4 కోట్లు పలికిన ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ శాటిలైట్ రైట్స్

Subramanyam-for-Sale
మెగాస్టార్ చిరంజీవి మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మేనల్లుడిగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్. వారి మేనల్లుడు అనే మార్క్ తోనే కాకుండా సినిమా సినిమాకి తన నటన మరియు డాన్సులతో తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకుంటూ తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. త్వరలోనే సాయిధరమ్ తేజ్ తన మూడవ సినిమా ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి దిల్ రాజు నిర్మాత.

ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అయినప్పటి నుంచి ఈ సినిమాపై క్రేజ్ ఉంది. ఇటీవలే రిలీజ్ అయిన ఆడియో మరియు ట్రైలర్ కి సూపర్బ్ రెస్పాన్స్ రావడంతో బిజినెస్ కూడా బాగా జరిగిందని, ఇప్పటికే అన్ని ఏరియాల రైట్స్ తో పాటు, శాటిలైట్ రైట్స్ కూడా అమ్ముడు పోయాయని తెలియజేశాం. మాకు అందిన విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. సుబ్రమణ్యం ఫర్ సేల్ శాటిలైట్ రైట్స్ ని మా టీవీ వారు సుమారు 4 కోట్ల మొత్తానికి సొంతం చేసుకున్నారు. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కి హరీష్ శంకర్, దిల్ రాజు ల బ్రాండ్ కూడా తోడవ్వడంతో ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ఈ రేంజ్ అమ్ముడు పోయాయని సమాచారం. సాయి ధరమ్ తేజ్ లాంటి యంగ్ హీరో మూడవ సినిమాకే ఈ రేంజ్ రేటు పలకడం అందరినీ ఆశ్చర్యానికి కూడా గురి చేస్తోంది.

సాయిధరమ్ తేజ్ సరసన రెజీన కసాండ్ర హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్న ఈ సినిమా సెప్టెంబర్ 24న రిలీజ్ కానుంది.

Exit mobile version