‘ముని 4’లో రజనీకాంత్?

rajnikanth
‘కొచ్చాడయాన్’ (విక్రమ సింహ), ‘లింగా’ లాంటి రెండు వరుస ఫ్లాపుల తర్వాత తన కొత్త సినిమాల విషయంలో రజనీకాంత్ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ‘లింగా’ విడుదలై దాదాపుగా ఐదు నెలలైన తర్వాత ఓ సినిమాను అనౌన్స్ చేయడం ద్వారా ఈ విషయం మరోసారి స్పష్టమైంది. అదేవిధంగా కొత్తతరం దర్శకులైతే తనను మళ్ళీ కొత్తగా ఆవిష్కరించే ప్రయత్నం చేస్తారన్న ఆలోచనలో ఉన్న రజనీ ‘అట్టకత్తి’, ‘మద్రాస్’ సినిమాల ద్వారా మంచి పేరు తెచ్చుకున్న యువ దర్శకుడు రంజిత్‌ దర్శకత్వంలో ఓ సినిమాను అంగీకరించిన విషయం తెలిసిందే.

ఇక ఇదే కోవలో రజనీ మరో సరికొత్త ప్రాజెక్టు గురించి కూడా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ‘ముని’, ‘కాంచన’, ‘కాంచన 2’ సినిమాల ద్వారా హర్రర్ కామెడీ సినిమాలకు ఓ సరికొత్త నిర్వచనాన్నిచ్చిన రాఘవ లారెన్స్ ‘ముని 4’ను రజనీకాంత్‌తో చేసే ఆలోచనలో ఉన్నారట. ఇదే విషయమై రాఘవ లారెన్స్ మాట్లాడుతూ.. “రజనీ సార్‌కు ఒక యాక్షన్ ఎంటర్‌టైనర్ స్టోరీ, ‘ముని 4’ కథలను వినిపించా. ఆయనకు ఆ రెండు కథలూ బాగా నచ్చాయి. ఇక సినిమా విషయమై ఆయన దగ్గర్నుంచి సమాధానం రాగానే ఆ విషయం తెలియజేస్తా” అంటూ తెలిపారు. మరి రజనీకాంత్ ‘ముని 4’ సినిమాను చేస్తారా? అన్న విషయం తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే!

Exit mobile version