
తెలుగులో ‘కిక్’, ‘రేసుగుర్రం’, ‘టెంపర్’ లాంటి పలు సూపర్ హిట్ సినిమాలకు కథా రచయితగా పనిచేసి మంచి క్రేజ్ తెచ్చుకున్న రచయిత వక్కంతం వంశీ దర్శకుడిగా మారి ఓ సినిమాను తెరకెక్కించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు ఓ కథను వినిపించగా, ఆయన ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు పచ్చజెండా కూడా ఊపారు. కాగా ఎన్టీఆర్ వరుసగా ఇతర కమిటైన సినిమాలతో బిజీగా ఉండడంతో ఎన్టీఆర్-వక్కంతం వంశీల సినిమా ఇంకా సెట్స్‌పైకి వెళ్ళలేదు.
ఇదిలా ఉంటే తాజాగా ఈ కాంబినేషన్‌కు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్ మళ్ళీ ఈ ప్రాజెక్టును తెరపైకి తెచ్చాయి. ప్రస్తుతం సుకుమార్‌తో నాన్నకు ప్రేమతో అనే సినిమా చేస్తోన్న ఎన్టీఆర్, ఆ తర్వాత కొరటాల శివతో మరో సినిమా చేయనున్నారు. ఇక ఈ రెండు సినిమాలు పూర్తి కాగానే వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందే సినిమా సెట్స్‌పైకి వెళ్ళనుందని టాక్. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు మార్చిలో ఈ సినిమా లాంచ్ కానుందని, 2016జూలై లేదా ఆగష్టులో సినిమా సెట్స్‌పైకి వెళుతుందని తెలుస్తోంది. ‘ఊసరవెల్లి’, ‘టెంపర్’ సినిమాలతో ఎన్టీఆర్‌కు పవర్ఫుల్ సినిమాలను రాసిన వక్కంతం వంశీ, తాను స్వయంగా దర్శకత్వం వహించే సినిమాకు కూడా అదేస్థాయి స్క్రిప్ట్ రెడీ చేశారని సమాచారం.