వందల కోట్లు రేట్లు వల్ల కానీ తగ్గిన ప్రేక్షకుల వల్ల కాదు – ట్రెండ్ తో మొదలైన సంక్షోభంపై బన్నీ వాస్

Bunny-Vas

ఇప్పుడు ఓ పెద్ద హీరో సినిమా వస్తుంది అని సామాన్య ప్రేక్షకుడు దాదాపు వారం పది రోజులు థియేటర్ కి దూరంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొన్న సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా అది ఎంత పెద్ద సినిమా వచ్చినప్పటికీ సాధారణ టికెట్ ధరలు మాత్రమే ఉంటే ఒక్క మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం భారీ ఎత్తున టికెట్ ధరల హైక్ లు పైగా వాటిని వారం పది రోజులు అలానే ఉంచడంతో థియేటర్స్ కి జనం రావడం క్రమంగా తగ్గించి పైరసిలు, అలానే ఓటిటిల బాట పడుతున్నారు. అయితే థియేటర్స్ కి జనం రావడం మానేస్తున్నారు అనే మాటకి ఎక్కువశాతం ఉన్న టికెట్ ధరలే కారణం అని చెప్పవచ్చు. ఒక ఫ్యామిలీ సినిమా చూడాలంటే వారికి వినోదం ఇప్పుడు అందనంత దూరంలో పెడుతున్నారు. ఇలా సింగిల్ స్క్రీన్స్ వంటివి వాటిని రన్ చేసేవారు, డిస్ట్రిబ్యూటర్స్ భారీగా నష్టాలు చూడాల్సి వస్తుంది. దీనితో గత కొన్నాళ్ల నుంచి నెలకొన్న ఈ సంక్షోభంపై లేటెస్ట్ గా ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ బన్నీ వాస్ కూడా స్పందించడం వైరల్ గా మారింది.

తన పోస్ట్ లో సారాంశం ఏంటి అనేది సుత్తి లేకుండా చూద్దాం, ఇప్పుడు సినిమాలు వందల కోట్లు చేస్తున్నాయి అంటే అవి నిజంగా భారీ ఎత్తున జనాదరణ పొందినవి కాదు అని టికెట్ ధరలు అధికంగా పెంచేయడం వల్ల థియేటర్ కి రాకుండా ఉన్న వారి ధరలు ఇతర ఆడియెన్స్ పై వేసిన భారం వల్లే అవుతుంది అని తెలిపారు. ఇక ఇందులో చిన్న సినిమాల పరిస్థితి మరింత దారుణంగా ఉందని వ్యాఖ్యానించారు. రూపాయి పోయి ఇపుడు పావలా మిగిలితే దానిని ఎలా పంచుకోవాలని చాలామంది తర్జనభర్జనలు పడుతున్నారు కానీ రూపాయి ఎలా పోయింది అనే ఆలోచన ఇపుడు మర్చిపోయే పరిస్థితి నెలకొంది అని తాను తెలిపారు. అలానే ఇక్కడ నిర్మాతలు నష్టపోతున్నారు. అదే విధంగా సింగిల్ స్క్రీన్ ఎగ్జిబిటర్లు కూడా నష్టపోతున్నారు, ఇది వాస్తవం. ఇందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఈ పరిస్థితికి అసలు మూలకారణం ఏమిటి? ఉన్న ఆదాయంలో ఎవరు ఎంత పంచుకోవాలి అని వాదించుకోవడం కంటే, ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది గుర్తించి దాన్ని సరిచేసుకోవడం ముఖ్యమా కాదా? అని ప్రశ్నించారు.

అలానే తన అభిప్రాయానికి పలు కారణాలు కూడా ప్రధానంగా ఉన్నాయని రివీల్ చేశారు. ఒకటి హీరోలు సకాలంలో సినిమాలు చేయాలనీ జనాన్ని రప్పించేది హీరోలే వారే చాలా ఎక్కువ సమయం తీసుకుంటే థియేటర్స్ కి వచ్చే జనాభా క్రమంగా తగ్గుతారని అందుకే హీరోలు ప్రభావం తెలుగు ఆడియెన్స్ పై చాలా ఉందని తెలిపారు. అలానే రెండోది సినిమాలను కేవలం 27 రోజుల్లోనే OTTలో విడుదల చేయడం వల్ల ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గిపోవడం. ఇక మూడోది ప్రేక్షకులను ఆకట్టుకునే స్థాయి కంటెంట్ లేకపోవడం. “ఇంత ఖర్చు పెట్టి థియేటర్‌కు వెళ్లాల్సిన అవసరమా?” అనే భావన ప్రేక్షకుల్లో రావడం. నాలుగోది మల్టీప్లెక్సుల్లో అధిక క్యాంటీన్ ధరలు. అని పలు కారణాలు తెలిపారు.

అయితే ఈ నాలుగు కారణాల్లో మూడు కారణాలు మన చేతిలోనే ఉన్నాయి. కంటెంట్ విషయం మాత్రమే పూర్తిగా మన నియంత్రణలో ఉండదు. ఈ మూడు అంశాలను సరిచేయకుండా, ఎంత శాతం పంచుకోవాలి అని వాదించుకున్నా ఉపయోగం లేదు. రేపు వచ్చే ఆ పావలా ఆదాయంలో ఎవరు ఎంత తీసుకోవాలి అని కొట్టుకోవడం తప్ప, దాంతో ఎవరికీ నిజమైన లాభం ఉండదు. మూల సమస్యను సరిచేయకుండా, ఇప్పటికే తగ్గిపోయిన ఆదాయం మీదే పోరాడటం వల్ల ఏం లాభం చేకూరుతుంది? అని తన మనసులో మాటను వెలుబుచ్చారు.

Exit mobile version