
‘అత్తారింటికి దారేది’ లాంటి బ్లాక్ బ్లస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయి హీరోగా నటిస్తోన్న సినిమా ‘సర్దార్ గబ్బర్ సింగ్’. గత కొద్దికాలంగా రాజకీయ కార్యక్రమాలతోనే బిజీగా ఉంటూ వచ్చిన పవన్ కళ్యాణ్, మళ్ళీ తన కొత్త సినిమాను లైన్లో పెట్టడానికి ఇంతకాలం పట్టింది. ‘సర్దార్ గబ్బర్ సింగ్’ పేరుతో రూపొందుతోన్న ఈ కొత్త సినిమాకు ‘పవర్’ సినిమా ఫేం బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈమధ్యే సెట్స్‌పైకి వెళ్ళిన ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.
ఓ పక్క రాజకీయ పరమైన కార్యక్రమాలను చూసుకుంటూనే, సర్దార్ గబ్బర్ సింగ్‌ను పూర్తి చేసేస్తున్నారు పవన్. ఇక ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌లుక్ సినిమాపై అంచనాలు పెంచేస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎవరు నటిస్తున్నారనే విషయంలో మొదట్నుంచీ క్లారిటీ కరువైంది. మొదట హీరోయిన్‌గా నటించేది ఎవరనే విషయంపై రకరకాల పేర్లు వినిపించినా, చివరకు తెలుగు, తమిళ, హిందీ సినిమాలతో స్టార్ హీరోయిన్‌గా మారిపోయిన కాజల్‌ను ఎంపిక చేశారు. ఈ విషయమై సినిమా యూనిట్ ఓ ప్రకటన విడుదల చేసింది. శరత్ మరార్ ఈ సినిమాకు నిర్మాత.