ప్రముఖ దర్శకుడు కోదండరామి రెడ్డి కుమారుడు వైభవ్, తెలుగులోనే హీరోగా ఎంట్రీ ఇచ్చినా ఆ తర్వాత తమిళ సినిమాలతో బిజీగా మారిపోయి అక్కడ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తమిళంలో ఆయన హీరోగా రూపొందిన ‘కప్పల్’ అనే సినిమాను తెలుగులో ‘పాండవుల్లో ఒకడు’ పేరుతో దర్శకుడు మారుతి విడుదల చేయనున్నారు. తమిళంలో మంచి కామెడీ సినిమాగా విజయం సాధించిన ఈ సినిమాను తమిళంలో ప్రముఖ దర్శకుడు శంకర్ తన సొంత ప్రొడక్షన్ హౌస్ ద్వారా విడుదల చేశారు. తెలుగు డబ్బింగ్ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకున్న ‘పాండవుల్లో ఒకడు’ సినిమా ఈనెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హీరో వైభవ్‌తో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు..
ప్రశ్న) ‘పాండవుల్లో ఒకడు’ సినిమా గురించి చెప్పండి?
స) ‘పాండవుల్లో ఒకడు’ అనేది అవుట్ అండ్ అవుట్ కామెడీ సినిమా. పెళ్ళయిన తర్వాత స్నేహితులుగా కలిసి ఉండలేమన్న ఆలోచనతో ఐదుగురు ఫ్రెండ్స్ చిన్నపుడే పెళ్ళనేదే వద్దని ఫిక్స్ అయిపోతారు. అయితే అందులో హీరోకి మాత్రం ప్రేమించి పెళ్ళి చేసుకోవాలనే ఆలోచన ఉంటుంది. ఇలాంటి నేపథ్యంలో ఆ తర్వాత ఏం జరిగిందనేది చాలా కామెడీగా డీల్ చేశాం. తప్పకుండా ఈ తరహా కామెడీ సినిమా అందరికీ నచ్చుతుందన్న నమ్మకం ఉంది.
ప్రశ్న) ఈ సినిమాలో మీ రోల్ ఎలా ఉండబోతోంది?
స) ఈ సినిమాలో నేను వాసు అనే క్యారెక్టర్లో కనిపిస్తా. ముందే చెప్పినట్టు ప్రేమించి పెళ్ళి చేసుకోవాలనుకునే కోరికని ఇతడి జీవితంలో జరిగిన సంఘటనలు, మిగతా నలుగురు స్నేహితులు ఎలా ప్రభావితం చేస్తారనే దాని చుట్టూ నా పాత్ర తిరుగుతుంది. తమిళంలో నటుడిగా కూడా ఈ సినిమా నాకు మంచి గుర్తింపునిచ్చింది. తెలుగులోనూ మంచి గుర్తింపు నిస్తుందని ఆశిస్తున్నా.
ప్రశ్న) తమిళంలో ఈ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది?
స) తమిళంలో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దర్శకుడు శంకర్ గారు ఈ సినిమాను రిలీజ్ చేయడంతో థియేటర్లు కూడా బాగా దొరికాయి. పొంగల్ సీజన్లో ‘ఐ’తో పాటుగా ఈ సినిమా కూడా మంచి కలెక్షన్లు సాధించింది. ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను కూడా అదే స్థాయిలో ఆకట్టుకుంటుందని కచ్చితంగా చెప్పగలను.
ప్రశ్న) తమిళంలో దర్శకుడు శంకర్‌ను ఎలా ఒప్పించగలిగారు?
స) ‘పాండవుల్లో ఒకడు’ దర్శకుడు కార్తీక్, శంకర్ గారి దగ్గర అసిస్టెంట్‌గా పనిచేశారు. ఇది కార్తీక్ మొదటి సినిమా. నచ్చితే ఈ సినిమాను స్వయంగా విడుదల చేస్తానని శంకర్ గారే తెలిపారు. సినిమా చూశాక ఆయన చాలా సంతోషించారు. రెండు మూడు సార్లు చూసి మరీ ఎంజాయ్ చేశారు. ఆయనే స్వయంగా ఒకేసారి మూడు సినిమాలున్నా ధైర్యంగా రిలీజ్ చేశారు.
ప్రశ్న) దర్శకుడు కార్తీక్‌కి ఇది మొదటి సినిమా అంటున్నారు. కామెడీని ఎలా డీల్ చేయగలిగారు?
స) చాలా బాగా చేశాడనే చెప్పాలి. ఈ సినిమాలో ముఖ్యంగా డైలాగ్ బేస్డ్ కామెడీ ఉంటుంది. దాన్ని సరిగ్గా పట్టుకున్నాడు. కొత్త దర్శకుడైనా అనుకున్నది అనుకున్నట్లుగానే చేశాడు. శంకర్ గారి ఫ్లేవర్ ఈ సినిమాలో కూడా కనిపిస్తూంటుంది.
ప్రశ్న) తెలుగులో పూర్తిగా సినిమాలు తగ్గించారెందుకని?
స) అలా ఏం లేదండీ. తెలుగులో నా గత చిత్రం ‘అనామిక’. ఆ సినిమా తర్వాత కూడా వరుసగా ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. అయితే తమిళంలో కొన్ని ప్రాజెక్టులు అప్పటికే సెట్స్‌పై ఉండడంతో చేయలేకపోయా. తప్పకుండా త్వరలోనే తెలుగులో సినిమా చేస్తా.
ప్రశ్న) మీ నాన్నగారి నిర్మాణంలో మళ్ళీ ఎప్పుడు చేస్తున్నారు?
స) నన్ను హీరోగా లాంచ్ చేశాక నాన్న, ‘నీకు నువ్వుగా నటుడిగా నిరూపించుకో’ అన్నారు. ఆయన మాట ప్రకారమే నటుడిగా ఇలా ప్రయాణం మొదలుపెట్టా. నేను తమిళంలో చేస్తున్న సినిమాలు చూసి ఆయన చాలా సంతోషిస్తున్నారు. నేను ఏ సినిమాకు పనిచేసినా ఆయన సలహాలు తీసుకుంటూనే ఉంటా. త్వరలోనే మా బ్యానర్లో మళ్ళీ చేయాలనుంది.
ప్రశ్న) తమిళంలో అజిత్ సినిమాలో ఓ కీ రోల్ చేశారు. తెలుగులో అలాంటి పాత్ర వస్తే చేస్తారా?
స) కచ్చితంగా. సోలో హీరోగా నన్ను నేను నిరూపించుకుంటూనే, ‘గ్యాంబ్లర్’ సినిమాలో లాంటి పాత్రేదైనా తెలుగులో వచ్చినా కచ్చితంగా చేస్తా.
ప్రశ్న) తెలుగులో ఈ సినిమాను దర్శకుడు మారుతి రిలీజ్ చేయడం ఎలా అనిపిస్తోంది?
స) ఈ సినిమాను తెలుగులో దర్శకుడు మారుతి రిలీజ్ చేయడం మా అదృష్టం. తమిళంలో శంకర్ గారు విడుదల చేయడం ఈ సినిమాకు హెల్ప్ అయినట్లుగానే ఇక్కడ మారుతి గారు విడుదల చేయడం కూడా అలానే కలిసివస్తుందని కోరుకుంటున్నా. సరదాగా నవ్వుకునే సినిమా కావడంతో పాండవుల్లో ఒకడు ఇక్కడా తమిళంలోలానే మంచి విజయం సాధిస్తుందని ఆశిస్తున్నా.
ప్రశ్న) ప్రస్తుతం ఏయే సినిమాల్లో నటిస్తున్నారు? భవిష్యత్‌లో మిమ్మల్ని దర్శకుడిగా చూడొచ్చా?
స) ప్రస్తుతం తమిళంలో ఓ రెండు సినిమాలు చేస్తున్నాను. సెప్టెంబర్‌లో ఒక సినిమా విడుదల కానుంది. ప్రస్తుతానికైతే తెలుగు సినిమాలేవీ ఇంకా ఒప్పుకోలేదు. ఇక దర్శకత్వం విషయానికి వస్తే.. ఇప్పటికే కమిటై ఉన్న సినిమాలు పూర్తి చేయాల్సి ఉంది. హీరో కాకముందు పూరీ జగన్నాథ్ గారి దగ్గర అసిస్టెంట్‌గా కూడా పని చేశాను కాబట్టి దర్శకత్వం గురించి కొంతవరకు తెలుసు. అన్నీ కుదిరితే రెండేళ్ళ తర్వాత దర్శకత్వం గురించి ఆలోచిస్తా.
