే తో ఆసక్తిగా చెప్పడానికి ట్రై చేసారు. కానీ కథ కంటే స్క్రీన్ ప్లే ఎక్కువగా ఫెయిల్ అవ్వడంతో ప్రేక్షకులను అస్సలు ఆకట్టుకోలేకపోయింది. సినిమా మొదటి నుంచి హీరో ఎందుకు బాధపడుతున్నాడనేది చూపించక పోవడం వలన హీరో ఎమోషన్స్ ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వవు. అలా కనెక్ట్ కాకపోతే ఆడియన్స్ ఆ పాత్రతో కనెక్ట్ అవ్వరు. అవ్వలేదు అంటే సినిమా బోర్ కొడుతుంది. అదే ఇక్కడా జరిగింది. ఇకపోతే ఇంటర్వల్ బ్లాక్ లో ఉన్న ఒక ట్విస్ట్ ని రివీల్ చేసెయ్యడంతో తర్వాత ఏమి జరుగుతుంది అనేది ఈజీగా అందరికీ తెలిసిపోతుంది. దీనివల్ల ఆడియన్స్ కి నెక్స్ట్ ఏం జరుగుతుందా? అనే ఆసక్తి ఉండదు.

ఈ సినిమా ఫస్ట్ హాఫ్ చాలా పెద్ద మైనస్ పాయింట్. సినిమా మొదలైన 5-10నిమిషాల తర్వాత నుంచి ఎక్కడవేసిన గొంగలి అక్కడే ఉంది అన్నట్టు అస్సలు ముందుకు కదలదు. చూసే ఆడియన్స్ అంతా ఇక కథలోకి వెళ్ళండి బాబోయ్ అని కేకలు పెడతారు. అలాగే క్లైమాక్స్ కూడా అర్ధరహితంగా ముగిసిపోయినట్టు ఉంటుంది. అలాగే సుబ్బరాజు చేత చేయించిన రాకేష్ పాత్రకి సరైన ఎండింగ్ లేదు. ఇక సెకండాఫ్ లో వచ్చే కొన్ని సీన్స్ బోర్ కొడతాయి. అలాగే ఈ మధ్య కాలంలో సినిమాలో కథ – కథనం చెత్తగా లేదా పరమ రొటీన్ గా ఉన్నా ఎంటర్టైన్మెంట్ ఉంటే చాలు 2 గంటలు ఎంజాయ్ చెయ్యచ్చు అనుకునే ఆడియన్స్ కి కావల్సిన ఎంటర్టైన్మెంట్ అందించడంలో కూడా ఈ సినిమా ఫెయిల్యూర్ ప్రోడక్ట్ అనే చెప్పాలి. ఈ సినిమా నిడివి రెండు గంటలే అయినా చూసేవారు మాత్రం ఏ 3 లేదా 4 గంటల సినిమా చూసామని ఫీలవుతారు.

సాంకేతిక విభాగం :

ఈ సినిమాకి టెక్నికల్ డిపార్ట్ మెంట్ లో బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్ అంటే ముందుగా చెప్పుకోవాల్సింది లోకేషన్స్.. రోమ్, వెరోనా మరియు వైజాగ్ లోని ప్లేస్ లను సినిమాటోగ్రాఫర్ పిజి విందా బాగా చూపించడానికి ట్రై చేసాడు. కానీ డిజిటల్ ఫార్మాట్ వల్ల కొన్ని విజువల్స్ గ్రాండ్ గా తీయగలిగినప్పటికీ కొన్ని చోట్ల మాత్రం నాశిరకంగా అనిపిస్తాయి. ఇక ఆ విజువల్స్ కి ప్రాణం పోసింది మాత్రం సునీల్ కశ్యప్ మ్యూజిక్. తను కంపోజ్ చేసిన సినిమా పాటలు ఎంత బాగున్నాయో, సీన్స్ కి కంపోజ్ చేసిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇంకా బాగుంది. నవీన్ నూలి ఎడిటింగ్ అస్సలు బాగోలేదు. సినిమా నిడివి రెండు గంటలే అయినా ఎక్కడా తన ఎడిటింగ్ తో ఆడియన్స్ లో ఆసక్తిని క్రియేట్ చెయ్యలేకపోయాడు.

ఇక పూరి రాసిన కథ – డైలాగ్స్ విషానికి వస్తే.. కథ – కథలో కొత్తగా ఏమీలేదు, కానీ చాలా రొటీన్ స్టొరీ, అదీ కాక ఎప్పుడు 4 సంవత్సరాల క్రితం రాసుకున్న కథ కావడంలో పాత పడిపోయింది. అస్సలు ఫ్రెష్ గా లేదు. డైలాగ్స్ – కొన్ని చోట్ల పూరి మార్క్ కనపడుతుంది, కొన్ని డైలాగ్స్ బాగానే పేలాయి. ఇక అసిస్టెంట్ నుంచి డైరెక్టర్ గా మారిన గోపి గణేష్ రాసుకున్న స్క్రీన్ ప్లే – కథకు మించి బోరింగ్ గా ఉంది. ఇకపోతే డైరెక్టర్ గా మాత్రం మంచి మార్కులే వెయ్యాలి. ఎందుకంటే చాలా తక్కువ మంది టీంతో ఇంత క్వాలిటీగా సినిమా తీసినందుకు ముందుగా మెచ్చుకోవాలి. ఆ తర్వాత నటీనటుల నుంచి నటనని రాబట్టుకోవడంలో సక్సెస్ అయ్యాడు. గోపి గణేష్ లో విషయం ఉంది, కానీ సరైన స్క్రిప్ట్ తో సినిమా చేస్తే తనకు బ్రేక్ వచ్చే అవకాశం ఉంది. ఇక టచ్ స్టోన్ దొరై స్వామి నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు :

పూరి రాసిన ప్రేమకథ అనే టాగ్ లైన్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా’రోమియో’. పూరి టాగ్ లైన్ వల్ల ఆడియన్స్ మినిమమ్ గ్యారంటీ సినిమాగా అన్నా రోమియో ఉంటుందనుకొని లోపలికి వచ్చిన ఆడియన్స్ సినిమా అయ్యేలోపు ఈ రోమియో పూరి రాసిన పరమ బోరింగు ప్రేమకథ అనుకుంటారు. ఈ సినిమాకి లోకేషన్స్, సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, నటీనటుల పెర్ఫార్మన్స్ చెప్పదగిన ప్లస్ పాయింట్స్ అయితే కథ – స్క్రీన్ ప్లే – ఫస్ట్ హాఫ్- ఎడిటింగ్- ఆకట్టుకోని క్లైమాక్స్ మరియు ఎంటర్టైన్మెంట్ లేకపోవడం ఈ మూవీకి బిగ్గెస్ట్ మైనస్ పాయింట్స్. ఈ సినిమాలో మీరు చూసి బాగా ఎంజాయ్ చెయ్యడానికి ఏమీ లేవు. చివరిగా రోమియో – పూరి రాసిన పర్ఫెక్ట్ ఫెయిల్యూర్ లవ్ స్టొరీ.

123తెలుగు. కామ్ రేటింగ్ : 2.25/5

123తెలుగు టీం

సంబంధిత సమాచారం

తాజా వార్తలు