‘జాదూగాడు’.. షూటింగ్ పూర్తి!

Jadugadu
‘ఊహలు గుసగుసలాడే’, ‘దిక్కులు చూడకు రామయ్య’, ‘లక్ష్మి రావే మా ఇంటికి..’, చిత్రాల ద్వారా మంచి పేరు సంపాదించుకున్న యువహీరో నాగశౌర్య తాజాగా ‘జాదూగాడు’గా మన ముందుకు రానున్నాడు. జాదూగాడు షూటింగ్ నేటితో పూర్తైంది. ఈ సినిమాకు చింతకాయల రవి ఫేం యోగేశ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక కేవలం కాళ్ళ భాగం వరకు మాత్రమే కనిపించేలా డిజైన్ చేసిన ఓ ప్రీ ఫస్ట్‌లుక్‌లోని హీరో ఎవరో గుర్తించండి? అంటూ ‘జాదూగాడు’ సినిమా సెమీ ఫస్ట్‌లుక్ విడుదల అయినపుడు ఈ సినిమాపై సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరిగింది. ఆ క్రమంలోనే రకరకాల పేర్లు తెరపైకి వచ్చాయి.

ఇక ఆ తర్వాత విడుదల చేసిన ఫస్ట్‌లుక్ ద్వారా ఆ హీరో నాగశౌర్య అన్న విషయం తెలిసింది. ఫస్ట్‌లుక్ విడుదలకి ముందే ఒక సినిమాకి మంచి హైప్‌ని తీసుకురావడంలో సినిమా యూనిట్ విజయం సాధించింది. ప్రస్తుతమున్న పోటీలో కేవలం కొత్త కథాంశం, కొత్తగా తీస్తే మాత్రమే సరిపోదని భావించారో ఏమో కానీ ఫస్ట్‌లుక్ విషయం నుంచే ఒక కొత్త ఐడియాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సినిమా పట్ల ఆసక్తిని పెంచేశారు. ఇక ఇప్పుడు షూటింగ్ కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధం కానున్నందున ఇంకా ఎటువంటి ఐడియాల ద్వారా సినిమాని జనాల్లోకి తీసుకెళతారో చూడాలి. సోనారిక బదోరియా కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకు వి.వి.ఎన్ ప్రసాద్ నిర్మాత.

Exit mobile version