
అనుష్క.. నటిగా ప్రయాణం మొదలుపెట్టి అప్పుడే పదేళ్ళయిపోయింది. 2005లో విడుదలైన ‘సూపర్’ సినిమాతో తెరగేంట్రం చేసిన ఆమె.. ఈ పదేళ్ళ ప్రయాణంలో ఎన్నో గుర్తుంచుకోదగ్గ పాత్రలను పోషించారు. మంగుళూరులో పుట్టి పెరిగిన అనుష్క, సినిమాల్లోకి రావడానికి ముందు యోగా టీచర్‌గా పనిచేశారు. దర్శకుడు పూరీ జగన్నాథ్ సూపర్ సినిమాలో ఆమెకు హీరోయిన్గా అవకాశమిచ్చారు. మొదటి సినిమాతోనే అందంతో, అభినయంతో తానేంటో నిరూపించుకున్న ఆమె ఆ తర్వాత వెనుతిరిగి చూడాల్సిన అవసరం పట్టలేదు. వరుస అవకాశాలతో, రోజురోజుకూ తనని తాను మార్చుకున్న విధానంతో ఈ రోజుకీ టాప్ హీరోయిన్లలో ఒకరుగా కొనసాగుతున్నారు.
ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో ప్రధాన భూమిక పోషించిన అనుష్క.. పలు లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లోని పాత్రల ద్వారా ఎప్పటికీ గుర్తిండిపోతారు. ‘అరుంధతి’, ‘వేదం’ సినిమాలను అనుష్క కెరీర్‌కు వజ్రాల్లా చెప్పుకోవచ్చు. అప్పటివరకూ కథానాయకుడికి సపోర్ట్ ఇస్తూనే తానేంటో నిరూపించుకోవాల్సిన పాత్రలకే పరిమితమైన అనుష్క.. పూర్తి స్థాయి పాత్రను ఎంత బాగా పోషించగలదో నిరూపించిన సినిమాలుగా వేదం, అరుంధతిలు నిలిచిపోతాయి. ఇక తాజాగా రూపొందుతోన్న రెండు ప్రతిష్టాత్మక చిత్రాలు బాహుబలి, రుద్రమదేవిలు తన కెరీర్లో మరో రెండు వజ్రాలుగా చేరతాయని అనుష్క భావిస్తోంది. అందుకు తగ్గట్టుగానే ఆ పాత్రలకు తనను తాను మార్చుకున్న తీరు అద్భుతమనే చెప్పాలి. ఒక్క మాటలో చెప్పాలంటే కథను నమ్మిన సినిమా ఎలాగైతే చరిత్రను సృష్టిస్తుందో.. ఆ కథకు సార్ధకం చేకూర్చిన కళాకారులూ చరిత్రలో గుర్తిండిపోతారు. అనుష్క.. అలాంటి కథల్లో భాగమై ఇప్పటికే చరిత్ర గుర్తించే స్థాయిలో ఉంది. అలాగే.. ఇకముందూ మరిన్ని మంచి పాత్రలతో మనల్ని ఆకట్టుకోవాలని కోరుకుందాం!