సమీక్ష : శివమ్ – సాగదీసిన ప్రేమకథ .!

సమీక్ష : శివమ్ – సాగదీసిన ప్రేమకథ .!

Published on Oct 4, 2015 3:50 PM IST
shivam review

విడుదల తేదీ : 2 అక్టోబర్ 2015

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

దర్శకత్వం : శ్రీనివాస్ రెడ్డి

నిర్మాత : స్రవంతి రవికిషోర్

సంగీతం : దేవీశ్రీ ప్రసాద్

నటీనటులు : రామ్, రాశీ ఖన్నా, బ్రహ్మానందం…

కామెడీకి పెద్ద పీట వేస్తూ లవ్ అండ్ యాక్షన్ అంశాలను కలిపి సినిమాలు చేసే యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ మరోసారి తన హిట్ ఫార్ములా ఫార్మాట్ లో చేసిన సినిమా ‘శివమ్’. రామ్ మరోసారి నూతన దర్శకుడు శ్రీనివాస్ రెడ్డిని పరిచయం చేసిన ఈ సినిమాలో రామ్ కి జోడీగా రాశీ ఖన్నా నటించింది. స్రవంతి రవికిషోర్ నిర్మించిన ఈ సినిమా ఈ రోజు వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యింది. మరి ఇప్పటి వరకూ తనకు హిట్ ఇచ్చిన ఫార్మాట్ లోనే చేసిన ఈ ‘శివమ్’ సినిమా ఏ మేరకు ప్రేక్షకులను మెప్పించిందో.? తనకు ఏ స్థాయి విజయాన్ని అందించిందో.? ఇప్పుడు చూద్దాం…

కథ :

ఇద్దరు ప్రేమికుల కోసం ఎంత రిస్క్ అయినా చేసి పెళ్లి చేసే మనస్తత్వం ఉన్న యంగ్ కుర్రాడు మన శివ(రామ్). అవసరం అయితే ఈ విషయంలో ఫ్రెండ్స్ కి చుక్కలు చూపిస్తుంటాడు. శివ ఫాలో అయ్యే సిద్దాంతం మనకు నచ్చే అమ్మాయి ఎదురయ్యేంతవరకు ఎదురు చూడాలి, ఎదురొచ్చాక తన కోసం ఏమన్నా చేయాలి. అలాంటి మెంటాలిటీ ఉన్న హీరో ఒక ప్రేమ జంటకి పెళ్లి చేసి పారిపోతూ ఉన్న టైంలో అనుకోకుండా జడ్చర్ల ఏరియాని వణికిస్తున్న బోజి రెడ్డి(వినీత్ కుమార్) మనుషులని కొడతాడు. అలా కొట్టి వెళ్ళిపోతూ ఉన్న శివ తనూజ అలియాస్ తను(రాశీ ఖన్నా)ని చూసి ప్రేమలో పడతాడు. ఇక తనని వెతుక్కుంటూ కర్నూల్ వెళతాడు. ఇక తన వెంట పడుతూ తనని ప్రేమలో పడెయ్యడానికి ట్రై చేస్తుంటాడు.

కట్ చేస్తే తన మనుషులని కొట్టి తన పరువు తీసిన శివని చంపాలని బోజి రెడ్డి మనుషులు వెతుకుతూ ఉంటారు. మరోవైపు హైదరాబాద్ లో రౌడీయిజం, బిజినెస్ చేసే అభి(అభిమన్యు సింగ్) కూడా శివ కోసం వెతుకుతూ ఉంటాడు. కానీ శివ కోసం వెతికిన అభి ఫైనల్ గా శివని వదిలేసి తనుని ఎత్తుకెళ్ళిపోతాడు. అక్కడి నుంచి సినిమా ఏమైంది.? శివ కోసం వచ్చిన అభి తనుని ఎందుకు ఎత్తుకెళ్ళాడు.? అలాగే శివని మళ్ళీ తన ఊర్లోనే అందరి ముందు చంపి తన పరువును తిరిగి తెచ్చుకోవాలనుకున్న బోజి రెడ్డి నుంచి శివ ఎలా తప్పించుకున్నాడు.? అలాగే అభి లెక్కలు తేల్చి చివరికి తనుతో సెటిల్ అయ్యాడా లేదా అన్నది మీరు వెండితెరపై చూసి తెలుసుకోవాల్సిన కథ.

ప్లస్ పాయింట్స్ :

‘శివమ్’ సినిమాని ప్రారంభించిన విధానం బాగుంది. హీరో పాత్రని డీటైల్ గా వివరించి చెబుతూ రాసుకున్న మొదటి సీన్ చాలా బాగుంటుంది. ఆ సీన్ తర్వాతే వచ్చే పాట, పాటలో డాన్సులు బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ లో రామ్, అతని చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ తో చేసే కొన్ని కామెడీ సీన్స్ బాగానే నవ్విస్తాయి. కృష్ణభగవాన్ ట్రైన్ ఎపిసోడ్, హీరోయిన్ ఇంట్రడక్షన్ సీన్, జడ్చర్ల స్టేషన్ లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్ ఆకట్టుకుంటాయి.

ఇక నటీనటులు ఎలా చేసారు అన్న విషయానికి వస్తే.. ఎనర్జిటిక్ హీరో రామ్ కి ఇలాంటి పాత్రలు చేయడం కొత్తేమీ కాదు. మరోసారి జోష్ ఉన్న పాత్రలో ఫుల్ ఎనర్జీతో చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ముఖ్యంగా కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ తో పాటు, పాటల్లో డాన్సులతో ఆకట్టుకున్నాడు. ఇక రాశీ ఖన్నా కాస్త బలుపు, ఈగో ఉన్న పాత్రలో బాగానే చేసింది. అది కాకుండా గత రెండు సినిమాలకంటే మించి ఈ సినిమాలో గ్లామరస్ గా కనిపించింది. పాటల్లో తన స్కిన్ షో అందరికీ స్పెషల్ ప్యాకేజీ లాంటింది. రామ్ – రాశీ ఖన్నాల టామ్ & జెర్రీ కెమిస్ట్రీ బాగుంది. ముహూర్తాలు, శఖునాలు, సెంటిమెంట్స్ ని ఫాలో అయ్యే విలన్ పాత్రలో అభిమన్యు సింగ్ అక్కడక్కడా బాగానే నవ్వించాడు. శ్రీనివాస్ రెడ్డి, పోసాని కృష్ణమురళి, సప్తగిరి, కృష్ణ భగవాన్ మరియు ఫిష్ వెంకట్ ల ఎపిసోడ్స్ కొన్ని బాగానే పేలాయి.

ఇక సినిమాలో బెస్ట్ అని చెప్పుకోవాల్సి వస్తే పాటల కోసం ఎంచుకున్న లొకేషన్స్ సూపర్బ్. ఆ విజువల్స్ మాత్రం ఆడియన్స్ ని కొత్తగా ఫీల్ అయ్యేలా చేస్తాయి. సెకండాఫ్ లో వచ్చే ఓ చిన్న ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ బాగా ఎమోషనల్ గా ఉంటుంది. ఓవరాల్ గా అక్కడక్కడా వర్కౌట్ అయిన కామెడీ కూడా సినిమాకి మేజర్ ప్లస్. ఫస్ట్ హాఫ్ లో వచ్చే రెండు యాక్షన్ ఎపిసోడ్స్ తో పాటు ఇంటర్వల్ బ్లాక్ కూడా బాగుంటుంది.

మైనస్ పాయింట్స్ :

మైనస్ పాయింట్స్ లో ముందుగా చెప్పాల్సింది.. సినిమా కోసం ఎంచుకున్న కథ.. డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి కొత్త దర్శకుడైనా ఫాత సినిమాల హిట్ ఫార్మాట్ కథనే ఎంచుకున్నాడు. దాంతో పాత్రల పరిచయాలు అయ్యే సరికి సినిమా మొత్తం ఎలా ఉండబోతుందా అనేది ఈజీగా ఆడియన్స్ కి తెలిసిపోతుంది. అలాగే కథనం కూడా అంత ఆసక్తికరంగా లేకపోయింది. ఇలాంటి కథలతోనే వచ్చిన సినిమాలలో సక్సెస్ అయిన పాయింట్ అంటే కథనం బెటర్ గా ఉండడం అలాగే, కామెడీ బాగా వర్క్ అవుట్ అవ్వడం. కానీ ఇందులో కథనం మరియు కామెడీ అనుకున్న స్థాయిలో లేకపోవడం వలన సినిమా చాలా చోట్ల బోరింగ్ కొడుతుంది. ఇకపోతే ప్రీ క్లైమాక్స్ మరియు క్లైమాక్స్ సన్నివేషాలను బాగా అంటే బాగా సాగాదీసేయడమే కాకుండా ఒకానొక టైంలో క్లైమాక్స్ బాగా సిల్లీగా మారిపోతోంది ఎందనే ఫీలింగ్ కూడా ఆడియన్స్ కి కలుగుతుంది.

అలాగే సినిమాకి రన్ టైం చాలా ఎక్కువ, దాదాపు 2 గంటల 48 నిమిషాల సినిమాలో ఒక 20 నిమిషాలన్నా తగ్గిస్తే సినిమా వేగం కాస్త పెరిగే అవకాశం ఉంది. ఎందుకు అంటే సినిమాలో కొన్ని అవసరం లేని ఫైట్స్, కామెడీ కోసం పెట్టిన కొన్ని అనవసర సీన్స్ సినిమాకి అవసరం లేదు. మొదటి 10 నిమిషాల తర్వాత నుంచి సినిమా ఊహాజనితంగా సాగుతుంది. పాటలు విజువల్స్ పరంగా చూడటానికి సూపర్బ్ కానీ సందర్భానుసారంగా కాకుద్నా పాట రావాలి కాబట్టి వచ్చేస్తున్నట్టు వస్తుంటాయి. ఇక లాజికల్ గా అయితే చాలా మిస్టేక్స్ ఉన్నాయి. అలాగే పోసాని కృష్ణ మురళి, శ్రీనివాస్ రెడ్డి, బ్రహ్మానందం లాంటి వారికి సరైన పాత్రలు లేవు, అలాగే వారి పాత్రలు అలా బిహేవ్ చెయ్యడానికి సరైన కారణం ఉండదు. ఇక మనం ఎంత రొటీన్ కమర్షియల్ సినిమాని ఎంచుకున్నా అందులో విలన్ అనే వాడు స్ట్రాంగ్ గా ఉండాలి. కానీ విలన్ గా ఎంచుకున్న వినీత్ కుమార్ తీయండ్రా బళ్ళు, తిప్పండ్రా బళ్ళు అనే పిచ్ లో డైలాగ్స్ చెప్పిచడం వలన పీక్స్ సీన్స్ లో కూడా కామెడీ చేస్తున్నట్టు అనిపిస్తుంది. కావున ఈ సినిమాలో విలనిజం అనేది పెద్దగా పండలేదు.

సాంకేతిక విభాగం :

‘శివమ్’ సాంకేతిక నిపుణులలో కొంతమంది వర్క్ సినిమాకి బాగా హెల్ప్ అయితే, కొన్ని వర్క్స్ మాత్రం బాగా నిరుత్సాహపరిచాయి. ముందుగా బాగున్న వాటి గురించి మాట్లాడితే.. రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి బిగ్గెస్ట్ అసెట్. సినిమాలో ప్రతి ఫ్రేంని చాలా కలర్ఫుల్ గా చూపించాడు. ముఖ్యంగా పాత్రల్లో చూపిన నార్వే లొకేషన్స్ అయితే సింప్లీ సూపర్బ్. వీటితో పాటు రామ్ – రాశీ ఖంనలను కూడా బాగా చూపాడు. దేవీశ్రీ ప్రసాద్ అందించిన ఆడియో ఓకే అనేలా ఉంది, అదే స్థాయిలోనే నేపధ్య సంగీతం కూడా ఉంది. సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళే రేంజ్ లో అయితే దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ లేదు. ఎఎస్ ప్రకాష్ ఆర్ట్ వర్క్ బాగుంది. ఇక పెద్దగా మెప్పించని వాటి విషయానికి వస్తే మధు ఎడిటింగ్ అస్సలు బాలేదు. అంత లెంగ్త్ ఉన్న సీన్స్ ఉన్నాయి, అలాగే అనవసరమైన సీన్స్ ఉన్నా ఆయన ఏ మాత్రం వాటిని కత్తిరించలేదు. పీటర్ హెయిన్స్ కంపోజ్ చేసిన కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నాయి.

ఇక సినిమాకి కెప్టెన్ గా నిలిచి కథ – స్క్రీన్ ప్లే – దర్శకత్వం విభాగాలను డీల్ చేసిన శ్రీనివాస్ రెడ్డి విషయానికి వస్తే.. కథ – టాలీవుడ్ ఓల్డ్ అండ్ రెగ్యులర్ సక్సెస్ఫుల్ కథనే, కానీ రాసుకున్న విధానం అంత బాలేదు. కథనం – ఆసక్తికరంగా లేకపోగా మరీ ఊహాజనితం అయిపొయింది. దర్శకత్వం కూడా ఓకే ఓకే అనుకునేలా ఉంది. ఎందుకు అంటే కొన్ని సీన్స్ లో కంటెంట్ ఉన్నా తెరపై వాటిని 100% చూపించలేకపోయాడు అనే ఫీలింగ్ కలుగుతుంది. శ్రీనివాస్ రెడ్డి – కిషోర్ తిరుమల కలిసి రాసిన డైలాగ్స్ బాగున్నాయి. ఇక స్రవంతి రవికిషోర్ నిర్మాణ విలువలు మాత్రం సింప్లీ సూపర్బ్. ఆయన రిచ్ ప్రొడక్షన్ విలువలే సినిమాకి చాలా పెద్ద హెల్ప్ అయ్యాయి.

తీర్పు :

ఎనర్జిటిక్ స్టార్ రామ్ నుంచి వచ్చిన ‘శివమ్’ సినిమా ఆడియన్స్ చేత జస్ట్ ఓకే అనే పించుకునేలా ఉందే తప్ప పూర్తి స్థాయిలో ఆడియన్స్ ని మెప్పించలేకపోయింది. పాత కథ అయినా అనుకున్న స్థాయిలో కామెడీ వర్క్ అవుట్ కాకపోవడం బిగ్గెస్ట్ మైనస్. సినిమాలో రామ్ ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్, రాశీ ఖన్నా స్కిన్ షో, గ్రాండ్ విజువల్స్, అక్కడక్కడా వర్కౌట్ అయిన కామెడీ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్స్ అయితే రొటీన్ కథ, బోరింగ్ కథనం, లాంగ్ రన్ టైం, కడుపుబ్బా నవ్వించలేకపోయిన కామెడీ ఉండడం, వీక్ క్లైమాక్స్ సినిమాకి బిగ్గెస్ట్ మైనస్ పాయింట్స్. రెగ్యులర్ కమర్షియల్ అంశాలను, నిడివి పెద్దగా ఉన్నా పర్లేదు అనుకునే ఆడియన్స్ ఈ సినిమాని చూడచ్చు.

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు