
తమిళ స్టార్ హీరో విక్రమ్, ట్రెండింగ్ హీరోయిన్ సమంతల కాంబినేషన్లో విజయ్ మిల్టన్ దర్శకత్వంలో ’10 ఎంద్రతుకుల్ల’ అనే సినిమా రూపొందిన విషయం తెలిసిందే. ప్రముఖ దర్శకుడు మురుగదాస్ నిర్మాణంలో రూపొందిన ఈ సినిమా తమిళనాట ఈ సీజన్లో భారీ క్రేజ్ ఉన్న సినిమాగా నిలిచింది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసుకున్న ఈ సినిమాను అక్టోబర్ 21న పెద్ద ఎత్తున విడుదల కానుంది. ‘ఐ’ తర్వాత విక్రమ్ నటించిన సినిమా కావడంతో ఆ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాను సుమారు 1000కి పైగా స్క్రీన్స్‌లో భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు.
ఇక విక్రమ్, సమంతలతో పాటు దర్శకుడు మురుగదాస్‌కి కూడా తెలుగులో ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా 10 ఎంద్రతుకుల్లను తెలుగులోనూ విడుదల చేసేందుకు దర్శక నిర్మాతలు ప్లాన్ చేశారు. కాగా తెలుగులో ఇదే సమయంలో పలు పెద్ద సినిమాలు వస్తూండడంతో తెలుగు వర్షన్‌ను కొంతకాలం పక్కనపెట్టారు. ప్రస్తుతం సినిమా యూనిట్ అందించిన వివరాల ప్రకారం 10 ఎంద్రతుకుల్ల తెలుగు వర్షన్‌ను నవంబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలుస్తోంది. గతంలో మురుగదాస్ నిర్మాణంలో రూపొందిన ‘జర్నీ’, ‘రాజారాణి’ లాంటి సినిమాలు తెలుగులోనూ మంచి విజయం సాధించిన నేపథ్యంలో 10 ఎంద్రతుకుల్ల తెలుగు వర్షన్ కూడా అదే స్థాయి విజయం సాధిస్తుందని మురుగదాస్ నమ్మకంతో ఉన్నారు.