సమీక్ష : సెల్ఫీరాజా – ఫర్వాలేదనిపించే స్పూఫ్ రాజా..!

సమీక్ష : సెల్ఫీరాజా – ఫర్వాలేదనిపించే స్పూఫ్ రాజా..!

Published on Jul 16, 2016 2:02 PM IST
Selfie raja review

విడుదల తేదీ : 15 జూలై, 2016

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

దర్శకత్వం : జి. ఈశ్వర్ రెడ్డి

నిర్మాత : చలసాని రాంబ్రహ్మం చౌదరి

సంగీతం : సాయి కార్తీక్

నటీనటులు : అల్లరి నరేష, సాక్షి చౌదరి

అల్లరి నరేష్ హీరోగా నటించిన ‘సెల్ఫీ రాజా’ అనే కామెడీ సినిమా ట్రైలర్, పోస్టర్స్‌తో మంచి అంచనాలనే రేకెత్తించింది. కొద్దికాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తోన్న అల్లరి నరేష్‍కు ఈ సినిమా తప్పకుండా మంచి హిట్‌గా నిలుస్తుందన్న ప్రచారం కూడా ఈ సినిమా విషయంలో బాగా జరిగింది. మరి సినిమా నిజంగానే అల్లరి నరేష్ కెరీర్‌కు ఊతం ఇచ్చేలా ఉందా? చూద్దాం..

కథ :

సెల్ఫీ రాజా (అల్లరి నరేష్) సరదాగా కాలం వెళ్ళదీసే ఓ యువకుడు. సిటీ కమీషనర్ కూతురుని (కామ్న రనౌత్) ప్రేమించి పెళ్ళి చేసుకున్న అతడికి నోటి దురుసు వల్ల ఎప్పుడూ ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఇక ఈ నోటి దురుసు వల్లే తన భార్య కూడా అతడికి దూరం అవుతుంది. ఈ క్రమంలో మరే దిక్కూ లేక సెల్ఫీరాజా ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు. తనని కాల్చి చంపమని ఓ క్రిమినల్ (రవిబాబు)ని కోరతాడు. అయితే ఆ క్రిమినల్ మాత్రం సెల్ఫీరాజాను చంపకుండా వేరే పెద్ద ప్లాన్ గీస్తాడు. ఆ ప్లాన్ ఏంటి? ఆ తర్వాత ఈ కథ ఏయే మలుపులు తిరిగిందీ? అన్నదే సినిమా.

ప్లస్ పాయింట్స్ :

అల్లరి నరేష్ కామెడీని ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్‌గా చెప్పుకోవచ్చు. తన కామిక్ రోల్‌లో హీరో అల్లరి నరేష్ శక్తిమేర బాగా నటించాడు. గత కొద్దికాలంగా ప్రయోగాలు చేస్తూ వస్తోన్న నరేష్, ఈ సినిమాలో తన స్టైల్ అయిన స్పూఫ్ కామెడీని మళ్ళీ తెరపైకి తెచ్చాడు. ఈ స్పూఫ్ కామెడీ అందరినీ బాగా ఆకట్టుకుంటుందని చెప్పొచ్చు. అదేవిధంగా కమెడియన్ పృథ్వీతో చేయించిన స్పూఫ్స్ కూడా బాగా నవ్విస్తాయి.

ఫస్టాఫ్‌ను సినిమాకు మంచి అనుకూలాంశంగా చెప్పాలి. ఈ సమయంలో కథ మంచి ఫ్లోతో బాగా నడుస్తుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా బాగా ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్‌లో కామెడీ ఓ హైలైట్‌గా చెప్పుకోవచ్చు. హీరోయిన్‍ కామ్న రనౌత్ మొదటి సినిమా అయినా బాగానే చేసింది. కమెడియన్ శకలక శంకర్ అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేశాడు.

మైనస్ పాయింట్స్ :

ఫస్టాఫ్ తర్వాత సినిమా అంతా దారితప్పిందని చెప్పుకోవాలి. ముఖ్యంగా అనవసరమైన సన్నివేశాలను, పాత్రలను ప్రవేశపెడుతూ ఈ భాగాన్నంతా అర్థం లేనిదిగా మార్చేశారు. రవిబాబు పాత్రకు ఎక్కడా సరైన స్పష్టతనివ్వలేదు. ఆ పాత్రను కథలో జొప్పించిన విధానం కూడా అస్సలు బాగోలేదు. సెకండాఫ్‌లో వరుసగా వచ్చే పాటలు కూడా బాగా ఇబ్బంది పెట్టాయి. సినిమా ఫ్లోను ఈ పాటలు పూర్తిగా ఆపేశాయనే చెప్పుకోవాలి.

ఇక కామెడీ కథకు సరిపడే అవకాశం ఉన్న కథనే అనవసరమైన మలుపులు తిప్పి, అర్థం లేని కామెడీ ట్రాక్‌లు జతచేసి ఈ సినిమాను అసలు కామెడీని బయటకు తీసుకురావడంలో విఫలమయ్యేలా చేశారు.

సాంకేతిక విభాగం :

ముందుగా దర్శకుడు జి. ఈశ్వర్ రెడ్డి విషయానికి వస్తే, ఒక కామెడీ సినిమా నుంచి ప్రేక్షకులు ఏం కోరుకుంటారో వాటిని అందించలేక ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి. ఒక పూర్తి స్థాయి కామెడీకి సరిపడే కథ ఉన్నా, సినిమాలో అనవసర సన్నివేశాలను, పాటలను జతచేసి బోర్ కొట్టించాడు. ఇదే కామెడీ కథను ఇంకొంచెం శ్రద్ధగా, నవ్వించే సన్నివేశాలతో రాసుకొని ఉంటే సెల్ఫీ రాజా పరిస్థితి వేరేలా ఉండేది.

సాయి కార్తీక్ సమకూర్చిన సంగీతం బాగున్నా, పాటలన్నీ అసందర్భంగా వచ్చి ఇబ్బంది పెట్టాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ కేవలం ఫర్వాలేదు అనేలా ఉంది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ మాత్రం చాలా బాగున్నాయి.

తీర్పు :

అల్లరి నరేష్ సినిమా అంటే ఏ స్థాయి కామెడీ ఊహిస్తామో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇప్పుడు వచ్చిన ‘సెల్ఫీరాజా’ కూడా అదే కోవలో మెప్పిస్తుందనుకొని వెళితే అనుకున్నంత స్థాయిలో మెప్పించదనే చెప్పాలి. అయితే అల్లరి నరేష్ మార్క్ కామెడీ టైమింగ్, కొన్ని చోట్ల బాగా నవ్వించే స్పూఫ్‌ల కోసం చూస్తే మాత్రం ఈ సినిమా ఫర్వాలేదనిపిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే.. అల్లరోడు పూర్తిగా కాకపోయినా స్పూఫ్‌లతో అక్కడక్కడా నవ్వించాడు.

123telugu.com Rating : 2.75/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు