సమీక్ష: ఏ రోజయితే చూశానో – చూడకపోవడమే మంచిది.

సమీక్ష: ఏ రోజయితే చూశానో – చూడకపోవడమే మంచిది.

Published on Jan 7, 2017 8:50 AM IST
Padamati Sandhya Ragam review

విడుదల తేదీ : జనవరి 06, 2017

123తెలుగు.కామ్ రేటింగ్ : 1.5/5

దర్శకత్వం : బాలా. జి

నిర్మాత : త‌న్నీరు సింహ‌ద్రి, సిందిరి గిరి

సంగీతం : శశి కిరణ్

నటీనటులు : మ‌నోజ్‌నంద‌న్ , స్మితికాచార్య

కొత్త దర్శకులు ఎక్కువ నమ్ముకునే లవ్ ఎంటర్టైనర్ అనే ఫార్ములానే తీసుకుని నూతన దర్శకుడు బాలా. జి తెరకెక్కించిన చిత్రమే ఈ ‘ఏ రోజయితే చూశానో’. మ‌నోజ్‌నంద‌న్ , స్మితికాచార్య జంటగా నటించగా ఈరోజే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

కథ :

కాలేజ్ లో చదువుకునే బాలు (మ‌నోజ్‌నంద‌న్) అనే కుర్రాడు అదే కాలేజీలో చదువుతున్న అదితిని (స్మితికాచార్య) తొలి చూపులోనే ప్రేమిస్తాడు. ఆమెకు తన ప్రేమ చెప్పాలనుకుంటాడు. కానీ అదితికి మాత్రం జీవితంలో ఎదురైన కొందరు మనుషులు, వాళ్ళ జీవితంలోని పరిస్థితుల వలన ప్రేమ మీద, ప్రేమ పెళ్లి మీద నమ్మకం ఉండదు. దాంతో బాలు ప్రేమను రిజెక్ట్ చేస్తుంది.

అలా అదితి ప్రేమను మొదట పొందలేకపోయిన బాలుకు ఆ తరువాత ఆమె ప్రేమ ఎలా దక్కింది ? వాళ ప్రేమకు ఎలాంటి కష్టాలు ఎదురయ్యాయి ? ఆ కష్టాల్ని వాళ్లెలా అధిగమించారు ? అనేదే ఈ సినిమా కథ.

ప్లస్ పాయింట్స్ :

ప్లస్ పాయింట్స్ విషయానికొస్తే ముందుగా చెప్పుకోవాల్సింది ఇంటర్వెల్ తరువాత వచ్చే చిన్నపాటి ట్విస్ట్ గురించి. సినిమా మొత్తంలో ఏదైనా ఇంప్రెస్ చేసిందంటే అది ఆ సన్నివేశమనే చెప్పాలి. కథలోని విలన్, హీరోయిన్, హీరోయిన్ తండ్రి, అన్నయ్య పాత్రల పై వచ్చే ఈ సీన్ కాస్త థ్రిల్లింగ్ గా అనిపించింది. అలాగే హీరోయిన్ కు ప్రేమ మీద చెడు అభిప్రాయం ఏర్పడడానికి దారి తీసిన చిన్న సంఘటన మెప్పించింది.

అలాగే సినిమా కథను కాస్త వెరైటీగా చెప్పాలని దర్శకుడు బాలా. జి ప్రస్తుతాన్ని, గతాన్ని కలుపుకుంటూ చేసిన ప్రయత్నం కాసేపటి తరువాత విసుగు తెప్పించినా ఆరంభంలో మాత్రం కాస్త పర్వాలేదనిపించింది. ఇక హీరో, హీరోయిన్ల మధ్య నడిచే లవ్ ట్రాక్ లో కొన్ని సన్నివేశాలు, ప్రేమలోని అసలైన ప్రిన్సిపల్స్ ని ఎలివేట్ చేసే ఒకటి రెండు సీన్లు ఆకట్టుకున్నాయి. హీరో మ‌నోజ్‌నంద‌న్ తన పాత్రలో బాగానే నటించాడు.

మైనస్ పాయింట్స్ :

సినిమాలోని మైన్స్ పాయింట్స్ విషయానికొస్తే ముందుగా చెప్పుకోవలసింది కథను చెప్పిన విధానం గురించి. కథ పాతదే అయినా దాన్ని చెప్పే విధానమైన కాస్త కూస్తో కొత్తగా ఉండాలి. కానీ ఇందులో సినిమా ఆరంభం తప్పించి మరెక్కడా అలాంటి కొత్తదనం మచ్చుకైనా కనబడలేదు. హీరో హీరోయిన్ల పై నడిచే కొన్ని లవ్ సీన్స్, సెకండాఫ్ లో వచ్చే ఒక చిన్నపాటి ట్విస్ట్ మినహా మరే సన్నివేశం కూడా మెప్పించలేదు.

పైగా అనవసరపు సన్నివేశాలు చాలా ఉండటం మరింత విసుగు తెప్పించింది. కథలోని చాలా పాత్రలను, సందర్భాలను రన్ టైమ్ పెంచడం కోసం బలవంతంగా కథనంలోకి ఇరికించారు. సినిమాలో మంచి సన్నివేశాలు ఎప్పుడు వస్తాయా అని చాలాసేపు ఎదురు చూడాల్సి వచ్చింది. చివరికి ఆ ఎదురు చూపులు కూడా ఫలించలేదు. ప్రతి సీన్ ఏదో ఉండాలి కాబట్టి ఉన్నట్టే ఉన్నాయి.

దర్శకుడు కథనాన్ని ఎక్కడా ఆసక్తికరంగా రాసుకునే ప్రయత్నం చేయలేదు. ఇక హీరో, అతని ఫ్రెండ్స్ మధ్య నడిచే కామెడీ అయితే చాలా చిరాకు పెట్టింది. రొమాంటిక్ ఎంటర్టైనర్ అన్నారు కానీ హీరో హీరోయిన్ల మధ్య ఆ రొమాన్స్ అస్సలు కనిపించలేదు, వాళ్ళ ప్రేమలో ఎమోషన్ ఎక్కడా మైంటైన్ కాలేదు. ఇక సినిమా క్లైమాక్స్ కూడా హడావుడిగా ముంగించేసి శుభం కార్డు వేసేశారు తప్ప అక్కడైనా సినిమాని కాస్త ఎమోషనల్ గా కనెక్ట్ చేసే ప్రయత్నం జరగలేదు.

సాంకేతిక విభాగం :

దర్శకుడు, రచయితగా వ్యవహారించిన బాలా. జి సరైన కథ, కథనం రాసుకోవడంలో, సినిమాని ఆసక్తికరంగా తెరకెక్కించండంలో చాలా వరకూ విఫలమయ్యాడు. ఏ చిన్న అంశంలో కూడా టికెట్టు కొన్న ప్రేక్షకుడికి సంతృప్తినివ్వలేకపోయాడు. నందమూరి హరి ఎడిటింగ్ ఎక్కడా సినిమాకి హెల్ప్ అవలేదు. గణేష్ కొరియోగ్రఫీ, శశి కిరణ్ సంగీతం పర్వాలేదనిపించాయి. సినిమాటోగ్రఫీ అస్సలు బాగోలేదు. త‌న్నీరు సింహ‌ద్రి, సిందిరి గిరి నిర్మాణ విలువలు పర్వాలేదనిపించాయి.

తీర్పు :

రొమాంటిక్ ఎంటర్టైనర్ అంటే కథలో కొత్తదనం లేకపోయినా కథనాన్ని ఆసక్తికరంగా నడిపి, ప్రేమలోని ఫీల్ ను ప్రేక్షకుడికి అందించే ప్రయత్నం జరిగే ఆ సినిమా ఎంతో కొంత సక్సెస్ చూస్తుంది. కానీ ఈ సినిమా విషయంలో అదేం జరగలేదు. సెకంకడాఫ్ చిన్నపాటి ట్విస్ట్, హీరో హీరోయిన్ల మధ్య నడిచే రెండు మూడు లవ్ సీన్స్ ఇందులో ప్లస్ పాయింట్స్ కాగా ఏమాత్రం ఆసక్తికరంగా సాగని కథనం, విసుగు తెప్పించే కామెడీ, ఎమోషన్ లేని లవ్ ట్రాక్, బలవంతంగా జొప్పించిన అనవసరమైన సన్నివేశాలు ఇందులో మైనస్ అంశాలుగా ఉన్నాయి. మొత్తం మీద చెప్పాలంటే ఏదో యూత్ ఫుల్ లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ అని థియేటర్లలోకి వెళితే మాత్రం తలపట్టుకోక తప్పదు.

123telugu.com Rating : 1.5/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు