సమీక్ష : యమపాశం – నిరుత్సాహపరిచే జాంబీస్.!

సమీక్ష : యమపాశం – నిరుత్సాహపరిచే జాంబీస్.!

Published on Feb 26, 2016 2:46 PM IST
Yama Paasham review

విడుదల తేదీ : 26 ఫిబ్రవరి 2016

123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5

దర్శకత్వం : శక్తి సౌందర్ రాజన్

నిర్మాత : ముఖేష్ ఆర్ మెహత

సంగీతం : డి. ఇమాన్

నటీనటులు : జయం రవి, లక్ష్మీ మీనన్..

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పటి వరకూ రాని జాంబీ జానర్ లో వచ్చిన మొదటి సినిమా ‘మిరుథన్’. గత వారం తమిళంలో రిలీజై డీసెంట్ అనిపించుకున్న ఈ సినిమాని తెలుగులోకి డబ్ చేసి ‘యమపాశం’ పేరుతో ఈ వారం రిలీజ్ చేశారు. జయం రవి, లక్ష్మీ మీనన్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకి శక్తి సౌందర్ రాజన్ దర్శకుడు. జాంబీ జానర్లో వచ్చిన మొదటి సినిమా తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో ఇప్పుడు చూద్దాం..

కథ :

యమపాశం సినిమా కథ ఊటీలో మొదలవుతుంది. ఒక కెమికల్ ఫ్యాక్టరీలోని విష పదార్థాలను బయటకి తీసుకెళ్ళే సమయంలో కొంత లీక్ అవుతుంది. ఆ విషపదార్ధం తాగిన ఓ కుక్క విచిత్రంగా మారడమే కాకుండా, క్రూర జంతువుగా తయారవుతుంది. అది ఇంకొకరిని కొరకడం వలన ఆ మనిషిలోకి ఆ వైరస్ ప్రవేశించి కొద్ది సేపటికే జాంబీ(మనుషులకి కొరికి రక్తం తాగే నరరూప రాక్షులుగా మారడం)లుగా మారిపోతారు. అలా ఈ వైరస్ ఒకరి నుంచి ఒకరికి పాకి ఊటీ అంతా జాంబీ సామ్రాజ్యంగా మారుతుంది. ఆ ఊటీలో ట్రాఫిక్ పోలీస్ గా పనిచేస్తున్న కార్తీక్(జయం రవి)కి తన చెల్లెలు విద్య(అనిఖ సురేంద్రన్) అంటే చాలా ఇష్టం. కానీ ఉదయం లేవగానే విద్య కనిపించదు.

ఏమైందా అని బయటకి వచ్చి చూస్తే జాంబీలు అతనిపై అటాక్ చేస్తాయి. ఆ తర్వాత అసలు విషయం తెలుసుకున్న కార్తీక్ తన చెల్లెల్ని వెతికే పనిలో ఉండగా రేణుక(లక్ష్మీ మీనన్) నీ చెల్లెలు తన దగ్గరే ఉందని, నీ చెల్లెలిని అప్పగించిన దానికి గాను.. ఆ జాంబీలకు యాంటీ డోస్ కనుక్కోవడం కోసం ఉన్న డాక్టర్స్ టీంని కోయంబత్తూర్ లో మెడికల్ రీసర్చ్ సెంటర్ కి తీసుకెళ్ళాలి అని చెబుతుంది. ఇక ఊటీ నుంచి మొదలైన వీరి ప్రయాణం కోయంబత్తూర్ చేరుకునే వరకూ ఎలా సాగింది. ఈ జర్నీలో వీరు ఎదుర్కున్న ఇబ్బందులు ఏమిటి? ఫైనల్ గా వీరందరూ కోయంబత్తూర్ రీసర్చ్ సెంటర్ కి చేరుకొని ఆ వైరస్ కి మందు కనిపెట్టారా? లేదా? అన్నదే ఈ సినిమా అసలు కథ.

ప్లస్ పాయింట్స్ :

మొట్ట మొదటగా ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ అయిన విషయం ఇప్పటి వరకూ సౌత్ లో రాని జాంబీ మూవీస్ జానర్లో ఈ సినిమా రావడం. ఆ జాంబీ జానర్ మూవీ కోసం అతను ఎంచుకున్న లొకేషన్, కథను అల్లుకున్న తీరు సినిమాకి పెద్ద హెల్ప్ అయ్యింది. ఇకపోతే సినిమా రన్ టైం అనేది కేవలం 106 నిమిషాలే కావడం మరో బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. ఇక సినిమా పరంగా చూస్కుంటే.. సినిమాని ఆసక్తికరంగా ప్రారంభించడం, ఆ తర్వాత ఓ చిన్న లవ్ స్టొరీ, అటు నుంచి సీరియస్ గా కథని మార్చడం బాగుంది.

ఇక ఇలాంటి కొత్త తరహా సినిమాలో నటించిన నటీనటుల విషయానికి వస్తే.. జయం రవి చాలా చక్కని నటనని కనబరిచాడు. సింపుల్ పోలీస్ గా, వన్ సైడ్ లవర్ గా, సీరియల్ జాంబీ కిల్లర్ గా పర్ఫెక్ట్ హావ భావాలను పలికించాడు. లక్ష్మీ మీనన్ కనిపించింది చాలా తక్కువ సమయమే, కానీ ఉన్నంతలో బాగా చేసింది. కమెడియన్స్ అయిన శ్రీమాన్, కాళీ వెంకట్ లు అక్కడక్కడా నవ్వించారు. మినిష్టర్ పాత్ర చేసిన మనోహర్ కి తెలంగాణా స్లాంగ్ లో రాసిన డైలాగ్స్ బాగున్నాయి.

మైనస్ పాయింట్స్ :

మొదటగా సినిమా పరంగా ఉన్న మైనస్ ల విషయానికి వస్తే.. ఆసక్తికరమైన ఫస్ట్ హాఫ్ తర్వాత సెకండాఫ్ చాలా బోరింగ్ గా, ఇల్లాజికల్ గా తయారవుతుంది. హీరో బాచ్ వెంటపడే జాంబీలను చంపే విధానంలో ఎస్కేప్ అయ్యే విధానంలో అస్సలు క్లారిటీ లేదు. డైరెక్టర్ అనుకున్న పాయింట్, మొదలు పెట్టిన ఫార్మాట్ బాగానే ఉన్నప్పటికీ ఆ తర్వాత దానిని ముందుకు తీసుకెళ్ళిన విధానంలో మాత్రం బాగా తడబడ్డాడు. లైన్ బాగానే ఉన్నా దానిని పూర్తి కథగా రాసుకునేటప్పుడే ఎంగేజింగ్ గా చెప్పలేకపోయాడు. అలాగే సెకండాఫ్ లోజాంబీ కిల్లింగ్ అనేది మరీ సిల్లీగా అయిపోతుంది. దానికి తోడు వీరు కోయంబత్తూర్ చేరుకునే మార్గంలో వేసే ప్లాన్స్ కూడా చాలా సిల్లీగా ఉంటాయి.

సెకండాఫ్ లో మెయిన్ గా ప్రీ క్లైమాక్స్ (వాటర్ సీక్వెన్స్) మరియు క్లైమాక్స్ జంబీ ఫైట్ సీక్వెన్స్ లు సినిమా ఫ్లోని ఒక్కసారిగా దెబ్బతీయడమే కాకుండా అప్పటి వరకూ సినిమాకి కనెక్ట్ అయ్యున్న ఆడియన్స్ ని డిస్కనెక్ట్ చేస్తుంది. అలాగే ఈ రెండు సీన్స్ చాలా సిల్లీగా కూడా అనిపిస్తాయి. దానికి తోడు బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే సాంగ్ చూసే వారికి ఇరిటేషన్ కలిగిస్తాయి. డైరెక్టర్ ఎంచుకున్న లైన్ మంచిదే అయినా కథ – ఎగ్జిక్యూషన్ పరంగా సగం ఉడికిన అన్నంలా తయారైంది.అలాగే సినిమా మొత్తం యాంటీ డోస్ కనుక్కోవడం మీద నడిపించి చివరికి అలాంటిది ఏమీ సినిమాలో ట్రై చేయనట్టు సెకండ్ పార్ట్ కి లీడ్ ఇచ్చి సినిమాని ముగించడం అసంపూర్ణంగా ఉంటుంది. లాజికల్ గా అయితే జాంబీలని చంపడం అనే కాన్సెప్ట్ మీద మొదటి నుంచీ ఒక క్లారిటీ ఇవ్వలేదు. ఇక డబ్బింగ్ క్వాలిటీ కూడా మెచ్చుకోతగ్గ రీతిలో లేదు. ఇక రెగ్యులర్ సినిమాలలో ఉండే ఎంటర్ టైన్మెంట్ కోరుకునే వారికి కావాల్సిన అంశాలు ఇందులో ఏం లేవు.

సాంకేతిక విభాగం :

జాంబీ కాన్సెప్ట్ తో రానున్న సినిమాకి ది బెస్ట్ షాట్స్ ఉన్న సినిమాటోగ్రఫీ అనేది చాలా అవసరం. ఆ విషయంలో వెంకటేష్ సూపర్ సక్సెస్ అయ్యాడు. మెయిన్ గా ఊటీ లాంటి ప్లేస్ ని విజువల్స్ పరంగా బాగా వాడుకున్నారు. డి.ఇమాన్ అందించిన పాటలకి పర్ఫెక్ట్ డబ్బింగ్ కుదరకపోవడంతో పెద్దగా మెప్పించలేదు. కానీ నేపధ్య సంగీతం మాత్రం బాగా అనిపిస్తుంది కెజె వెంకట రమణన్ ఎడిటింగ్ 50-50 అన్న తరహాలో ఉంది.ఎందుకంటే ఫస్ట్ హాఫ్ ని డీసెంట్ గా అనిపించేలా చేసినా సెకండాఫ్ ని మాత్రం బాగా సాగదీసేసాడు. వెన్నెలకంటి రాసిన డైలాగ్స్ డీసెంట్ గా అనిపించాయి. లెట్ స్లీపింగ్ కార్ప్ సెస్ లై, జాంబీ నైట్స్, వరల్డ్ వార్ జెడ్, నైట్ అఫ్ ది లివింగ్ డెడ్, ది వాకింగ్ డెడ్(టీవీ సీరీస్) అనే హాలీవుడ్ సినిమాల నుంచి ఈ సినిమాలలోని మెయిన్ ఫ్లాట్, సీన్స్ ని, టెక్నిక్స్ ని కాపీ కొట్టడం చెప్పాల్సిన పాయింట్.

ఇక సినిమాకి కెప్టెన్ గా నిలిచిన, శక్తి సౌందర్ రాజన్ విషయానికి వస్తే.. ఏదో కొత్త ఫార్మాట్ లో సినిమా ఉద్దేశంతో జాంబీ జానర్ ఎంచుకున్నాడు అక్కడి వరకూ గుడ్. ఇక జానర్ కోసం అనుకున్న స్టొరీ లైన్, నేపధ్యం బాగుంది కానీ స్టొరీ లైన్ ని పూర్తి కథగా రాసుకున్నది చూస్తే చాలా సిల్లీగా ఉంటుంది. ఇంతోటి దానికా ఈయన జాంబీ జానర్ సెలక్ట్ చేసుకుంది అనే ఫీలింగ్ వస్తుంది. ఇక స్క్రీన్ ప్లే కూడా ఎలా ఉంటుంది అనేది ప్రేక్షకులు ఊహించేయగలరు. ఇక డైరెక్టర్ గా కూడా శక్తి ప్రేక్షకులని థియేటర్స్ లో బోర్ కొట్టకుండా కూర్చోబెట్టడంలో ఫెయిల్ అయ్యాడు. ఓవరాల్ గా డైరెక్టర్ గా ఇది ఫెయిల్యూర్ అనే చెప్పాలి. విజువల్ ఎఫెక్ట్స్ కూడా అంతంత మాత్రంగా ఉన్నాయి. జాంబీ మేకప్ ఫార్మాట్ కూడా బాలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి కానీ డబ్బింగ్ వాల్యూస్ మాత్రం బాలేవు. .

తీర్పు :

సౌత్ కి బాగా సరికొత్త జానర్ అయిన జాంబీ నేపధ్యంలో వచ్చిన మొట్ట మొదటి సినిమా ‘యమ పాశం’ ప్రేక్షకులు పెట్టిన సగం రేటుకి మాత్రమే న్యాయం చేయగలిగింది. సగం అనే ఎందుకు అన్నాను అంటే సినిమాలో సగం మాత్రమే బాగుంది, మిగతా సగం మనకు తలపోటుగా అనిపిస్తుంది. జాంబీ ఫార్మాట్ లో కథ అనగానే ప్రతి హాలీవుడ్ లో ఉండే స్టొరీ లైన్ నే ఇందులోనూ తీసుకున్నారు. అందుకే లైన్ కొత్తగా ఉంది, కానీ ఆ కొత్త జానర్ ఫిల్మ్ ని సరిగా డీల్ చేయలేక, సెకండాఫ్ లో సీన్స్ అస్సలు బాలేకపోవడం వలన సినిమా తేలిపోయింది. ముఖ్యంగా జాంబీ సినిమాల్లో ఉండే ఒక ఇంటెన్స్ ఫీల్ ని ఇందులో చూపలేకపోవడమే ఈ సినిమాని ఆడియన్స్ కి కనెక్ట్ చేయలేకపోయింది. సరికొత్త జానర్, పరవాలేదనిపించే ఫస్ట్ హాఫ్ సినిమాకి ప్లస్ అయితే, బోరింగ్ సెకండాఫ్, భరించలేని క్లైమాక్స్, అస్సలు ఆసక్తి లేని కథనం సినిమాకి బిగ్గెస్ట్ మైనస్. ఓవరాల్ గా జాంబీ జానర్లో వచ్చిన ‘యమపాశం’ సినిమా ప్రేక్షకులను పూర్తి స్థాయిలో నిరుత్సాహపరిచే సినిమాగా మిగిలింది.

123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5
123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు