‘మా’ ఎన్నికలు జరిగిన తీరిదీ!

maa-elections
తెలుగు సినీ పరిశ్రమతో పాటు, సామాన్య ప్రజానీకం కూడా ఎప్పుడు విడుదలవుతాయా అని ఎదురు చూసిన ‘మా’ ఎన్నికల ఫలితాలు మొత్తానికి విడుదలయ్యాయి. ఈ ఉదయం జరిగిన కౌంటింగ్‌ ద్వారా ‘మా’ కొత్త అధ్యక్షుడిగా డా. రాజేంద్ర ప్రసాద్ ఎన్నికయ్యారు. తెలుగు సినీ పరిశ్రమలో నటీనటుల సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటైన ‘మా’ అసోసియేషన్‌కు ఎన్నికలు ఎక్కువ సార్లు ఏకగ్రీవంగానే జరిగాయి. గత రెండు దఫాలుగా ‘మా’ అధ్యక్ష పదవిలో ప్రస్తుత ఎంపీ మురళీ మోహన్ కొనసాగుతున్నారు. రాజకీయ కార్యక్రమాల్లో బిజీగా ఉండడంతో ఆయన మళ్ళీ ఈ పదవిని చేపట్టే ఆలోచన చేయలేదు. ఆ క్రమంలోనే 2015-17 దఫాకు పోటీ జరగగా ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్, సహజ నటి జయసుధ అధ్యక్ష పదవికి పోటీ పడ్డారు.

ఇరువర్గాలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకోవడం, సవాళ్ళు విసురుకోవడంతో ఈ ఎన్నికల తంతు సామాన్యుడికీ హాట్ టాపిక్‌గా మారింది. మార్చి 29న ఈ ఎన్నికలకు పోలింగ్ జరిగింది. మొత్తం 702 ఓట్లకు గానూ కేవలం 394 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఎన్నికలు ఎప్పుడో ముగిసినా దీనికి సంబంధించిన కేసొకటి కోర్టు పరిధిలో ఉన్నందున ఫలితాలు వెలువడలేదు. అప్పట్లో ‘మా’ ఎన్నికలను నిలిపివేయాలని ఓ కళ్యాణ్ అనే వ్యక్తి కోర్టులో వేసిన పిటిషన్‌ను స్వీకరించిన కోర్టు, ఎన్నికల నిర్వహణను నిలిపివేయడాన్ని తోసిపుచ్చింది. అయితే.. కోర్టు ఉత్తర్వులు వెలువడే వరకూ ఫలితాలు ప్రకటించకూడదని తెలిపింది. ఆ తర్వాత రెండు మూడు సార్లు వాయిదా పడిన విచారణకు మొన్న తెరపడింది. కేసును సమగ్రంగా పరిశీలించిన కోర్టు పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ పిటిషన్ వేసినందుకు గాను పిటిషనర్‌పై పది వేల జరిమానా కూడా విధించింది.

ఇక కోర్టు నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ రావడంతో ‘మా’ ఎన్నికల ఫలితాల విడుదలకు అన్ని అడ్డంకులు తొలిగాయ్. ఈ ఉదయం (ఏప్రిల్ 17) పది గంటల నుండి ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ చేపట్టాలని ఎన్నికల అధికారి కృష్ణమోహన్ నిర్ణయించారు. ఫిల్మ్ చాంబర్‌లో పదిగంటలకు మొదలైన కౌంటింగ్ గంటలో ముగిసింది. రాజేంద్రప్రసాద్ తన ప్రత్యర్థి జయసుధపై 87ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఎన్నో అంచనాలు, ఆసక్తికర పరిణామాల మధ్య జరిగిన ఈ ఎన్నికల్లో గెలుపు రాజేంద్రప్రసాద్ పక్షాన నిలిచింది.

రెండేళ్ళ కాలానికి గాను ‘మా’ అసోసియేషన్‌కు ఎన్నికైన వారి వివరాలిలా ఉన్నాయి..
రాజేంద్ర ప్రసాద్ – అధ్యక్షుడు
పి. శివకృష్ణ – ఉపాధ్యక్షుడు
మంచు లక్ష్మి – ఉపాధ్యక్షురాలు
తనికెళ్ళ భరణి – కార్యనిర్వాహక అధ్యక్షుడు
శివాజీ రాజా – ప్రధాన కార్యదర్శి
పరుచూరి వెంకటేశ్వర రావు – కోశాధికారి
నరేష్ – సహాయ కార్యదర్శి
రఘుబాబు – సహాయ కార్యదర్శి

Exit mobile version