‘రుద్రమదేవి’ యూఎస్ ప్రీమియర్ కలెక్షన్స్!

Rudhramadevi
తెలుగు సినీ అభిమాని ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన రోజు రానే వచ్చింది. గుణశేఖర్ ఏళ్ళనాటి కలల ప్రాజెక్ట్‌గా రూపొంది, మూడు సంవత్సరాల కష్టం తర్వాత నేడు ప్రపంచవ్యాప్తంగా ‘రుద్రమదేవి’ సినిమా విడుదలైంది. ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూసిన అభిమానులంతా సంబరాల్లో మునిగిపోయారు. నిన్న అర్థరాత్రి నుంచే సినిమా సందడి మొదలవ్వగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మార్నింగ్ షోతో రుద్రమదేవి హంగామా ఊపందుకుంది. ఇక తెలుగు సినిమాకు అమెరికాలో అద్భుతమైన ఆదరణ కనిపిస్తోన్న నేపథ్యంలో ఈ సినిమాకు అక్కడా మంచి క్రేజ్ కనిపించింది.

ఆ క్రేజ్‌కు తగ్గట్టుగానే సుమారు 150 స్క్రీన్స్‌లో రుద్రమదేవి ప్రీమియర్ షోలు ప్రదర్శితమయ్యాయి. ఇక ఈ ప్రీమియర్ షోస్ ద్వారా 127,276డాలర్లు వసూలు చేసి స్ట్రాంగ్‌గా నిలబడింది. ‘రుద్రమదేవి’ ప్రీయర్ షోస్‌కు ఈ స్థాయి కలెక్షన్స్ రావడం సినిమాకున్న క్రేజ్‌ను మరోసారి స్పష్టం చేసింది. ఇక వీకెండ్స్‌లో కలెక్షన్స్ మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఒక చారిత్రక కథను చెప్పాలన్న గుణశేఖర్ ఆలోచన, అల్లు అర్జున్, అనుష్కల నటన, ఆర్ట్ వర్క్ ఈ సినిమాకు మేజర్ హైలైట్‌గా నిలిచాయి. గుణశేఖర్ స్వీయ నిర్మాణంలో తెరకెక్కించిన ఈ సినిమా సుమారు 80 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొంది తెలుగు, హిందీ, మళయాల భాషల్లో ఒకేసారి విడుదలైంది.

Exit mobile version