సమీక్ష : వివేకం – సామాన్య ప్రేక్షకులకు కష్టమే

సమీక్ష : వివేకం – సామాన్య ప్రేక్షకులకు కష్టమే

Published on Aug 25, 2017 4:20 PM IST
Vivekam movie review

విడుదల తేదీ : ఆగష్టు 24, 2017

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

దర్శకత్వం : శివ

నిర్మాత : సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్, టి.జి. త్యాగరాజన్

సంగీతం : అనిరుద్

నటీనటులు : అజిత్, కాజల్, వివేక్ ఒబెరాయ్

తమిల్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన తాజా చిత్రం ‘వివేకం’. అజిత్ తో గతంలో ‘వీరం, వేదాళం’ వంటి సినిమాల్ని రూపొందించిన శివ ఈ సినిమాని డైరెక్ట్ చేశారు. భారీ అంచనాల నడుమ తమిళంతో పాటు తెలుగులో కూడా ఈరోజే విడుదలైన ఈ చిత్రం ఏ మేరకు ఆకట్టుకుందో ఇప్పుడు చూద్దాం..

కథ :
యూరోపియన్ దేశాల్లో ఉండే కౌంటర్ టెర్రరిజం ఏజెన్సీలో పనిచేసే ఏకే (అజిత్ కుమార్) ప్రపంచంలోనే అత్యంత సమర్ధుడైన, తెలివైన ఏజెంట్. ఏ దేశానికీ దొరకని టెర్రరిస్టుల్ని కనిపెట్టి, చంపడం అతని పని. అతనికి ఏజెన్సీ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన న్యూక్లియర్ వెపన్స్ ను పేల్చడానికి కావాల్సిన కోడ్ ను కలిగి ఉన్న హ్యాకర్ నటాషాను పట్టుకునే మిషన్ ను అప్పగిస్తుంది.

ఏకే ఆ మిషన్ ను పూర్తిచేసే సమయానికి అతనితో పనిచేసే ఏజెంట్స్, స్నేహితులు అయిన ఆర్యన్ (వివేక్ ఒబెరాయ్), మరో ముగ్గురు నమ్మక ద్రోహంతో అతని వద్ద నుండి కోడ్ ను లాక్కొని అక్రమార్కులకు ఇచ్చేస్తారు. అంతేకాక ఏకేను ప్రపంచంలోనే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా చిత్రీకరిస్తారు. అలా స్నేహితుల చేతిలో వెన్నుపోటుకు గురైన ఏకే ఎలా తిరిగొచ్చాడు ? తనకి ద్రోహం చేసిన వాళ్ళను అంతం చేసి ఆ కోడ్ ను ఎలా సాధించాడు ? అదే సమయంలో తన భార్య హాసిని (కాజల్) ను ఎలా కాపాడుకున్నాడు ? అనేదే సినిమా.

ప్లస్ పాయింట్స్ :

సినిమాకు ప్రధాన ప్లస్ పాయింట్ హీరో అజిత్ పెర్ఫార్మెన్స్. ఏకే పాత్రలో అజిత్ ప్రతి ఫ్రేమ్ లోను చాలా పవర్ ఫుల్ గా కనిపిస్తూ సినిమా మొత్తం ఆకట్టుకున్నాడు. ప్రతి 10 నిముషాలకొకసారి వచ్చే యాక్షన్ సన్నివేశాల్లో ఆయన పెర్ఫార్మెన్స్, స్టంట్స్ హ్యాట్సాఫ్ అనే రీతిలో ఉన్నాయి. దర్శకుడు శివ కూడా అజిత్ నే ప్రధానంగా చేసుకుని ప్రతి సన్నివేశాన్ని హీరో ఇంట్రడక్షన్ సన్నివేశంలా రూపొందించాడు. దీంతో అజిత్ అభిమానులకు సినిమాలో చాలా చోట్ల ఎంజాయ్ చేసే ఆస్కారం దొరికుతుంది. అలాగే సినిమా మొత్తాన్ని విదేశాల్లోనే చిత్రీకరించడం వలన హాలీవుడ్ స్థాయి విజువల్స్ ను చూసిన ఫీలింగ్ కలిగింది. ప్రతి ఫ్రేమ్ రిచ్ గా, అత్యున్నత సాంకేతికతతో ఉండి కనుల విందు చేశాయి.

ఇక సినిమా ఫస్టాఫ్లో మొదలయ్యే హీరో ఫ్లాష్ బ్యాక్ లో కోడ్ ను సాదించడానికి హీరో చేసే మిషన్ ఆకట్టుకుంది. అలాగే ఇంటర్వెల్ సమయంలో హీరో తన స్నేహితుల చేతిలోనే మోసపోయే సన్నివేశం ఎమోషన్ గా బాగుంది. సెకండాఫ్ లో హీరో తన తెలివితో విలన్లను ఎదుర్కుంటూ, తన భార్యను కాపాడుకునే సన్నివేశాలు కూడా ఆకట్టుకున్నాయి. అలాగే అజిత్, కాజల్ ల మధ్య పండించిన భార్యాభర్తల ఎమోషన్ ను కూడా కొన్ని చోట్ల అలరించింది.

మైనస్ పాయింట్స్ :

ప్రతి సన్నివేశం హీరోకు ఎలివేషన్ లా ఉండటం అనేది అభిమానులకు బాగానే ఉంటుంది కానీ సగటు ప్రేక్షకులకు చిరాకు తెప్పిస్తుంది. సుమారు రెండున్నర గంటలపాటు ఉన్న ఈ సినిమాలో ఎక్కువ శాతం హీరోను పైకి లేపడానికి ఉపయోగించి, ముఖ్యమైన కథ, కథనాల కోసం కొంత రన్ టైమ్ మాత్రమే ఇవ్వడంతో చాలా చోట్ల చిత్రం సాగదీసిన ఫీలింగ్ కలిగింది. దర్శకుడు ప్రతి విషయాన్ని టైమ్, ప్రాంతాల పేర్లతో సహా స్క్రీన్ మీద చూపించినా ఫ్రేమ్స్ అన్నీ వేగంగా కదులుతుండటంతో ఏ సన్నివేశం ఏ ప్రాంతంలో, ఎప్పుడు, ఎవరి మధ్య జరుగుతుందో అర్థం చేసుకునే సమయం దొరకలేదు. దీని వలన క్లారిటీ మిస్సై ప్రేక్షకులు కొంచెం ఇబ్బంది ఫీలవుతారు.

ముఖ్యంగా ఫస్టాఫ్ మొదటి 15 నిముషాల సినిమా అయితే అసలు ఏం జరుగుతుందో, ఏ పాత్ర ఏమి అనేది అర్థంకాదు. అలాగే ఇంటర్వెల్ అనంతరం హీరో విలన్ లకు మధ్య నడిచే మైండ్ గేమ్ ఎక్కువైనట్లు అనిపించింది. ఎక్కడా ఆకట్టుకునే డ్రామా కనబడలేదు. అలాగే ప్రపంచ దేశాలన్నీ కలిసి ఎలాంటి సపోర్ట్ లేని ఏకేను పట్టుకోలేకపోవడం అనేది లాజిక్స్ కు కొంచెం దూరంగా ఉంటుంది. ఇక సరైన డ్రామా, పెద్ద హీరోల వద్ద నుండి ఆశించే ఇతర రెగ్యులర్ అంశాలు లేకపోవడంతో తెలుగు ప్రేక్షకులకు యాక్షన్ సీన్లు మినహా చాలా సన్నివేశాలు డ్రైగా అనిపిస్తాయి.

సాంకేతిక విభాగం :

దర్శకుడు శివ రాసుకున్న కథ, కథనం చెప్పుకోడానికి బాగానే ఉన్నా స్క్రీన్ మీద మాత్రం గొప్ప స్థాయిలో కనబడలేదు. హీరో, అతని ఎలివేషన్, యాక్షన్ సన్నివేశాలు మినహా ఆకట్టుకునే డ్రామా లేకపోవడంతో మిగతా సినిమా మొత్తం కొంచెం అర్థంకాకుండా ఇంకొంచెం చప్పగా నడిచింది. ఇక వెట్రి కెమెరా పనితనం అద్భుతంగా ఉంది. ఫారిన్ లొకేషన్లో తీసిన ప్రతి సీన్, ప్రతి ఫ్రేమ్ చూడటానికి గొప్పగా అనిపించాయి. ముఖ్యంగా సాంకేతికతను వాడుకున్న తీరు అద్భుతంగా అనిపించింది.

యాక్షన్ సీక్వెన్స్ లను చాలా బాగా రూపొందించారు. ప్రతి యాక్షన్ సన్నివేశం ఎంజాయ్ చేసే విధంగా ఉంది. అనిరుద్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లౌడ్ గా ఉండి ఇబ్బందిపెట్టాయి. రూబెన్ ఎడిటింగ్ లో ఇంకొంచెం స్పష్టత పాటించి ఉండాల్సింది. పాత్రల తెలుగు డబ్బింగ్ బాగానే ఉంది. నిర్మాతలు పాటించిన నిర్మాణ విలువలు గొప్ప స్థాయిలో ఉన్నాయి.

తీర్పు :

అజిత్ చేసిన ‘వివేకం’ అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ఆయన అభిమానుల వరకు అయితే ఓకే కానీ మిగతా ప్రేక్షకులకు కష్టంగానే అనిపిస్తుంది. అజిత్ పెర్ఫార్మెన్స్, ఆకట్టుకునే యాక్షన్ ఎపిసోడ్స్, మంచి విజువల్స్, అక్కడక్కడా ఆకట్టుకున్న కథనం ఇందులో మెప్పించే అంశాలు కాగా చాలా చోట్ల అసలేం జరుగుతుంది, ఏ పాత్ర ఎందుకు అనే విషయాలు సరిగా అర్థం కాకపోవడం, డ్రామా మిస్సవడం, యాక్షన్ తప్ప మిగిలిన రెగ్యులర్ ఎంటర్టైనింగ్ అంశాలు లేకపోవడం ఇబ్బంది కలిగించే అంశాలు. మొత్తం మీద చెప్పాలంటే ఈ ‘వివేకం’ అభిమానులకు ఓకే కానీ సామాన్య ప్రేక్షకులకు కష్టంగానే ఉంటుంది.

123telugu.com Rating : 2.25/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు