
ఎనర్జిటిక్ హీరో రామ్ నటించిన తాజా సినిమా ‘శివమ్’ అక్టోబర్ 2న విడుదలకు సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. స్రవంతి మూవీస్ పతాకంపై స్రవంతి కిషోర్ నిర్మించిన ఈ సినిమా ఇప్పటికే దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఓ హై వోల్టేజ్ లవ్‌స్టోరీగా రూపొందిన ఈ సినిమా ద్వారా శ్రీనివాస్ రెడ్డి దర్శకుడిగా పరిచయం కానున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వంలో రూపొందిన ఆడియోను ఈ సాయంత్రం పెద్ద ఎత్తున విడుదల చేయనున్నారు. స్రవంతీ మూవీస్ సంస్థ సినీ పరిశ్రమలో 30 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో వస్తోన్న సినిమా కావడంతో శివమ్ సినిమా ఆ సంస్థంగా ప్రత్యేకంగా నిలవనుంది.
ఇక ఈ సాయంత్రం హైద్రాబాద్‌లోని శిల్పకళావేదికలో వైభవంగా జరగనున్న ‘శివమ్’ ఆడియోకు ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. హీరో రామ్, హీరోయిన్ రాశిఖన్నాలతో పాటు ఇతర యూనిట్ సభ్యులు, పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో ఈ ఈవెంట్ జరగనుంది. ఈ ఆడియో ఫంక్షన్‌లో దేవిశ్రీ ప్రసాద్ స్పెషల్ పర్ఫామెన్స్ కూడా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇదే వేడుకలో థియేట్రికల్ ట్రైలర్‌ను కూడా విడుదల చేయనున్నారు. ఇక రామ్ నటిస్తోన్న మరో సినిమా హరికథ కూడా ఇప్పటికే సగ భాగానికి పైగా పూర్తైంది.