వెంకీ-మారుతిల సినిమాకు క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్!

Ghibran

భలే భలే మగాడివోయ్ సూపర్ హిట్ తర్వాత దర్శకుడిగా స్టార్ స్టేటస్‌ను కొట్టేసిన మారుతి, తాజాగా విక్టరీ వెంకటేష్‌తో ఓ సినిమాను సిద్ధం చేసిన విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్లో చాలాకాలం క్రితమే ఒక సినిమా మొదలైనా, చివరి నిమిషంలో ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. కాగా మళ్ళీ ఇదే కాంబినేషన్‌లో మరో సినిమా సెట్ అవ్వడం ఆసక్తికర అంశంగానే చెప్పుకోవచ్చు. ‘తులసి’ తర్వాత మళ్ళీ వెంకీ సరసన నయనతార హీరోయిన్‌గా నటించనున్న ఈ సినిమా డిసెంబర్ నెలలో సెట్స్‌పైకి వెళ్ళనుంది.

ఇక ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికర విషయం ప్రస్తుతం హైలైట్‌గా కనిపిస్తోంది. వెంకీ-మారుతిల సినిమాకు తెలుగు, తమిళ భాషల్లో లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అయిన గిబ్రాన్ సంగీతం సమకూర్చనున్నారు. ఇప్పటికే రన్ రాజా రన్, జిల్, ఉత్తమ విలన్, చీకటి రాజ్యం తదితర సినిమాల్లో తనదైన మ్యూజిక్ మ్యాజిక్ చేసి లేటెస్ట్ సెన్సేషన్‌గా నిలిచిన గిబ్రాన్ వెంకీ-మారుతిల సినిమాకు పనిచేయనుండడం విశేషంగా చెప్పుకోవచ్చు. సితార క్రియేషన్స్‌తో కలిపి సురేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమా డిసెంబర్ 16వ తేదీన మొదటి షెడ్యూల్ మొదలుపెట్టనుంది.

Exit mobile version