‘కబాలి’.. రజనీ కాంత్ హీరోగా, తమిళంలో రియలిస్టిక్ సినిమాలతో సంచలన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న పా రంజిత్ తెరకెక్కిస్తోన్న గ్యాంగ్‌స్టర్ సినిమా. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతోన్న ఈ సినిమాపై అనౌన్స్ అయిన రోజునుంచే విపరీతమైన అంచనాలు బయలుదేరాయి. ‘విక్రమ సింహ’, ‘లింగా’ లాంటి వరుస పరాజయాల తర్వాత రజనీ ఓ యువ దర్శకుడితో సినిమా ఒప్పుకోవడం దగ్గర్నుంచీ, భాషా సినిమాతో రజనీకి ఒక స్టైల్‌ను తెచ్చిపెట్టిన గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో రూపొందే సినిమా అవ్వడం వరకూ ‘కబాలికి’ అన్నీ ప్రత్యేకంగా కనిపిస్తూ వచ్చాయి. ఓ వయసు మళ్ళిన గ్యాంగ్‌స్టర్‌గా రజనీ ఈ సినిమాలో కనిపించనున్నారనే ప్రచారం మొదలైనప్పట్నుంచే రజనీ లుక్స్‌పై అంతటా మంచి ఆసక్తి కనిపించింది.
కబాలిలో రజనీ లుక్స్ ఎలా ఉండనున్నాయి? రజనీ ఏ తరహా గ్యాంగ్‌స్టర్‌గా కనిపిస్తారు? ఇలా అభిమానులు రకరకాల ఊహాగానాలకు తెరలేపారు. ఇక ఈ ఎగ్జైట్మెంట్కు తెరదించుతూ ‘కబాలి’ టీమ్ నిన్న సాయంత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్స్‌ను విడుదల చేసింది. ఈ ఫస్ట్‌లుక్‌లో రజనీని చూసిన వారంతా ఆశ్చర్యంలో మునిగిపోయారు. ఔట్ అండ్ ఔట్ స్టైలిష్ లుక్‌లో కాలు మీద కాలు వేసుకొని కూర్చున్న రజనీని ఈ పోస్టర్లో చూడొచ్చు. ఈ పోస్టర్ ద్వారా రజనీ క్యారెక్టరైజేషన్‌తో పాటు, నేపథ్యాన్ని కూడా పరిచయం చేసే ప్రయత్నం చేసినట్లు స్పష్టమవుతోంది.
ఇక ఈ పోస్టర్స్ విడుదలైన కొద్దిసేపటికే సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా నిలిచాయి. ఫేస్బుక్, ట్విట్టర్.. ఇలా సోషల్ మీడియా ప్ల్లాట్ఫర్మ్స్ అన్నీ కబాలి ఫస్ట్‌లుక్ సెన్సేషన్‌కు వేదికగా నిలిచాయి. నేడు చెన్నైలో ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. రజనీ సరసన రాధికా ఆప్టే హీరోయిన్గా నటించనున్నారు. ఇక ఫస్ట్‌లుక్‌తో అభిమానులంతా సంబరాల్లో మునిగిపోవడమే కాక, సినిమాపై మరిన్ని అంచనాలు పెంచేసుకున్నారు.
