నా రెండేళ్ళ కష్టం.. ‘కాంచన 2’!

Taapsee
హర్రర్ కాన్సెప్ట్‌కు కామెడీని జోడించడమనే ప్రయోగంతో వచ్చిన ‘కాంచన’ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. ‘ముని’ సినిమాకు సీక్వెల్‌గా ‘కాంచన’ తెరకెక్కగా, ఇప్పుడా సిరీస్‌లో మూడో సినిమా ‘గంగ(ముని 3)’ విడుదలకు సిద్ధమైంది. నృత్య దర్శకత్వం నుంచి నేరుగా సినిమా దర్శకత్వానికి షిఫ్ట్ అయిన రాఘవ లారెన్స్ దర్శకుడిగానూ మంచి విజయాలను నమోదు చేశారు. ఆయన కెరీర్లో ‘కాంచన’, ‘ముని’ సినిమాలు గుర్తుంచుకోదగ్గ సినిమాలుగా చెప్పుకోవచ్చు.

‘గంగ(ముని 3)’ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్‌ను నిన్న విడుదల చేశారు. ట్రైలర్‌ను చూసిన వారంతా కాంచన సినిమాకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా తెరకెక్కిందనే అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. ట్రైలర్ విడుదల సందర్భంగా ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన తాప్సీ సినిమా విశేషాలను ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. తన రెండేళ్ళ కష్టం ‘గంగ'(కాంచన 2) సినిమా అని, ఈనెల 17న విడుదలవుతోన్న ఈ సినిమా అందరికీ నచ్చి తీరుతుందని నమ్మకం వ్యక్తం చేసింది. గత సంవత్సరం తన సినిమా ఏదీ విడుదల కాలేదనీ, ఆ లోటు ’కాంచన 2’ తీరుస్తుందని తెలిపింది తాప్సీ. తెలుగులో ఈ సినిమాకు ‘గంగ’ అనే టైటిల్ పెట్టగా తమిళంలో ‘కాంచన 2’ అని పెట్టడం ఆసక్తికరంగా కనిపిస్తోంది. నిత్యామీనన్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాను బెల్లంకొండ సురేష్ నిర్మించారు.

Exit mobile version