
‘గోవిందుడు అందరివాడేలే’ సినిమాతో హీరో రామ్ చరణ్, దర్శకుడు కృష్ణవంశిలకు ఎంత పేరొచ్చిందో.. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కు కూడా అంతే పేరొచ్చింది. రామ్ చరణ్ తాతయ్యగా బాలరాజు పాత్రలో ప్రకాష్ రాజ్ జీవించారు. దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా విజయకేతనం ఎగురవేసింది. ఈ సినిమా విజయంలో ముఖ్య భూమిక పోషించిన ప్రకాష్ రాజ్ శనివారం పాత్రికేయులతో సమావేశం అయ్యారు. తన సంతోషాన్ని, సినిమా విశేషాలను తెలియజేశారు. ఆయన చెప్పిన విశేషాలు మీకోసం..
ప్రశ్న) ‘గోవిందుడు అందరివాడేలే’ సక్సెస్ సాదించింది. మీ ఫీలింగ్ ఏంటి..?
స) ఈ సినిమా కథ విన్న క్షణం నుండి రిలీజ్ వరకు నేను ఒకటే మాట చెప్తున్నాను. తెలుగులో చాలా రోజుల తర్వాత వస్తున్న ఒక మంచి సినిమా ఇది. కుటుంబ అనుబంధాలు, ఆప్యాయతలను చూపించే సినిమా. సూపర్ హిట్ అవుతుందని మొదటి నుండి నమ్ముతున్నాను. ప్రేక్షకులు సినిమాను ఆదరించినందుకు రెండు విధాలుగా సంతోషంగా ఉంది. ఒకటి కృష్ణవంశికి హిట్ లభించడం, రెండు ఆ సినిమాలో నేను నటించడం. చాలా హ్యాపీగా ఉన్నాను.
ప్రశ్న) కృష్ణవంశితో విబేధాలు వలన మధుర క్షణాలు కోల్పోయాం అన్నారు. అవి ఏంటి..?
స) కృష్ణవంశి, ప్రకాష్ రాజ్ అనే ఇద్దరు క్రియేటివ్, స్ట్రాంగ్ పర్సన్స్ కలసినప్పుడు కొన్ని సార్లు ఘర్షణలు రావడం సహజం. వాటి వలన ఒక అద్బుతమైన వ్యక్తితో కొన్ని రోజులు మాట్లాడలేకపోయాను. మీమిద్దరం కలిస్తే ఎన్నో విషయాలు చర్చించుకుంటాం. ఎంతో జ్ఞానం వస్తుంది. అవి నేను కోల్పోయాను. ఇకపై మా మాధ్య ఘర్షణలు వచ్చే అవకాశం లేదు. అతన్ని ద్వేషించడం కంటే ఎక్కువగా ప్రేమిస్తాను.
ప్రశ్న) కృష్ణవంశి సినిమాలలో మీ నటనకు ఎక్కువ పేరొస్తుంది. దీనిపై మీ స్పందన..?
స) కృష్ణవంశి కథలు మిగతావారి కంటే నాకు బాగా అర్ధం అవుతాయి. కనెక్ట్ అవుతాయి. అది తెరపై కనిపిస్తుంది. నటించడం నా పని. నా నుండి అత్యుత్తమ నటన రాబట్టుకోవడం దర్శకుల పని. ఒక్కో దర్శకుడిది ఒక్కొక్క శైలి. అంతా వారి చేతుల్లో ఉంటుంది. కృష్ణవంశికి, నాకు మధ్య మంచి రిలేషన్షిప్ ఉంది. కృష్ణవంశిపై నా ప్రేమ నాలో నటుడిని ఆవిష్కరిస్తుంది.
ప్రశ్న) ‘గోవిందుడు..’లో మీరు కూడా హీరో అని అంటున్నారు. దీనిపై మీ స్పందన..?
స) ఈ సినిమాకి నిజమైన హీరో కృష్ణవంశి. తను తీర్చిదిద్దిన పాత్రల్లో గొప్పదనం అలాంటిది. బాలరాజు పాత్ర ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యిందంటే కారణం కృష్ణవంశినే. సినిమా వల్ల నటుడు పుట్టాలి. నటుల కోసం ఏ సినిమా పుట్టదు. ‘గోవిందుడు..’ సినిమాలో మానవ సంబంధాలు, అనుబంధాలు, తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకాయి. రామ్ చరణ్, చిరంజీవి, ప్రకాష్ రాజ్, జయసుధ, యువన్ శంకర్ రాజా ఇలా అందరూ బాగా వర్క్ చేశారు. ప్రతి ఒక్కరు కృష్ణవంశి కథను తెరపై ఆవిష్కరించడానికి ప్రయత్నించారు. ఈ సినిమాతో కృష్ణవంశి తన స్టైల్, టాలెంట్ నిరూపించుకున్నాడు.
ప్రశ్న) మీపై చిత్రీకరించిన ‘నీలి రంగు చీరలోనా..’ పాటకు విశేష స్పందన లభిస్తుంది. మీ ఫీలింగ్ ఏంటి..?
స) మొదట హీరో రామ్ చరణ్ ను అభినందించాలి. ప్రకాష్ రాజ్ పై ‘నీలి రంగు చీరలోనా..’ సాంగ్ షూట్ చేస్తున్నాం అని చెప్పగానే, అతనిపై ఈ పాట షూట్ చేయడం కరెక్ట్ అని వెంటనే ఓకే చెప్పాడు. కథకు చాలా కీలకమైన పాట అది. వంద సన్నివేశాలలో చెప్పే భావాన్ని కృష్ణవంశి ఒక్క పాటలో చెప్పేశాడు. ఆ పాటలో కుటుంబ బంధాలు చూసి హీరో ఇక్కడే ఉండిపోవాలి అనుకుంటాడు. అందుకే ప్రేక్షకులకు ఆ పాట అంత బాగా కనెక్ట్ అయ్యింది.
ప్రశ్న) వేరే నటుడి స్థానంలో మీరు వచ్చారు. మీ అనుభవం బాలరాజు పాత్రకు ఎంతవరకు హెల్ప్ అయ్యింది..?
స) సినిమాలో నటుడిని మార్చడం అనేది వ్యక్తిగత, యూనిట్ సభ్యుల అభిప్రాయంపై ఆధారపడి ఉంటుంది. మొదట బాలరాజు పాత్రకు వేరే నటుడిని తీసుకున్నారు. కొంత షూట్ చేసిన తర్వాత నేటివిటీ మిస్ అవుతుందని చిరంజీవి గారు, కృష్ణవంశి భావించడంతో నన్ను తీసుకున్నారు. సినిమా ప్రేక్షకులకు చేరువకావడం కోసం, నేటివిటీ మిస్ కాకూడదనే ఉద్దేశ్యంతో మాత్రమె నన్ను తీసుకున్నారు.
ప్రశ్న) చరణ్ తో వర్కింగ్ ఎక్స్ పీరియన్స్ ..?
స) నటనలో చరణ్ తో నాకు పోటి లేదు. నేను 300ల సినిమాలలో నటించాను. అతనిది 8 సినిమాల అనుభవం మాత్రమె. కాని, అతనిలో మెచ్యూరిటీ (పరిపక్వత) చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది. కథను నమ్మి, కథకు ఎం కావాలో తెలుసుకుని నటించాడు. ఈ సినిమా విజయంలో అందరికి భాగం ఉందని చెప్పడం ఆహ్వానించదగ్గ పరిణామం. అన్నయ్య(చిరంజీవి)తో నాది 20 ఏళ్ళ అనుబంధం. చరణ్ చిన్నప్పటి నుండి తెలుసు. ఆయనలో మంచి లక్షలను అన్ని చరణ్ లో ఉన్నాయి. నేను చరణ్ ను ఒక బిడ్డలా చూశాను.
ప్రశ్న) సినిమాలో మీకు బాగా నచ్చిన సన్నివేశం..?
స) కంప్లీట్ ‘గోవిందుడు..’ సినిమా, కథ నా మనసును హత్తుకుంది. అందుకనే బాలరాజు పాత్రలో అంతలా జీవించాను. నాకు గౌరవం తీసుకొచ్చిన పాత్ర అది. ఇటువంటి మంచి సినిమాలో నేను కూడా ఒక భాగమైనందుకు చాలా అనందంగా ఉంది. ‘గోవిందుడు..’ కలర్ ఫుల్ పెయింటింగ్ అయితే, నేను ఒక కలర్ మాత్రమె.
చివరగా ఒక మంచి సినిమాను తెలుగు ప్రేక్షకులు ఆదరించినందుకు చాలా సంతోషంగా ఉంది. వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అంటూ ముగించారు.