Like us on Facebook
 
సమీక్ష : శివగామి – భయపెట్టకపోగా బోర్ కొట్టించింది !

'sivagami review

విడుదల తేదీ : ఆగష్టు 05, 2016

123తెలుగు.కామ్ రేటింగ్ : 1.75/5

దర్శకత్వం : సుమంత్

నిర్మాత : తుమ్మలపల్లి రామసత్యనారాయణ

సంగీతం : త్యాగరాజ్-గురుకిరణ్

నటీనటులు : మనీష్ ఆర్య, ప్రియాంకరావు, బేబి సుహాసిని

ఇతర భాషల్లో ఘన విజయం సాధించిన హర్రర్ చిత్రాలు తెలుగులోకి డబ్ కావడం ఓ సాంప్రదాయంగా మారింది. అలా వచ్చిన సినిమాలు కొన్ని మంచి విజయాలు సాధించాయి కూడా. ఈ కోవలోనే కన్నడ భాషలో వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కి విడుదలై ఘన విజయం సాధించిన ‘నాని’ చిత్రం ‘శివగామి’ పేరుతో తెలుగులోకి అనువదింపబడింది. ఈరోజే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం ..

కథ :

పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటున్న ఓ వ్యక్తి (మనీష్ ఆర్య) తన పూర్వీకుల ఆస్థి, వైజాగ్, అరకు ప్రాంతంలో ఉండే ఓ బంగ్లాను తిరిగి కొనుక్కుని తన భార్యతో సహా ఆ బంగ్లాలోకి కాపురానికి వెళతాడు. అలా వెళ్లిన అతనికి రకరకాల కష్టాలు ఎదురవుతాయి. ఆ ఇంట్లో ఎన్నాళ్లగానో ఉన్న ఒక దెయ్యం అతని భార్య మంత్ర (ప్రియాంకరావు)ను ఆవహించి అందరినీ చంపాలని చూస్తుంది. మంత్రను ఆవహించిన ఆ దెయ్యం ఎవరు ? దాని వెనకున్న కథ ఏమిటి ? ఆ దెయ్యం బారి నుండి మంత్రను ఆమె భర్త ఎలా కాపాడుకున్నాడు ? అనేదే ఈ సినిమా కథ…

ప్లస్ పాయింట్స్ :

వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో ప్లస్ పాయింట్స్ విషయానికొస్తే ముందుగా చెప్పుకోవలసింది సినిమా రెండవ భాగంలో రివీల్ అయిన బంగ్లాలో ఉన్న దెయ్యం కథ. 1985 – 1997 ల మధ్యకాలంలో వాస్తవంగా జరిగిందని చెబుతున్న ఈ కథ సినిమా మొత్తానికి హైలెట్ గా నిలిచింది.

ఓ జంట తమకు బిడ్డలు పుట్టే అవకాశం లేనందున ఐవీఎఫ్ పద్దతి ద్వారా ఓ పాపను కనడం, ఆ పాప పడ్డ కష్టాలు, చనిపోయిన తీరు, దెయ్యంగా మారడానికి కారణం వంటి అంశాలు బాగానే కనెక్టయ్యాయి. అలాగే మొదటి భాగం ఆరంభంలో దర్శకుడు గ్రాఫిక్స్ సహాయంతో తెరకెక్కించిన కొన్ని దెయ్యానికి సంబందించిన సన్నివేశాలు పరవాలేదనిపించాయి.

మైనస్ పాయింట్స్ :

ఈ చిత్రంలో మైనస్ పాయింట్స్ విషయానికొస్తే ముందుగా చెప్పుకోవలసింది హర్రర్ సినిమా కాబట్టి భయపెట్టే సన్నివేశాల పేరుతో దర్శకుడు తీసిన చాలా అనవసరపు సన్నివేశాలు. ఏవేవో ఎఫెక్టులు పెట్టి తీసిన ఈ సన్నివేశాలన్నీ పాత సినిమాల్లోలాగే రొటీన్ గా ఉండి రిపీట్ అవుతూ విసుగు తెప్పిస్తాయి. ఎంతసేపటికి సినిమా అసలు కథలోకి వెళ్ళకపోవడం చిరాకు తెప్పిస్తుంది.

అలాగే సెకెండ్ హాఫ్ లో దెయ్యం తన ప్రతాపాన్ని చూపించే సీన్ ఒక్కటంటే ఒక్కటి కూడా లేకపోవడం అసలు ఇది హర్రర్ సినిమానేనా అనిపించేలా చేసింది. ఇక క్లైమాక్స్ లో అసలు కథ రివీల్ అయ్యాక ఆ దెయ్యాన్ని తరిమే పద్దతి కూడా పాతదిగా, రొటీన్ గా ఉండి ఇక చూడకపోయినా మిస్సయ్యేదేమీ లేదులే అనిపించింది. మొదటి భాగంలో గాని, రెండవ భాగంలోగాని ఎక్కడా కూడా ఆసక్తికరమైన స్క్రీన్ ప్లే, కొత్తదనం కనిపించలేదు. పైగా అసలే సినిమా బోర్ కొట్టిస్తుంటే మధ్యలో వచ్చే పాటలు మరింత చిరాకు తెప్పిస్తాయి.

సాంకేతిక విభాగం :

కథలో ఫ్లాష్ బ్యాక్ మంచి పాయింటే కానీ దర్శకుడు సుమంత్ దాన్ని ప్రస్తుతానికి కనెక్ట్ చేస్తూ సరైన స్క్రీన్ ప్లే రాసుకోలేకపోయాడు. పైగా హర్రర్ సినిమాకి ఉండవలసిన అసలైన భయపెట్టే సన్నివేశాలను ఎక్కడా కూడా బలంగా రూపొందించలేదు. ఇక సురేష్ అందించిన సినిమాటోగ్రఫీ సినిమాని రిచ్ గా, క్లియర్ గా చూపించింది. త్యాగరాజ్, గురుకిరణ్ ల సంగీతం అంతగా ఆకట్టుకోలేదు. తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మాణ విలువ బాగున్నాయి.

తీర్పు :

వాస్తవ కథలు, అదీ హర్రర్ సినిమాలంటే ముఖ్యంగా ఉండవలసింది ఉత్కంఠ గొలిపే స్క్రీన్ ప్లే, భయపెట్టే సన్నివేశాలు. వాటికి తగ్గట్టు బ్యాక్ గ్రౌండ్ స్కోర్. కానీ ఈ సినిమాలో అవేమీ ఉండవు. సెకెండ్ హాఫ్ లో వచ్చే దెయ్యం శివగామి ఫ్లాష్ బ్యాక్ తప్ప ఇందులో ఆకట్టుకునే వేరే అంశాలేవీ లేవు. మొత్తం మీద ఈ ‘శివగామి’ చిత్రం కాస్తైనా భయపెట్టకపోగా బోర్ కొట్టించి వదిలింది.

123telugu.com Rating : 1.75/5

Reviewed by 123telugu Team

Click here for English review

Bookmark and Share